TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వాణిజ్యం నుంచి వాతావరణం వరకూ: భారత్ సొంత గళం.. పాశ్చ్యాత్య దేశాలను ఎండగడుతున్న దృఢ చిత్తం.!

Published on: Mon Oct 26, 2026 6:17PM

ప్రపంచ రాజకీయ,  ఆర్థిక రంగాల్లో భారత్ తనదైన ముద్ర వేస్తూ, ఏమాత్రం తడబాటు, తత్తరపాటు లేకుండా  స్వేచ్ఛగా, స్వతంత్రంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు అడుగులు వేస్తోంది. గత కొద్ది రోజులుగా అంతర్జాతీయ వేదికలపై వాణిజ్య ఒప్పందాల మొదలుకుని ఉగ్రవాదం, ఇంధన భద్రత, వాతావరణ మార్పుల వంటి  అంశాలపై భారత అగ్రనేతలు, మంత్రులు నిర్మొహమాటంగా, ఉన్నది ఉన్నట్లుగా కుండబద్దలు కొట్టినట్లుగా   గళమెత్తుతున్నారు. ఒక వైపు పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలను ఎత్తిచూపుతూనే, మరో వైపు  జాతీయ ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమనీ, ప్రాధాన్యమనీ విస్పష్టంగా చెబుతోంది. ఇదే సమయంలో ప్రపంచ దేశాల నుంచి భారత్‌కు వస్తున్న ప్రశంసలు,   అంతర్జాతీయ సమీకరణాలు నవ భారత అభ్యుదయ గమనానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

  అంతర్జాతీయ వేదికలపై భారత్ అనుసరిస్తున్న ఈ స్థిర, ధృఢ వైఖరికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బెర్లిన్ గ్లోబల్ డైలాగ్‌లో చేసిన వ్యాఖ్యానాలు   ఉదాహరణగా నిలిచాయి. చారిత్రక ఉద్గారాలు,  పర్యావరణ పరిరక్షణ బాధ్యతలపై ఆయన యూరప్ దేశాలను నిలదీశారు. వాతావరణ కాలుష్యానికి, ఓజోన్ పొర దెబ్బతినడానికి అసలు కారణం ఎవరని ప్రశ్నిస్తూ,  కార్బన్‌ను వాతావరణంలోకి పంపింది ఎవరు అని సూటిగా నిలదీశారు. ప్రపంచ జనాభాలో 17 శాతం మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా తలసరి కార్బన్ ఉద్గారాలు చాలా తక్కువగా ఉన్నాయని, కానీ అభివృద్ధి చెందిన పశ్చిమ దేశాల వాటా మాత్రం అత్యధికంగా ఉందని ఆయన గణాంకాలతో సహా వివరించారు. 

యూరోపియన్ యూనియన్‌కు చెందిన కార్బన్ బోర్డర్ అడ్జస్ట్‌మెంట్ మెకానిజం (సీబీఏఎం) వంటి సుంకాలు విపత్తును కొనితెచ్చుకోవడమేనని ఆయన హెచ్చరించారు.  మరోవైపు, దేశ ఆర్థిక ప్రయోజనాలు మరియు వాణిజ్య భాగస్వామ్యాల విషయంలోనూ భారత్ ఎక్కడా రాజీ పడటం లేదు.

అమెరికాతో జరుగుతున్న వాణిజ్య చర్చలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ, ఇరు దేశాల మధ్య చర్చలు ఒక నిర్దుష్ట స్థాయికి చేరాయని, ఇకపై పరస్పరం ఇచ్చిపుచ్చుకోవడం చాలా కష్టమైన దశకు చేరుకుందని కుండబద్దలు కొట్టేశారు. సుంకాల పెంపు,  వాణిజ్యపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో ఇండియా దేశీయ ప్రయోజనాలను కాపాడుకుంటూనే, సరసమైన, సమతుల్యమైన ఒప్పందాలకే ప్రాధాన్యత ఇస్తుందని ఆమె పునరుద్ఘాటించారు. 

ఇదే కోవలో విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇంధన కొనుగోళ్ల అంశంలో ఇండియా  స్వతంత్ర వైఖరిని గట్టిగా సమర్థించారు. ప్రపంచంలోనే అత్యధిక  జనాభా కలిగినఇండియాకు  సరసమైన ధరలకు ఇంధనాన్ని అందించడం అత్యవసరమైన జాతీయ ప్రయోజనమని   స్పష్టం చేశారు. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేసినంత మాత్రాన   యుద్ధం ఆగదని, కేవలం చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఆయన అంతర్జాతీయ వేదికలపై స్పష్టం చేశారు.   ఇదిలా ఉండగా, భారతదేశ దౌత్య  విజయాలకు అద్దం పట్టేలా ముఖ్యమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. పోలాండ్ ప్రధాన మంత్రి డొనాల్డ్ టస్క్ భారత్‌లో పర్యటించి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత అస్థిర ప్రపంచంలో ప్రధాని మోదీ ఒక గొప్ప ఆశాకిరణం లాంటివారని కొనియాడారు. తనను ప్రధాని మోదీకి స్నేహితుడిగా పిలుచుకోవడం గర్వకారణమని పేర్కొంటూ.. ఇరు దేశాల మధ్య ఎటువంటి చారిత్రక వివాదాలు లేవని, గత మూడున్నర దశాబ్దాలుగా ఇరు దేశాలు సాధిస్తున్న ప్రగతిని చూసి ప్రపంచం అసూయపడుతోందని ప్రశంసించారు. ఈ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య రక్షణ, అంతరిక్షం, అణుశక్తి,  కీలక ఖనిజాల రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించుకోవడానికి అంగీకారం కుదిరింది.   

ఇండియా స్వతంత్ర విదేశాంగ విధానానికి సుదీర్ఘమైన చారిత్రక నేపథ్యం ఉంది. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇండియా వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి ని పాటిస్తూ వస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో అలీన విధానాన్ని అనుసరించిన ఇండియా , నేడుమల్టీ అలైన్ మెంట్   సిద్ధాంతం ద్వారా అన్ని దేశాలతోనూ సమదూరం పాటిస్తూనే జాతీయ ప్రయోజనాలకు పెద్దపీట వేస్తోంది. ముఖ్యంగా వాతావరణ మార్పులకు సంబంధించి అభివృద్ధి చెందిన దేశాలే ఎక్కువ బాధ్యత వహించాలనే  ఉమ్మడి కానీ భేదమైన బాధ్యతలు' (సీబీడీఆర్) సూత్రాన్ని భారత్ నిలకడగా వినిపిస్తోంది. ఇండియాకు అవసరమైన ముడి చమురులో దాదాపు 88 శాతం దిగుమతులపైనే ఆధారపడి ఉన్నందున, ఇంధన భద్రత విషయంలో దేశీయ అవసరాలకే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఈ తాజా పరిణామాలు జాతీయ రాజకీయాలు,  సామాజిక వర్గాల్లోనూ  చర్చకు దారితీశాయి. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న దృఢమైన దౌత్య విధానం దేశ ప్రజల్లో  ఆత్మవిశ్వాసాన్ని నింపుతోందని  విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు తమ తప్పులను కప్పిపుచ్చుతూ, అభివృద్ధి చెడుతున్న దేశాలపై పర్యావరణ భారాన్ని రుద్దడాన్ని సాధారణ ప్రజలు కూడా   వ్యతిరేకిస్తున్నారు. 

పీయూష్ గోయల్ మాట్లాడిన వీడియో క్లిప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ కావడంతో, పాశ్చాత్య దేశాల ద్వంద్వ ప్రమాణాలను భారత్ నిర్మొహమాటంగా ఎండగడుతోందనే అభిప్రాయం అంతర్జాతీయ స్థాయిలో బలపడింది.   ఇండియా  అనుసరిస్తున్న ఈ కఠినమైన, దృఢమైన, స్పష్టమైన విధానాల వల్ల భవిష్యత్తులో దౌత్యప ముద్ర మరింత బలపడే అవకాశం ఉంది. వాణిజ్య ఒప్పందాల విషయంలో చిన్నచిన్న ప్రతిబంధకాలు ఉన్నప్పటికీ, దేశ ఆర్థిక ప్రయోజనాలను దెబ్బతీసేలా  ఇండియా రాజీ  పడే ప్రశక్తి లేదని  ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. పశ్చిమ దేశాల ఒత్తిళ్లను పక్కనపెట్టి రష్యా నుంచి ఇంధన దిగుమతులు కొనసాగించడం ద్వారా ఇండియా తన స్వతంత్ర నిర్ణయాధికారాన్ని మరోసారి చాటుకుంది. రాబోయే రోజుల్లో జరిగే అంతర్జాతీయ సదస్సులలో వాతావరణ న్యాయం మరియు వాణిజ్య నిబంధనలపై భారత్ మరింత ప్రభావవంతమైన పాత్ర పోషించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.  

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    

[Rising India International Ddiplomacy, Piyush Goyal Berlin Global Dialogue,  Carbon Emissions, Jaishankar Russia Oil,  Ukraine War Stance, Nirmala Sitharaman India US Trade Talks, Telugu One]