ఆర్‌బీఐ షాక్ ఇవ్వనుందా? అక్టోబర్, డిసెంబర్‌లో వడ్డీ రేట్ల పెంపుకు నోమురా సిగ్నల్!
Published on: Wed Sep 30, 2026 10:48AM

భారత ఆర్థిక వ్యవస్థలో రాబోయే రోజుల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. దేశంలో మళ్లీ వడ్డీ రేట్ల బాదుడు మొదలుకానుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జపాన్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థ 'నోమురా' విడుదల చేసిన తాజా నివేదిక భారతీయ రుణాలు, ఆర్‌బీఐ ద్రవ్య విధానంపై సంచలన విశ్లేషణలను వెల్లడించింది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) రాబోయే ఆక్టోబర్ మరియు డిసెంబర్ ద్రవ్య పరపతి సమీక్ష సమావేశాలలో వరుసగా వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉందని నోమురా స్పష్టం చేసింది. ప్రతి సమీక్షలో 25 బేసిస్ పాయింట్ల చొప్పున మొత్తం 50 బేసిస్ పాయింట్లు పెంపు చేపట్టి, టెర్మినల్ రిపో రేటును 5.75 శాతానికి చేర్చే అవకాశం ఉందని ఈ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ జోస్యం చెప్పింది.
నోమురా నివేదిక ప్రకారం, సమీప కాలంలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరిగే ప్రమాదం ఉంది. ముఖ్యంగా ఆహార, ఇంధన ధరల పెరుగుదల వల్ల రాబోయే ఆరు నెలల్లో సిపిఐ (CPI) ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం పడనుంది. ఆగస్టు నెలలో 4.8 శాతంగా నమోదైన రిటైల్ ద్రవ్యోల్బణం, నాలుగో త్రైమాసికంలో ఏకంగా 6.3 శాతానికి ఎగబాకే అవకాశం ఉందని నోమురా హెచ్చరించింది. అలాగే 2027 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలో ద్రవ్యోల్బణం 5.3 శాతంగా నమోదయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే 2027 ద్వితీయార్థంలో ఇది మళ్లీ 4 శాతం కంటే కిందకు తగ్గి అదుపులోకి వస్తుందని అంచనా వేశారు.మొత్తం మీద 2027 ఆర్థిక సంవత్సరంలో సగటు సిపిఐ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా, కోర్ ద్రవ్యోల్బణం 4.3 శాతంగా నమోదయ్యే అవకాశం ఉంది.

ఈ పెరుగుదలకు ప్రధాన కారణం వర్షాభావ పరిస్థితులేనని నివేదిక స్పష్టం చేసింది. ఖరీఫ్ పంటల నాట్లు సరిగ్గా లేకపోవడం, దిగుబడులు తగ్గడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నోమురా పేర్కొంది. ప్రభుత్వం ఉల్లి, చక్కెరపై తీసుకుంటున్న నివారణ చర్యలు కొంతవరకు ధరలను అదుపు చేసినప్పటికీ, దిగుబడి లోటు ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఆర్థిక వృద్ధి పరంగా రెండో త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం నమోదు కావడం, ఆగస్టులో బ్యాంక్ క్రెడిట్ గ్రోత్ 19.1 శాతంగా ఉండటం శుభపరిణామమే అయినప్పటికీ, గ్రామీణ వినియోగం తగ్గడం ఆర్థిక రంగానికి ప్రతికూలంగా మారనుంది. ఆహార ధరల తీవ్రత వల్ల సామాన్యుల ఆదాయాలు హరించుకుపోయి, వినియోగదారుల కొనుగోలు శక్తి క్షీణించే అవకాశం ఉంది.
వీటితో పాటు సేవల రంగానికి సంబంధించి సాఫ్ట్‌వేర్ సేవల మిగులు గత ఏడాది నాలుగో త్రైమాసికంలో నమోదైన 53 బిలియన్ డాలర్ల గరిష్ట స్థాయి నుండి 2026 రెండో త్రైమాసికానికి 51.4 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్‌బీఐ ఆక్టోబర్, డిసెంబర్లలో వడ్డీ రేట్లు పెంచక తప్పదని, అయితే 2027 ఫిబ్రవరి నాటికి వినియోగం తగ్గడం మరియు ద్రవ్యోల్బణం అదుపులోకి రావడం వల్ల మరింత వడ్డీ రేట్ల పెంపు సంభవించే అవకాశాలు చాలా తక్కువని నోమురా విశ్లేషించింది. ఈ మార్పులు సామాన్యుల ఈఎంఐలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.
[Nomura, RBI Repo Rate, Interest Rate Hike, India Inflation, CPI Inflation, Monetary Policy, RBI MPC, Food Inflation, India GDP Growth, EMI Rates]


