రామాయంపట్నం రిఫైనరీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్: ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మైలురాయి.!
Published on: Mon Oct 5, 2026 9:00AM

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పారిశ్రామిక ప్రాజెక్టుకు ముందడుగు పడింది. నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు సమీపంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్‌కు కేంద్రం నుంచి అనుమతి లభించింది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన నిపుణుల అంచనా కమిటీ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు సిఫారసు చేసింది.
దీంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు విషయంలో ప్రధాన అడ్డంకి తొలగిపోయింది, లక్షా మూడు వేల,408 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రామాయపట్నం పోర్టు పరిసరాల్లో దాదాపు 5 వేల 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు కానున్న ఈ ప్రాజెక్టు ఉత్పత్రతి సామర్థ్యం ఏడాదికి 9 మిలియన్ టన్నులు. పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్‌తో పాటు పెట్రోకెమికల్ ఉత్పత్తులను కూడా ఇక్కడ తయారు చేయనున్నారు.
ఈ ప్రాజెక్టులో పర్యావరణ అంశాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు 30 శాతం విస్తీర్ణాన్ని గ్రీన్‌బెల్ట్‌గా అభివృద్ధి చేయనున్నారు. పర్యావరణ నిర్వహణ కోసం భారీగా నిధులు కేటాయించడంతో పాటు గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధన జోన్లు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. రామాయపట్నం పోర్టుతో అనుసంధానమైన మెరైన్ క్రూడ్ ఆయిల్ టెర్మినల్ కూడా ప్రాజెక్టులో భాగం కానుంది.

రామాయపట్నం పోర్టు సమీపంలో రిఫైనరీ ఏర్పాటు కావడం వల్ల ఈ ప్రాంతం భవిష్యత్తులో పెద్ద ఎనర్జీ, పెట్రోకెమికల్ హబ్‌గా మారే అవకాశం ఉంది. ఇప్పటికే రామాయపట్నం చుట్టూ అనుబంధ పరిశ్రమల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించారు బీపీసీఎల్ ప్రాజెక్టు రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద పారిశ్రామిక పెట్టుబడుల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్టు ద్వారా పెద్ద సఖ్యలో ఉపాధి అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి. నిర్మాణ దశలో వేలాది మందికి పని లభించడంతో పాటు, ప్రాజెక్టు కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్టు నిర్మాణ దశలో 3 వేల 400 ఉద్యోగాలు, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత 3 వేల 750 ప్రత్యక్ష ఉద్యోగాలు లభిస్తాయి.
మరోవైపు రామాయపట్నం రిఫైనరీతో అనుబంధ పరిశ్రమలకు ఊతం లభించనుంది. పెట్రోకెమికల్ రంగానికి సంబంధించిన డౌన్‌స్ట్రీమ్ పరిశ్రమలు, లాజిస్టిక్స్, గిడ్డంగులు, రవాణా, సేవా రంగాలు అభివృద్ధి చెందే అవకాశం ఉంది. ముఖ్యంగా పోర్టు, రిఫైనరీ, అనుబంధ పరిశ్రమలు ఒకే ప్రాంతంలో ఏర్పడటం వల్ల నెల్లూరు, ప్రకాశం ప్రాంతంలో పారిశ్రామిక కార్యకలాపాలు మరింత వేగం పుంజుకుంటాయి.

ప్రాజెక్టు నిర్మాణాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం,బీపీసీఎల్ ఇప్పటికే చర్యలు చేపట్టాయి. సెప్టెంబరులోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బీపీసీఎల్ యాజమాన్యంతో సమావేశమై రామాయపట్నం ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రాజెక్టు పూర్తయితే ఆంధ్రప్రదేశ్‌లో ఇంధన రంగంతో పాటు తయారీ, పెట్రోకెమికల్, పోర్టు ఆధారిత పరిశ్రమలకు గణనీయమైన ప్రోత్సాహం లభిస్తుంది,
మొత్తంగా చూస్తే, రామాయపట్నం రిఫైనరీకి కేంద్రం నుంచి లభించిన గ్రీన్ సిగ్నల్ ఏపీ పారిశ్రామిక ప్రగతిలో మైలురాయి అనడంలో సందేహం లేదు. భారీ పెట్టుబడి, వేలాది ఉద్యోగాలు, అనుబంధ పరిశ్రమలు, పోర్టు ఆధారిత మౌలిక వసతులతో ఈ ప్రాజెక్టు దక్షిణ భారతదేశంలోనే ఒక ముఖ్యమైన ఇంధన కేంద్రంగా రామాయపట్నాన్ని నిలబెట్టనుంది.
[Ramayapatnam Refinery, BPCL Refinery, , AP Mega Projects, BPCL Petrochemical Complex, Andhra Pradesh Investments, Telugu One]


