రామాంతపూర్‌లో భారీ పేలుడు..స్క్రాప్ షాప్ యజమానికి తీవ్ర గాయాలు.!
Published on: Sun Oct 25, 2026 4:52PM

హైదరాబాద్‌లోని రామంతాపూర్‌లో భారీ పేలుడు కలకలం రేపింది. చర్చ్ కాలనీలో ఉన్న ఓ స్క్రాప్ దుకాణంలో ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దుకాణ యజమాని, స్క్రాప్ డీలర్ పరశురామ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
లోహాన్ని కట్ చేస్తుండగా పేలుడు.!
స్క్రాప్ దుకాణంలో లోహపు వ్యర్థాలను కట్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించినట్లు సమాచారం. పేలుడు ధాటికి దుకాణంలో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పరశురామ్ శరీరానికి సుమారు 70 శాతం కాలిన గాయాలైనట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది.!
ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పేలుడు కారణంగా చుట్టుపక్కల ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి.
పేలుడుకు కారణమేంటి.?
ఈ భారీ పేలుడు ఎందుకు సంభవించిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. లోహాలను కట్ చేస్తున్న సమయంలో గ్యాస్ సిలిండర్ లేదా ఇతర ప్రమాదకర పదార్థాల కారణంగా పేలుడు జరిగిందా అనే కోణంలో దర్యాప్తు చేపట్టాల్సి ఉంది. పేలుడుకు అసలు కారణం అధికారికంగా నిర్ధారణ కావాల్సి ఉంది.
జనావాసాల మధ్య ఉన్న స్క్రాప్ దుకాణంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు, భద్రతా లోపాలపై అధికారులు దర్యాప్తు చేపడితే మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
[ Ramanthapur explosion, scrap shop blast, Hyderabad news, Church Colony fire accident, scrap dealer injured, Gandhi Hospital, Telugu One, Telugu News ]


