రెపో రేటు పెంచిన ఆర్బీఐ: రుణాలు ఇక భారం.!
Published on: Wed Oct 7, 2026 12:41PM

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును పాతిక బేసిస్ పాయింట్లు పెంచింది. ఈ నిర్ణయం జనాలకు మరీ ముఖ్యంగా హోంలోన్లు, ఇతర లోన్లు తీసుకున్న వారికి భారీ షాక్ అనే చెప్పాలి. అయితే.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పెరుగుతున్న ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి కారణంగా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని పేర్కొంది.
ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బెంచ్‌మార్క్ రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో రెపో రేటు 5.50 శాతానికి చేరుకుంది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా ఎగబాకడం ఈ వడ్డీ రేట్ల పెంపునకు ప్రధాన కారణంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.
.webp)
దీనివల్ల దేశంలో దిగుమతి ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. ఆగస్టు నెలలో రిటైల్ వినియోగదారుల ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 4.45 శాతం నుంచి 4.82 శాతానికి పెరగిన సంగతి తెలిసిందే. కాగా ఆర్బీఐ తాజాగా పెంచిన రెపో రేటుతో పాటు న్యూట్రల్' నుంచి 'క్యాలిబ్రేటెడ్ టైటెనింగ్ వైపు తన వైఖరి మార్చింది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటును 5.25 శాతానికి సవరించగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు, బ్యాంకు రేటును యథాతథంగా అంటే 5.75 శాతంగా కొనసాగిస్తోంది.
మరోవైపు, దేశ ఆర్థిక వృద్ధి అంచనాలను కూడా ఆర్‌బీఐ సవరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి రేటును 7.1 శాతంగా అంచనా వేయగా, వార్షిక హెడ్‌లైన్ సీపీఐ ద్రవ్యోల్బణం 5.2 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. రెపో రేటు 5.50 శాతానికి పెరగడంతో, వాణిజ్య బ్యాంకులు కూడా తమ వడ్డీ రేట్లను త్వరలోనే పెంచే అవకాశం ఉంది. దీనివల్ల సామాన్య ప్రజలకు ఇల్లు, కారు, వ్యక్తిగత రుణాలు మరింత భారం కానున్నాయి. ఇప్పటికే రుణాలు తీసుకున్నవారి నెలవారీ ఈఎంఐలు ( పెరిగే అవకాశం కనిపిస్తోంది.
[RBI repo rate hike, RBI monetary policy, Repo Rate Increased, Home Loan Interest Rates, Inflation India, RBI news Telugu One]


