మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ అత్యవసర భేటీ.. ఎందుకంటే?
Published on: Mon Sep 7, 2026 2:55PM

తెలంగాణ రాజకీయాల్లో ఒక్క సారిగా హీట్ పెరిగింది. అసెంబ్లీ వర్షాకాల సమవేశాల ప్రారంభం రోజున అంటే సోమవారం (సెప్టెబర్ 7) శాసనసభ ప్రాంగణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేపట్టిన ఆందోళనలు, సభలో జరిగిన పరిణామాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమం సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు, అసెంబ్లీ స్పీకర్‌ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ఈ పరిణామాలను సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో అత్యవసర సమావేశం నిర్వహించారు. అసెంబ్లీలోని పీఎం ఛాంబర్‌లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో నిర్వహించిన అత్యవసర సమావేశంలో అసెంబ్లీలో జరిగిన గందరగోళం, ఆందోళనల సమయంలో స్పీకర్‌ను, పోలీసు యంత్రాంగాన్ని ఉద్దేశించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడిన పూర్తి వివరాలతో కూడిన వీడియో ఫుటేజ్‌లను సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా పరిశీలించారు. అలాగే ఈ ఘటనలకు సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు.

స్పీకర్ పదవిలో ఉన్న ఒక దళిత నేత పట్ల అత్యంత అహంకారపూరితంగా వ్యవహరిస్తూ, కించపరిచే విధంగా మాట్లాడిన ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎస్సీ, దళిత ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సీఎం తో జరిగిన ఈ అత్యవసర సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన దళిత ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ తీరుపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచీ దళితుల పట్ల చిన్నచూపు ఉందని, దళిత వర్గానికి చెందిన స్పీకర్‌ను అవమానించిన వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దళిత స్పీకర్‌ను కించపరిచిన ఎమ్మెల్సీ తాతా మధుపై తక్షణమే చట్టపరమైన కేసులు నమోదు చేసి, సభ నుంచి శాశ్వతంగా బర్తరఫ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ వివాదం మరింత ముదిరిపోవడంతో, సీఎం కార్యాలయం తాతా మధు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను అధికారికంగా విడుదల చేసింది.
[Revanth emergency Meeting With Ministers, MLAs, MLCs, Telangana Assembly, Tata Madhu, BRS MLC, Speaker controversy, Telangana Politics, Telugu One]


