రష్యా మిలిటరీ క్యాంపులో తెలంగాణ యువకులు: రక్షించాలని కుటుంబాల వేడుకోలు.!
Published on: Wed Sep 30, 2026 8:52PM

ఉపాధి కోసం రష్యా వెళ్లిన తెలంగాణకు చెందిన నలుగురు యువకులు అనూహ్యంగా అక్కడి మిలిటరీ క్యాంపులో చిక్కుకున్నారని వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఏజెంట్లు నమ్మించి తమ వారిని రష్యాకు తీసుకెళ్లారని కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం తమ పిల్లలు రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతానికి సమీపంలో ఉన్నారన్న సమాచారంతో వారు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. భుక్యా రవీందర్, భుక్యా అశోక్, మెగావత్ ప్రకాశ్, మహమ్మద్ అఫ్జల్ ఖాన్ అనే నలుగురు యువకులు సుమారు ఆరు నెలల క్రితం ఉపాధి కోసం రష్యాకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. హెల్పర్, క్లీనర్, సెక్యూరిటీ గార్డ్ వంటి సివిల్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఏజెంట్లు ఒక్కొక్కరి నుంచి సుమారు రూ.3 లక్షల వరకు డబ్బులు తీసుకున్నారని వారు ఆరోపిస్తున్నారు.
అయితే రష్యా చేరుకున్న తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని కుటుంబాలు చెబుతున్నాయి. సివిల్ ఉద్యోగాలకు బదులుగా యువకులను మిలిటరీ క్యాంపులకు తరలించి, తుపాకులు ఇచ్చి సైనిక శిక్షణ ఇస్తున్నారని వారు పేర్కొంటున్నారు. క్యాంపు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు ఇబ్బందులు ఎదురయ్యాయని ఓ యువకుడు వీడియో ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపినట్లు సమాచారం.ఇక తమ పిల్లలను రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతానికి సమీపంలోకి తరలించే అవకాశం ఉందన్న భయం కుటుంబాలను వెంటాడుతోంది. ఇప్పటికే ఇద్దరు యువకులను ఫ్రంట్‌లైన్‌కు సమీపంలోని ప్రాంతాలకు తరలించినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో తమ పిల్లల భద్రతపై ఆందోళన మరింత పెరిగిందని వారు అంటున్నారు.
ఈ నేపథ్యంలో తమ వారిని ఎలాంటి సైనిక కార్యకలాపాల్లో పాల్గొనకుండా వెంటనే విడిపించి భారత్‌కు తీసుకురావాలని కుటుంబ సభ్యులు తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలను వేడుకుంటున్నారు. ఈ వ్యవహారంపై హైదరాబాద్‌లోని సీఎం ప్రవాసీ ప్రజావాణిని కూడా కుటుంబాలు ఆశ్రయించినట్లు సమాచారం. రష్యా సైన్యంలో భారతీయులు చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ ఉద్యోగాల పేరుతో రష్యాకు వెళ్లిన కొందరు భారతీయులు అక్కడి సైన్యంలో పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కూడా రష్యా అధికారులతో సంప్రదింపులు జరిపి అక్కడ చిక్కుకున్న భారతీయుల విడుదలకు చర్యలు తీసుకున్నట్లు గతంలో ప్రకటించింది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన ఈ నలుగురు యువకుల పరిస్థితిపై వారి కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తమ పిల్లలు సురక్షితంగా స్వదేశానికి తిరిగి వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకోవాలని కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.
[ Russia Military Camp, Telangana Youth, Telangana Four Youths, Russia Ukraine War, Indian Youths in Russia, Russia Army, Telangana Families, Youths Trapped in Russia, Russia Military Recruitment, Civil Jobs Fraud, Agent Fraud, Indian Citizens in Russia ]


