రెండు దశాబ్దాలు.. 30 ట్రాన్స్ ఫర్లు.. లేడీ ఐపీఎస్ ఉద్యోగ ప్రస్థానం.!
Published on: Mon Sep 21, 2026 10:56AM
.webp)
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు తమ సర్వీస్‌లో నిబద్ధతతో, రాజీలేని తత్వంతో వ్యవహరిస్తే ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనడానికి కర్ణాటకకు చెందిన ఐపీఎస్ అధికారి డీ.రూపా నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు చట్టాన్ని పక్కాగా అమలు చేయడంలో రాజీలేని ఆమె తీరు కారణంగా రెండు దశాబ్దాల తన కెరీర్లో 40 బదిలీలను ఎదుర్కొన్నారు. రాజకీయ, ఇతరత్రా తీవ్రమైన ఒత్తిళ్లను ఇసుమంతైనా లెక్క చేయకుండా, పారదర్శకంగా విధినిర్వహణలో ఆమె సాగిస్తున్న ప్రయాణం, ప్రస్థానం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
2000వ ఐపీఎస్ బ్యాచ్‌కి చెందిన డీ.రూపా, సివిల్ సర్వీసెస్ పరీక్షలో అఖిల భారత స్థాయిలో 43వ ర్యాంకు సాధించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ సమయంలోనూ ప్రతిభ కనబరిచి, 5వ ర్యాంకును సొంతం చేసుకున్నారు. విధి నిర్వహణలో చట్టాన్ని వినా ప్రాతిపదికగా ఎటువంటి వత్తిళ్లు, బెదరింపులకు వెరవలేదు. వెనకడుగు వేయలేదు. ఫలితంగా ఆమె కెరీర్‌లో దాదాపు 40 సార్లు బదిలీలను ఎదుర్కొన్నారు. ఈ బదిలీలలో సాధారణ పరిపాలనా పరమైనవి చాలా తక్కువ. అత్యధిక బదలీలు మాత్రం విధినిర్వహణలో ఒత్తిడులకు లొంగకుండా, బెదరింపులకు వెరవకుండా, నిజాయితీగా, నిక్కచ్చిగా ఆమె తీసుకున్న నిర్ణయాలే కారణం. ఎన్ని బదలీ వేటులు పడినా, ఎక్కడ, ఏ పోస్టింగ్ ఇచ్చినా రూప మాత్రం తనదైన శైలిలో వేగంగా, చురుగ్గా పనిచేస్తూనే ఉన్నారు. అదే ఆమెకు దేశవ్యాప్తంగా జనబాహుల్యంలో గుర్తింపు తీసుకువచ్చింది. ప్రజాభిమానాన్ని చూరగొంది.

రూపా కెరీర్‌లో ఎన్నో మైలు రాళ్లు ఉన్నాయి. విధి నిర్వహణలో ఉన్న సమయంలో అధికారంలో ఉన్న ఒక మంత్రిని అరెస్టు చేయడానికి ఆమె వెరవక పోవడం, ఆ తర్వాత ప్రభుత్వ వర్గాల్లో తలెత్తిన పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అప్పట్లో ఆమె తీసుకున్న ఆ సాహసోపేత నిర్ణయం ప్రభుత్వ ఉన్నత వర్గాలకే కాదు, స్వయంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా పెద్ద సవాల్‌గా మారింది. తనను బదిలీ చేసేందుకు అధికారిక ఉత్తర్వులు టైప్ చేసేలోపే ఆమె తన విధులను వేగంగా పూర్తి చేయడం ఆమె తెగువకు అద్దం పడుతుంది.
ప్రభుత్వ సర్వీసుల్లో నిబద్ధతతో, నిజాయితీతో పనిచేసే అధికారులకు నిరంతరం అడ్డంకులు ఎదురుకావడం కద్దు. రాజకీయ నాయకులు అయితే రూపా లాంటి అధికారులు ఆ అడ్డంకులు, అవాంతరాలు, బెదరింపులు, బదలీలను లెక్క చేయకుండా మొక్కవోని ధైర్యంతో.. నిబంధనలకు అనుగుణంగా ముందుకు వెడుతుంటారు. రూపా వంటి అధికారుల వ్యవహార శైలి అధికార యంత్రాంగం, ప్రభుత్వాలు గడగడలాడే పరిస్థితి వస్తుంటుంది. ఇక ఐపీఎస్ రూపా విషయానికి వస్తే.. ఆమె తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక ప్రజా ప్రయోజనం, చట్టబద్ధత స్పష్టంగా కనిపిస్తాయని తోటి అధికారులు చెబుతుంటారు.
ఒక వైపు తరచూ బదిలీలు ఎదురవుతున్నప్పటికీ, ఆమె తన పనితీరును ఇసుమంతైనా మార్చుకోలేదు. ఎక్కడికి వెళ్లినా శాఖాపరమైన క్రమశిక్షణను కఠినంగా అమలు చేయడమే కాకుండా, తన కింద పనిచేసే సిబ్బంది కూడా అదే పద్ధతిని అనుసరించేలా చర్యలు తీసుకునేవారు. కేవలం శాంతిభద్రతల పరిరక్షణకే పరిమితం కాకుండా, సమాజంలో ఉన్నత విలువలను కాపాడటంలో పోలీస్ శాఖ పాత్ర ఎంత కీలకమో ఆమె తన చేతల ద్వారా నిరూపించారు. ఒక మహిళా అధికారిగా ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, అధిగమించిన అడ్డంకులు యువతకు, ముఖ్యంగా సివిల్ సర్వీసెస్ వైపు అడుగులు వేయాలనుకునేవారికి స్ఫూర్తి దాయకం, మార్గదర్శకం అనడంలో సందేహం లేదు. ప్రజల పక్షాన నిలబడి చట్టం అమలులో ఒత్తిడులను, సవాళ్లను ఎదుర్కొని రూప సాగించిన ప్రస్థానం దేశంలోని ఎంతోమంది యువ అధికారులకు ధైర్యాన్ని ఇస్తోంది.
[Roopa IPS, Karnataka Police Officer, 40 Transfers,20 Years Service, Lady IPS, UPSC Success Story]


