Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...టెన్త్ డ్రాపౌట్ నుంచి బిలియన్ డాలర్ల సామ్రాజ్యం వరకూ.!
posted on: Jul 22, 2026 4:37PM

ఇండియాలో విద్యార్హతలు, డిగ్రీలు మాత్రమే విజయాన్ని నిర్దేశిస్తాయనే పాత చింతకాయపచ్చడి లాంటి భావజాలాన్ని బద్దలు కొడుతూ.. దేశీయ వ్యాపార రంగంలో ఒక సరికొత్త విప్లవం రూపుదిద్దుకుంటోంది. చదువులో వెనుకబడినప్పటికీ, పక్కా ప్రాక్టికల్ పరిజ్ఞానం, అసాధారణమైన నైపుణ్యంతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆజాద్ ఇంజనీరింగ్ వ్యవస్థాపకుడు రాకేష్ చోప్దార్ ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. టెన్త్ ఫెయిల్ అయిన ఒక వ్యక్తి.. ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ప్రమాణాలు కలిగిన ఏరోస్పేస్, రక్షణ రంగాలకు విడిభాగాలు సరఫరా చేసే స్థాయికి ఎదగడం భారత పారిశ్రామిక రంగానికి గర్వకారణంగా నిలిచింది.
ఈ స్ఫూర్తిదాయక పారిశ్రామిక ప్రయాణానికి పునాదులు హైదరాబాద్‌లోని బాలానగర్‌లో పడ్డాయి. పాఠశాల విద్య మధ్యలోనే ఆగిపోయినప్పటికీ.. తన తండ్రి నడిపే చిన్న వర్క్‌షాప్‌లో 16 ఏళ్ల వయసు నుంచే యంత్రాలతో అనుబంధాన్ని పెంచుకున్న రాకేష్ చోప్దార్, ఇంజనీరింగ్ పుస్తకాల్లో లేని ఆచరణాత్మక మెళకువలను నేర్చుకున్నారు. కేవలం 200 చదరపు మీటర్ల చిన్న రేకుల షెడ్డులో, ఒక సెకండ్ హ్యాండ్ సీఎన్‌సీ మెషీన్‌తో ప్రారంభమైన ఆయన చిన్న ప్రయాణం నేడు బిలియన్ డాలర్ల విలువైన అంతర్జాతీయ కంపెనీగా రూపాంతరం చెందింది. ప్రారంభంలో సంక్లిష్టమైన ఇంజనీరింగ్ సవాళ్లను స్వీకరిస్తూ తమ ప్రామాణికతను నిరూపించుకున్న ఆజాద్ ఇంజనీరింగ్, అతి తక్కువ కాలంలోనే ఊహించని స్థాయికి విస్తరించింది. థర్మల్ పవర్ టర్బైన్ల కోసం అత్యంత ఖచ్చితత్వంతో కూడిన విడిభాగాలను తయారు చేయడం ద్వారా మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఆ తర్వాతి కాలంలో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగి, మిలియన్ల కొద్దీ యూనిట్లు తయారు చేసి దాదాపు 15కి పైగా దేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది. ఆర్థికంగా కూడా కంపెనీ అత్యంత వేగవంతమైన వృద్ధిని నమోదు చేసింది. క్రమంగా ఆదాయాన్ని పెంచుకుంటూ, విజయవంతంగా ఐపీవో దిశగా అడుగులు వేసింది. స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టిన స్వల్ప వ్యవధిలోనే కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ బిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ఈ సంస్థ వృద్ధిని, పారదర్శకతను గుర్తించిన భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సైతం ఇందులో వ్యూహాత్మక పెట్టుబడులు పెట్టడం గమనార్హం. అంతర్జాతీయ ఏరోస్పేస్ రంగంలో భారత తయారీ రంగానికి తిరుగులేని గుర్తింపు లభించడానికి ఈ సంస్థ సాధించిన ఒప్పందాలే ప్రధాన కారణం.
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ఏరోస్పేస్ దిగ్గజం రోల్స్ రాయిస్‌తో కుదుర్చుకున్న ఏడేళ్ల వ్యూహాత్మక ఒప్పందం ఈ ప్రయాణంలో కీలకమైన మలుపు. రక్షణ విమానాల ఇంజిన్లలో ఉపయోగించే సంక్లిష్టమైన రొటేటింగ్ విడిభాగాల తయారీ బాధ్యతలను హైదరాబాద్‌లోని ఈ ప్లాంట్‌కు అప్పగించడం భారత తయారీ సామర్థ్యానికి లభించిన అంతర్జాతీయ గుర్తింపుగా భావించవచ్చు. ఈ రకమైన విజయాలు కేవలం ఒక సంస్థకే పరిమితం కాకుండా.. దేశంలో విస్తరిస్తున్న స్టార్టప్ వ్యవస్థకు అద్దం పడుతున్నాయి. గత దశాబ్ద కాలంలో ప్రభుత్వ విధానాలు, సరళీకృత నిబంధనలు, ప్రోత్సాహకాలు చిన్న తరహా పరిశ్రమలకు, కొత్త ఆలోచనలకు పెద్దపీట వేశాయి. వందల సంఖ్యలో ఉన్న గుర్తింపు పొందిన స్టార్టప్‌లు నేడు లక్షల్లోకి చేరడమే కాకుండా, పదిలక్షలకు పైగా ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించగలిగాయి. ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద స్టార్టప్ ఎకోసిస్టమ్‌గా భారత్ నిలవడానికి ఇటువంటి ఆవిష్కరణలే మూలస్తంభాలుగా నిలుస్తున్నాయి.
ఈ తరహా విజయగాథలు సమాజంలో ఉన్న పాత మూస ఆలోచనలను మార్చడానికి ఎంతగానో దోహదపడుతున్నాయి. మార్కులు, పెద్ద పెద్ద డిగ్రీలు మాత్రమే వ్యక్తిగత అభివృద్ధిని నిర్ణయించలేవని, నిర్థుష్టమైన నైపుణ్యం, క్రమశిక్షణ, నిరంతర పరిశ్రమ ఉంటే ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చని స్పష్టమవుతోంది. సాంప్రదాయ ఉద్యోగాల వేటలో పడకుండా, స్వయంగా ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామికవేత్తలుగా మారడానికి నేటి తరం యువతకు ఇవి మార్గదర్శకంగా నిలుస్తున్నాయి. భవిష్యత్తులో భారత తయారీ రంగం, ముఖ్యంగా ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలు మరింత వేగంగా పురోగమించే అవకాశం ఉంది. అంతర్జాతీయ కంపెనీలు తమ సప్లై చైన్ కోసం భారతదేశం వైపు మొగ్గు చూపుతుండటంతో, రాబోయే రోజుల్లో మరిన్ని రక్షణ మరియు సాంకేతిక రంగ స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. నైపుణ్య ఆధారిత పరిశ్రమలకు సరైన ప్రోత్సాహం అందిస్తే భారత్ ప్రపంచ తయారీ రంగానికి ప్రధాన కేంద్రంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి https://www.teluguone.com పోర్టల్ ను ఫాలో అవ్వండి. లైక్ చేయండి. షేర్ చేయండి. మీ విలువైన అభిప్రయాలను తెలియజేయండి.
Rolls Royce Azad Engineering Deal, AZAD Engineering, Rakesh Chopdar, Aerospace Startup Hyderabad, Indian Startup Revolution






