బాలికతో అసభ్య ప్రవర్తన: రోబోట్ అరెస్టు.!
Published on: Wed Oct 14, 2026 2:28PM

సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు జనావళికి చేసే మేలు కంటే కీడే అధికమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా జర్మనీలోని కొలోనా నగరంలో ఒక రోబోట్ 16 ఏళ్ల బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించింది. ఈ ఘటన సాంకేతికత వెర్రితలలు వేస్తోందనడానికి నిలువెత్తు నిదర్శనంగా మారింది. కొలోన్ నగరంలోని ఒక ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్ వెలుపల తన స్నేహితులతో కలిసి నిలబడి ఉన్న 16 ఏళ్ల బాలికపై ఒక రోబోట్ అనుచితంగా, అసభ్యంగా వ్యవహరించింది. అభ్యంతర కరంగా ఆమెను తాకుతూ, అశ్లీల చేష్టలకు పాల్పడింది. సూపర్‌హీరో ఐరన్ మ్యాన్ డిజైన్‌ను పోలి ఉన్న ఆ రోబోట్ బాలికను వెనుక నుండి అసభ్యంగా తాకడమే కాకుండా, ఆమెపై అనుచిత రీతిలో, అభ్యంతరకరమైన కదలికలకు పాల్పడింది.

ఈ షాకింగ్ ఘటనపై సర్వత్రా ఆందోళన, ఆగ్రహం వ్యక్తం అవుతున్నాయి. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆ రోబోట్ ఓనర్ అయిన 16 ఏళ్ల యువకుడు, అతడి స్నేహితుడు ఈ దృశ్యాలను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్‌లలో దీనిని లైవ్ స్ట్రీమింగ్ చేస్తూ కామెంట్లు కూడా పెట్టారు. ఈ ఘటనపై బాధిత బాలిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
రోబోను, రోబో అసభ్య చేష్టలను రికార్డు చేసిన పోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోబోట్ స్వయంగా ఆపరేట్ అయిందా లేక ఎవరైనా రిమోట్ కంట్రోల్, మొబైల్ యాప్ వంటి వాటి ద్వారా ఆపరేట్ చేశారా అనే కోణంలో ఫోరెన్సిక్, సైబర్ నిపుణులు విచారణ జరుపుతున్నారు. పబ్లిక్ ప్రదేశాలలో కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ వినియోగంపై ఈ ఘటన భద్రతాపరమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఇలాంటి అసభ్యకర చేష్టలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
[Robot Gropes Girl, Germany Robot Incident, Cologne Police Seize Robot, Robot Sexual Harassment, Automated Machine Crime, Telugu One]


