ఈ భారతీయ మహారాణికి భయపడి మొఘలులు తమ ముక్కులు తామే కోసుకున్నారు..!

మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు బాబర్.  1504లో కాబూల్ లో రాజ్యాన్ని స్థాపించాడు. భారతీయ చరిత్రలో మొఘలుల పాత్ర చాలానే ఉంది.  ఈ మొఘల్ వంశానికి చెందిన  షాజహాన్ మొఘల్ రాజుగా కాకుండా తాజ్మహాల్ స్థాపకుడిగా అందరికీ సుపరిచితుడు.  అయితే షాజహాన్ కాలంలో మొఘలులను మట్టికరిపించి వారి ముక్కులు వారే కోసుకునేలా చేసిన మహారాణి ఒకరు ఉన్నారు.  ఆమె రాణి కర్ణావతి.  భారతదేశంలో ఎంతో మంది రాణులు తమ శౌర్యంతో, యుద్ద నైపుణ్యంతో చరిత్రలో తమకంటూ పేరు చిరస్మరణీయం చేసుకున్నారు. కానీ చాలామందికి తెలియని వారు రాణి కర్ణావతి.  మొఘలులకు ముచ్చెమటలు పట్టించి, వారిని మోకాళ్ల మీద నిలబెట్టించి  వారి ముక్కు వారే కోసుకునేలా చేసిన రాణి కర్ణావతి గురించి తెలుసుకుంటే..


రాణి కర్ణావతి గర్వ్హాల్ రాజ్యానికి చెందినవారు.   ఈమె గర్వ్హాల్ రాజపుత్ర రాజు అయిన మహిపతి షా భార్య.  మహిపతి షా గర్వ్హాల్ రాజ్యాన్ని పాలించేవాడు.  గర్వ్హాల్ రాజ్యం బంగారు,  వజ్రాల గనులతో నిండి ఉండేది.  దీంతో అప్పటి మొఘల్ రాజు అయిన షాజహాన్ దృష్టి గర్వ్హాల్ రాజ్యం మీద పడింది. కానీ మహిపతి షా మీద దాడికి వెళ్లలేక పోయాడు. అయితే కొద్దికాలానికే మహిపతి షా మరణించాడు. అప్పటికి  మహిపతి షా,  రాణి కర్ణావతిల కుమారుడు పృధ్వీపతి షా కు  7 ఏళ్లు. ఆ పిల్లాడినే రాజుగా చేసి తానే రాజ్యాన్ని నడిపిస్తుండేవారు కర్ణావతి.  అయితే  ఓ మహిళ రాజ్యాన్ని పాలిస్తోందనే విషయం తెలుసుకుని గర్వ్హాల్ రాజ్యాన్ని తమ కింద విలీనం చేసి బ్రతకమని షాజహాన్ కబురు పంపాడు.  దీనికి రాణి కర్ణావతి ఒప్పుకోలేదు. దీంతో షాజహాన్ గర్వ్హాల్ రాజ్యం మీదకు తన సైన్యాన్ని పంపాడు.

1640లో చక్రవర్తి  షాజహాన్ ఆదేశాల మేరకు నజబత్ ఖాన్ నేతృత్వంలో మొఘల్ సైన్యం గర్వ్హాల్ పై దాడి చేసింది.  ఈ దాడిని ఎదుర్కోవడానికి రాణి కర్ణావతి నడుం బిగించింది. షాజహాన్ సైన్యం మీద తిరగబడింది. రాణి కర్ణావతి యుద్ద కౌశలం,  ఆమె శౌర్యం ముందు మొఘలులు చేతులెత్తేశారు.  రాణి కర్ణావతి ముందు లొంగిపోయారు.  చాలామంది మొఘల్ సైన్యం ఆమెకు బందీలుగా చిక్కారు.


రాణి కర్ణావతి తనకు చిక్కిన మొఘలు సైన్యాన్ని తేలిగ్గా వదల్లేదు.  తమ ముక్కులను తామే కోసుకోవాలని ఆదేశించారు. లేకపోతే వారి తలలు నరికేస్తానని చెప్పారు. ప్రాణాలు అయినా దక్కుతాయనే ఆశతో మొఘలు సైనికులు తమ కత్తులతో తామే తమ ముక్కులు కోసుకున్నారు. మొఘల్ సేనాపతి నజబత్ ఖాన్ కూడా ముక్కు కోసుకున్నాడు. కానీ తిరుగు ప్రయాణంలో జరిగిన అవమానం భరించలేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. షాజహాన్ ఇదంతా భరించలేక ఉత్తరాఖండ్ పై దాడి ప్రకటించాడు. కానీ ఎన్ని ప్రయత్నాలు చేసినా మొఘలులు రాణి కర్ణావతిని ఓడించలేకపోయారు. చివరకు రెండు సైన్యాల మధ్య ఒప్పందం జరగడంతో ఈ గొడవ ముగిసిందని చరిత్ర చెబుతోంది. ఇలా శత్రువుల ముక్కులు కోసుకునే చేయడంలో రాణి కర్ణావతి ముక్కలు కత్తిరించే రాణిగా చరిత్రలో చెప్పబడింది.


                                                  *రూపశ్రీ.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu