రోహిట్ శర్మపైనే నమ్మకముంచిన ముంబై ఇండియన్స్: మళ్లీ కెప్టెన్సీ బాధ్యతలు.!
Published on: Wed Oct 14, 2026 10:15AM
ఐపీఎల్ లో మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్లలో ముంబై ఇండియన్స్ ఒకటి. అయితే గత రెండు సీజన్లలో ఆ జట్టు చతికిల పడింది. దీంతో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ జట్టు కూర్పు, కెప్టెన్ తదితర అంశాలపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలోనే జట్టు సారథ్య బాధ్యతలను హిట్ మ్యాన్ రోహిత్ శర్మకు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఈ విషయంపైనే జోరుగా చర్చ జరుగుతోంది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ జట్టు పగ్గాలను భారత స్టార్ బ్యాటర్, టీమ్ ఇండియా మాజీ స్కిప్పర్ రోహిత్ శర్మ చేపట్టనున్నారన్న వార్త క్రికట్ సర్కిల్స్ లో ట్రెండ్ అవుతోంది.
ఐపీఎల్ 2027 సీజన్‌కు సంబంధించి ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఒక అధికారిక పోస్ట్ ద్వారా రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ స్కిప్పర్ గా మళ్లీ పగ్గాలు అందుకోనున్నాడన్న సంకేతాన్ని ఇచ్చింది. దీంతో రోహిత్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ముంబై ఇండియన్స్ ఇటీవల తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో జట్టులోని ప్రముఖ ఆటగాళ్లను విభిన్నమైన, శక్తివంతమైన బిరుదులతో సంబోధిస్తూ ఒక ఆకర్షణీయమైన ఫొటోను షేర్ చేసింది. ఈ పోస్ట్‌లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను కింగ్ గా, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను లయన్ గా, స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్‌ను లైట్నింగ్ గా, యువ ఆటగాడు తిలక్ వర్మను స్టార్ గా పేర్కొంది. ముఖ్యంగా రోహిత్ శర్మకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఇచ్చిన ఈ కింగ్ బిరుదే ఇప్పుడు ఆయనకే జట్టు సారథ్య బాధ్యతలన్న సంకేతంగా క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి.
2026 ఐపీఎల్ సీజన్లో ముంబై ఇండియన్స్ ప్రదర్శన తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఆ సీజన్లో జట్టు తొమ్మిదో స్థానంలో నిలవడంతో జట్టు నాయకత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. హార్దిక్ పాండ్యా కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన గత మూడు సీజన్లలో ముంబై ఇండియన్స్ జట్టు రెండుసార్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించలేకపోయింది. ముఖ్యంగా 2024లో జట్టు పట్టికలో చివరి స్థానంలో నిలవగా, 2023లో రెండో క్వాలిఫయర్ వరకు మాత్రమే చేరుకోగలిగింది. ఈ వరుస వైఫల్యాల నేపథ్యంలో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ముంబై ఇండియన్స్ యాజమాన్యం జట్టు సారథ్య బాధ్యతలు మళ్లీ రోహిత్ కు అప్పగించాలన్న నిర్ణయానికి వచ్చిందని అంటున్నారు.
రోహిత్ శర్మ కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు 2013 నుంచి 2023 వరకు సుదీర్ఘకాలం పాటు ఉన్నారు. నాయకత్వ ప్రతిభతో జట్టును ఏకంగా ఐదు సార్లు (2013, 2015, 2017, 2019, 2020) ఛాంపియన్‌గా నిలబెట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో కలిసి అత్యధికంగా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు సాధించిన రికార్డు రోహిత్ పేరు మీదనే ఉంది.
అదే విధంగా ఇంటర్నేషనల్ క్రికెట్ లోనూ కెప్టెన్ గారోహిత్ శర్మ రికార్డు అమోఘంగా ఉంది. 2021 నుంచి 2025 వరకు భారత జట్టుకు కెప్టెన్‌గా ఉన్న రోహిత్.. భారత్‌కు చిరస్మరణీయ విజయాలను అందించాడు. ఆయన సారథ్యంలోనే టీమిండియా 2024 ఐసీసీ టీ20 ప్రపంచకప్ ట్రోఫీని గెలుచుకోవడంతో పాటు, 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది. అలాగే 2023 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను అజేయంగా ఫైనల్‌కు చేర్చడంలో రోహిత్ కీలక పాత్ర పోషించారు. ఇలా విజయాలతో ప్రపంచ క్రికెట్లో అగ్రగామిగా నిలిచిన రోహిత్ శర్మ, ఇప్పుడు మళ్లీ ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ పగ్గాలు చేపడితే ఆ జోష్ వేరేలా ఉంటుందని అభిమానులు అంటున్నారు.
[Rohit Sharma Mumbai Indians Captain Again, IPL 2027, MI Captain, Rohit Sharma Captaincy, Hitman Rohit, Telugu One]


