కందుకూరులో రియాల్టర్ ఆత్మహత్య..!
Published on: Thu Sep 10, 2026 5:10PM

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన రియాల్టర్ బాణాల రామ్‌రెడ్డి వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులు, వెంచర్‌కు సంబంధించిన భూ వివాదాలు, పెట్టుబడిదారుల ఒత్తిడి కారణంగానే ఆయన ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. నేదునూరు గ్రామానికి చెందిన బాణాల రామ్‌రెడ్డి హైదరాబాద్‌లోని మణికొండలో నివాసం ఉంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. 2018లో పటాన్‌చెరువు ప్రాంతంలో సుమారు 250 ఎకరాల భూమిని బల్దేవ్, నరసింహారావు, మూర్తి తదితరుల వద్ద డెవలప్‌మెంట్‌కు తీసుకున్నారు. అయితే ఆ భూమికి సంబంధించి రెవెన్యూ సమస్యలు, లిటిగేషన్‌లు ఉండటంతో వాటిని పరిష్కరించేందుకు భారీగా అప్పులు చేశారు.

2018 నుంచి ఇప్పటివరకు భూమి డెవలప్‌మెంట్ ఆలస్యం కావడంతో పాటు, మరోవైపు భూ యజమానులు భూమిని ఇవ్వబోమంటూ ఒత్తిడి చేయడం, అప్పులు పెరిగిపోవడం, పెట్టుబడిదారుల నుంచి ఒత్తిడి రావడంతో రామ్‌రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిన్న నేదునూరులోని తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రామ్‌రెడ్డికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన కుమార్తె అమెరికాలో ఉండటంతో ఆమె వచ్చే వరకు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
రామ్‌రెడ్డి గచ్చిబౌలిలో సుమారు రూ.16 కోట్ల విలువైన విల్లాలో నివాసం ఉంటుండగా, స్వగ్రామమైన నేదునూరులో సుమారు రూ.3.5 కోట్లతో ఇల్లు నిర్మించుకున్నారు. ఆయనకు నేదునూరులో 16 ఎకరాల వ్యవసాయ భూమి కూడా ఉంది. పటాన్‌చెరువులో 250 ఎకరాల భూమిని కొనుగోలు చేసి డెవలప్‌మెంట్ చేపట్టిన రామ్‌రెడ్డి.. ఆ భూమికి సంబంధించిన రెవెన్యూ సమస్యలు, పెట్టుబడిదారుల ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కందుకూరి పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సీఐ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.
(Realtor commits suicide in Kandukur, Ranga Reddy District, Banala Ram Reddy, Real estate business, Nedunur, Crime news, CP Sajjanar, DGP C.V. Anand, Telugu One, Telugu News)


