TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణకు రెండో ఉపముఖ్యమంత్రి: వచ్చే నెలలో రేవంత్ కేబినెట్ రాషఫుల్.!

Published on: Mon Nov 23, 2026 11:34AM

తెలంగాణ లో మంత్రివర్గ విస్తరణకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్న వార్తల నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ సందడి ఓ రేంజ్ లో పెరిగింది. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ కాదు, పునర్వ్యవస్థీకరణే అంటే కాంగ్రెస్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ చర్చల్లో భాగంగానే.. రేవంత్ కేబినెట్ లో ఇప్పుడు ఉపముఖ్యమంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కు తోడుగా మరో ఉపముఖ్యమంత్రిని కూడా నియమించే అవకాశాలున్నాయన్న చర్చ జోరందుకుంది. 

రాష్ట్రంలో  రేవంత్ సర్కార్  మూడేళ్ల పాలన పూర్తి కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చేపట్టనున్న మంత్రివర్గ విస్తరణ విషయంలో కొత్త వ్యూహాలు, ప్రణాళికలతో ముందుకు సాగాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు చెబుతున్నారు.   సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటున్న క్రమంలో, రాష్ట్రంలో మరో డిప్యూటీ సీఎం పదవి అంశం తెరపైకి వచ్చింది.   తెలంగాణలో కాంగ్రెస్ అధినాయకత్వం ప్రభుత్వం, పార్టీ యంత్రాంగంలో కీలక మార్పులు చేసేందుకు సమాయత్తమౌతోందని అంటున్నారు. ఈ విషయంపై పెద్ద ఎత్తున కసరత్తు జరుగుతున్నదని పార్టీ వర్గాల ద్వారా విశ్వసనీయంగా తెలుస్తోంది. పార్టీ, ప్రభుత్వం మధ్య ఉన్న విభేదాలు, అలాగే కొందరు ఎమ్మెల్యేలు తరచుగా సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పిస్తున్న తీరును సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ హైకమాండ్.. ప్రస్తుత మంత్రివర్గంతో పాటు పార్టీ పదవుల్లోనూ మార్పులు చేయాల్సిన అవసరం ఉందన్న నిర్ణయానికి వచ్చేసింది.   2028 అసెంబ్లీ ఎన్నికలలో విజయమే లక్ష్యంగా ఇటు పార్టీ పదవుల్లోనూ, అటు కేబినెట్ పోర్టుపోలియోల్లోనూ కూడా భారీ మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా ప్రస్తుత కేబినెట్‌లో ఉన్న ఇద్దరు మంత్రులపై వేటు పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి కొండా సురేఖను కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేసిన వెంటనే కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న వార్తలు జోరుగా వినిపింయాయి. అయితే అరకొర మార్పులు కాకుండా సమగ్ర ప్రక్షాళన చేయాలన్న ఉద్దేశంతో హైకమాండ్ కేబినెట్ పునర్యవస్థీకరణ అంశాన్ని అప్పటికి పక్కన పెట్టింది. 

త్వరలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీల భర్తీ ప్రక్రియ జరగనుంది. అది పూర్తయిన వెంటనే రేవంత్ కేబినెట్ ప్రక్షాళన చేయనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గవర్నర్ కోటాలో ఎంపికయ్యే ఎమ్మెల్సీలలో ఒకరికి కేబినెట్ లో చోటు కల్పించే అవకాశాలున్నాయన్నది పార్టీ వర్గాల నుంచి వస్తున్న సమాచారం.  మల్లు భట్టి విక్రమార్కకు తోడుగా, బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతకు మరో డిప్యూటీ సీఎం పదవిని కేటాయించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలంటున్నాయి.

 

ఇది కూడా చదవండి:   వినాయక చవితికి ముందే రేవంత్ కేబినెట్ పునర్వ్యవస్థీకరణ? ఎవరు ఇన్ ఎవరు ఔట్ అంటే?

రాష్ట్ర జనాభాలో 56 శాతానికి పైగా ఉన్న బీసీలకు ప్రభుత్వంలో   కీలక వాటా దక్కాలన్న డిమాండ్ కాంగ్రెస్ పార్టీలో చాలా కాలంగా ఉంది. ఆ డిమాండ్ ను నెరవేర్చే ఉద్దేశంతో హైకమాండ్ రెండో ఉప ముఖ్యమంత్రి అంశాన్ని తెరపైకి తెచ్చిందని అంటున్నారు.  భవిష్యత్తులో బీసీ నేత ముఖ్యమంత్రి అవుతారంటూ ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రెండో ఉపముఖ్యమంత్రి అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.  

సామాజిక సమతుల్యతను కాపాడుతూనే పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. పునర్వ్యవస్థీకరణతో పార్టీలో అసమ్మతి, అసమ్మతి గళాలకు చెక్ పెట్టాలన్న కృత నిశ్చయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉందని అంటున్నారు.  ఏది ఏమైనా వచ్చే నెల రెండో వారం నాటికి కేబినెట్ రీషఫుల్, రెండో ఉప ముఖ్యమంత్రి, పార్టీ పదవులలో మార్పులు తదితర అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

మీకు నచ్చవచ్చు:  రేవంత్ మంత్రివర్గ విస్తరణ నిరవధిక వాయిదా ?

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?​

[Raventh, Cabinet Reshuffle, SecondDeputyCM,  Highcommand, Strategy, TeluguOne]