TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

దుష్ప్రచారాన్ని తిప్పికొడతా.. బాధ్యులపై చట్టపరంగా చర్యలు.. రుక్మిణి కోటా హెచ్చరిక.!

Published on: Thu Nov 19, 2026 7:44AM

ఉద్యోగ నియామక మోసానికి సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న దుష్ప్రచారంపై జనసేన నాయకురాలు రుక్మిణి కోటా  స్పందించారు. ఈ వివాదంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె తాజాగా ఒక బహిరంగ ప్రకటన విడుదల చేశారు. తన వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కొందరు కావాలనే కల్పిత కథనాలను ప్రచారం చేస్తున్నారని, ఇలాంటి నిరాధార ఆరోపణలను తాను చట్టబద్ధంగా ఎదుర్కొంటానని ఆమె ఆ ప్రకటనలో విస్పష్టంగా పేర్కొన్నారు. 

 గతంలో తన సంస్థలో పనిచేసిన ఒక ఉద్యోగి తన పేరును, కంపెనీ పత్రాలను దుర్వినియోగం చేసి ఉద్యోగాల పేరిట ఆర్థిక మోసానికి పాల్పడినట్లు పేర్కొన్న రుక్మిణి కోటా,  ఈ అక్రమ వ్యవహారాలన్నీ కార్యాలయ సమయం ముగిసిన తర్వాత, తనకు ఏమాత్రం తెలియకుండా జరిగాయన్నారు. ఈ విషయం తన దృష్టికి రాగానే సదరు ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి, అంతర్గత విచారణ అనంతరం విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు.

అంతేకాకుండా.. ఆ ఉద్యోగిపై తానే స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయపరమైన చర్యలు ప్రారంభించినట్లు రుక్మిణి కోటా స్పష్టం చేశారు. అయితే, అసలు నేరస్థులను వదిలేసి, ఫిర్యాదు చేసిన తననే నిందితురాలిగా చిత్రీకరించేందుకు కొందరు రాజకీయ నాయకులు, కొన్ని మీడియా సంస్థలు ప్రయత్నించడం పట్ల ఆమె తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఈ వివాదంలోకి జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును లాగేందుకు జరుగుతున్న కుట్రలను ఆమె  ఖండించారు. తప్పుడు కథనాలతో ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించాలని చూడటం సరికాదని హితవు పలికారు. 2007లో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి ప్రజారాజ్యం మీదుగా జనసేన వరకు పవన్ కల్యాణ్ ఆశయాలకు కట్టుబడి నిబద్ధతతో పనిచేస్తున్నానని ఆమె గుర్తుచేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ స్థానిక ఎన్నికల్లో జనసేన దూకుడు.. 40 శాతం సీట్లపై పవన్ గురి.!

గత కొన్నేళ్లుగా తనపై జరుగుతున్న వ్యక్తిత్వ హననాన్ని పదవీ నియమాల దృష్ట్యా మౌనంగా భరించానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని కూడా వివాదాల్లోకి లాగుతుండటంతో మౌనం వీడాల్సి వచ్చిందని రుక్మిణి పేర్కొన్నారు. ప్రతీకారం కంటే సంయమనాన్ని, భయం కంటే ధైర్యాన్ని, కక్ష సాధింపు కంటే న్యాయాన్ని తాను ఎంచుకున్నానన్న ఆమె తన మౌనాన్ని బలహీనతగా భావించకూడదు,   తన సహనాన్ని చేతకానితనంగా భావించవద్దని, ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తితో, ఒక వీర మహిళగా ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొడతానని ఆమె ధీమా వ్యక్తం చేశారు.

తాను ఎలాంటి తప్పు చేయలేదని, అందుకే ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని రుక్మిణి స్పష్టం చేశారు. సోషల్ మీడియా వేదికగా తనపై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై  చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. త్వరలోనే ఈ కేసులో అసలు నిజాలు బయటకు వస్తాయని, న్యాయ పోరాటంలో బాధ్యులందరికీ తగిన శిక్ష పడుతుందని రుక్మిణి కోటా ఆశాభావం వ్యక్తం చేశారు.

మీకు నచ్చవచ్చు: పెడన మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి ఘన విజయం.!​

పొత్తు ధర్మం తెలుగుదేశం పాటిస్తే సరిపోతుందా: పవన్ మౌనం వెనుక సంకేతమేంటి.?

[Rukmini Kota, Jana Sena leader, Pawan Kalyan, Job Recruitment Fraud, TeluguOne]