ఎర్ర గోంగూర ఆరోగ్యానికి చేసే మేలు తెలిస్తే.. అస్సలు వదిలిపెట్టరు.. !
Published on: Sat Sep 19, 2026 9:08AM

ఎర్ర గోంగూర.. కేవలం తెలుగు రాష్ట్రాల రుచుల్లోనే కాదు, ఆరోగ్య ప్రయోజనాల్లోనూ ప్రత్యేక స్థానాన్ని సంపాదిచుకుంది. ఆకుకూరల్లో గోంగూరకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే తెల్ల గోంగూరతో పోలిస్తే ఎర్ర గోంగూరలో ఆరోగ్య గుణాలు, పోషక విలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. చాలామంది దీని పులుపుదనం వల్ల లేదా పులుపు ఎక్కువైతే ఏమన్నా సమస్యలు వస్తాయేమోనని కాస్త దూరంగా ఉంటారు. కానీ, ఎర్ర గోంగూర రోజూ లేదా వారానికి రెండు మూడు సార్లు తింటే శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అసలు ఎర్ర గోంగూరలో ఉండే పోషకాలు ఏమిటి? ఎర్ర గోంగూర తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? ఈ విషయాలు తెలుసుకుంటే ఎర్ర గోంగూరను అస్సలు వదిలిపెట్టరు. ఎర్ర గోంగూర గురించి వివరంగా తెలుసుకుంటే..
ఎర్ర గోంగూర అందించే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు..
రక్తహీనతకు చెక్ పెడుతుంది:
నేటి కాలంలో చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య రక్తహీనత. ఎర్ర గోంగూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఎర్ర రక్తకణాల ఉత్పత్తిని వేగవంతం చేస్తాయి. హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడంలో ఎర్ర గోంగూర ఒక సహజసిద్ధమైన ఔషధంగా పనిచేస్తుంది.
ఎముకలకు బలాన్ని ఇస్తుంది:
వయసు పెరిగే కొద్దీ ఎముకల బలహీనత, కీళ్ల నొప్పులు సహజంగా వస్తుంటాయి. ఎర్ర గోంగూరలో ఉండే క్యాల్షియం, మెగ్నీషియం, భాస్వరం ఎముకలను దృఢంగా ఉంచడానికి ఎంతగానో తోడ్పడతాయి. చిన్నపిల్లల పెరుగుదలకు, ఎముకల ఎదగడానికి ఇది చాలా మంచిది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:
ఎర్ర గోంగూరలో పీచు పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థ పనితీరును వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. తిన్న ఆహారం త్వరగా అరగడానికి, పేగుల్లో ఉన్న వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది సహాయపడుతుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది:
ఈ ఆకుకూరలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీరంలోని వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. సీజనల్ గా వచ్చే జలుబు, దగ్గు, జ్వరం వంటి ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తినందిస్తుంది.
కంటి చూపు పెరిగేందుకు దోహదం చేస్తుంది:
ఎర్ర గోంగూరలో విటమిన్ ఏ తగినంత ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రేచీకటి, కళ్ళు పొడిబారడం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తూ, దృష్టి లోపాలు రాకుండా కాపాడుతుంది.
గుండె ఆరోగ్యానికి రక్షణ:
ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, గుండె సంబంధిత సమస్యలు రాకుండా నిరోధించడంలో ఎర్ర గోంగూర కీలకంగా పనిచేస్తుంది.
చర్మం, జుట్టు ఆరోగ్యానికి మేలు:
యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల చర్మాన్ని యవ్వనంగా ఉంచడానికి, ముడతలు పడకుండా చూడటానికి ఇది దోహదపడుతుంది. అలాగే తలకు అవసరమైన పోషకాలను అందించి జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి:
ఎర్ర గోంగూరలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి, పీచు పదార్థం ఎక్కువ. ఇది తిన్న తర్వాత కడుపు నిండిన భావన ఎక్కువ సేపు ఉంటుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గి సులభంగా బరువు తగ్గొచ్చు.
ఇన్ని రకాల ఔషధ గుణాలు ఉన్న ఎర్ర గోంగూరను దైనందిన ఆహారంలో పప్పు రూపంలోనో, పచ్చడి రూపంలోనో లేదా ఇతర కూరల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
*రూపశ్రీ.


