ఓటు వేసేందుకు వస్తూ మృత్యుఒడికి..నలుగురు దుర్మరణం.!
Published on: Sun Nov 29, 2026 10:21AM
.webp)
టంగుటూరు టోల్‌ప్లాజా ఘోర రోడ్డు ప్రమాదం..నలుగురు మృతి.!
పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్న ఆశతో స్వగ్రామానికి బయలుదేరిన వారిని మృత్యువు కబళించింది. ప్రకాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన లారీ కారును బలంగా ఢీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు, కారులో ప్రయాణిస్తున్న 15 ఏళ్ల బాలుడు ఎలాంటి గాయాలు లేకుండా బయటపడటం ఊరటనిచ్చింది.
అద్దంకి మండలం చెరుకుంపాలెం గ్రామానికి చెందిన ఐదుగురు వ్యక్తులు పంచాయతీ ఎన్నికల రెండో విడతలో ఓటు వేసేందుకు బెంగళూరు నుంచి కారులో స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద టోల్ రుసుము చెల్లించేందుకు కారు ఓ ప్రైవేట్ బస్సు వెనుక ఆగింది. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారు లారీ, బస్సు మధ్య ఇరుక్కుని పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఉన్న సోంపల్లి సాయి కుమార్, కోట కామేశ్వరమ్మతో పాటు మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. కారులో ఉన్న 15 ఏళ్ల బాలుడు మాత్రం సురక్షితంగా బయటపడ్డాడు.
సమాచారం అందుకున్న హైవే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు శిథిలాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. మృతదేహాలను ఒంగోలు రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ఘటన అనంతరం అక్కడి నుంచి పరారైనట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదంపై మంత్రి రాంప్రసాద్ దిగ్భ్రాంతి.!
టంగుటూరు టోల్‌ప్లాజా వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నలుగురు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
.webp)
జాతీయ రహదారులపై ప్రమాదాల నివారణకు అధికారులు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా టోల్‌ప్లాజాల వద్ద వాహనాల రాకపోకల నిర్వహణలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, రహదారులపై నిలిచిన వాహనాల వద్ద హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనదారులు వేగ నియంత్రణ పాటిస్తూ ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా అనుసరించాలని కోరారు.
మీకు నచ్చవచ్చు: ఏపీ పంచాయతీ ఎన్నికల రెండో దశలో పోలింగ్ జోరు.. పలుచోట్ల ఉద్రిక్తతలు.!
మీకు నచ్చవచ్చు: పెళ్లి పేరుతో మోసం: రూ. 10 లక్షలకు కుచ్చుటోపీ.!
[ Road accident at Tanguturu toll plaza Prakasam District, Prakasam district road accident, Tanguturu Toll Plaza accident, Bangalore road accident, four dead, AP Road Accident, Tanguturu Toll Plaza, Minister Mandipalli Ramprasad Reddy ]


