వంద గోవుల మృతి వెనుక వైసీపీ నేత.. ఏడెకరాల భూమి కోసమా?

 

విజయవాడ శివార్లలో కొత్తూరు తాడేపల్లిలోని గోశాలలో వంద గోవుల మృతిపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశించారు ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌. ఏసీపీ ఆధ్వర్యంలో డీజీపీ సిట్‌ను నియమించారు. నిజానిజాలు బయటపెట్టే వరకు సిట్‌ పనిచేస్తుందని ఆయన అన్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో ఎలాగైనా సరే కేసును ఛేదించాలని ఆయన నిర్ణయించారు. పశుసంవర్థకశాఖ, ఫోరెన్సిక్‌ సైన్స్‌, ప్రకాశం జిల్లా నుంచి ఆవులకు గడ్డి అందించేవారిని అన్ని కోణాల్లో దర్యాప్తు చేయాలని డీజీపీ ఆదేశించారు. సిట్ ఆవుల మృతికి సంబంధించి అన్ని అంశాలను పరిశీలించి రోజువారీ నివేదికను విజయవాడ జాయింట్ కమిషనర్ నాగేంద్రకుమార్‌కు అందజేయాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశించారు. 

వంద గోవుల మృతి వెనుక ఏదో సీక్రెట్ ఉందన్న అనుమానం వ్యక్తమవుతోంది. అన్ని గోవులు ఒక్క సారిగా సహజమరణం చెందే అవకాశం లేదని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకసారి అధిక ఆహారం వల్ల అంటారు. ఒకసారి గడ్డిపై రసాయనాలు ఉన్నాయంటారు. మరో సారి ఏం జరిగిందో అర్థం కావడం లేదని అంటారు. మరోవైపు ఆవులకు పోస్టుమార్టం నిర్వహించిన డాక్టర్లు విష ప్రయోగం జరగలేదని చెప్తూనే.. ఆవుల లోపలి శరీర భాగాల్లో రక్తపు చారికలు ఉన్నాయని అంటున్నారు. దీంతో ఆవుల మృతి వెనుక ఏదో సీక్రెట్ ఉందని అనుమనాలు తలెత్తుతున్నాయి.

మరోవైపు.. ఆవుల మృతి వెనుక అధికార పార్టీ వైసీపీకి చెందిన ఓ నేత హస్తం ఉందని ప్రచారం జరుగుతోంది. గోశాల ఉన్న ఏడు ఎకరాల భూమిపై వైసీపీకి చెందిన ఓ నేత కన్నేశారని.. ఆ కుట్రలో భాగంగానే వంద గోవులు మృత్యువాత పడ్డాయన్న ప్రచారం గుప్పుమంది. ఇదే విషయమై స్థానికంగా పెద్ద చర్చ జరుగుతోంది. అదే సమయంలో.. నిర్వాహకుల మధ్య ఉన్న విబేధాలు, స్థలం గొడవ మొత్తం వ్యవహారాలను పోలీసులు బయటకు తీస్తున్నారు. మరి ఈ మిస్టరీ ఎప్పటికి వీడుతుందో ఏంటో చూడాలి.