రామ్ నాథ్ ఫ్రమ్ రామ్ జన్మ భూమి!

రామ్‌నాథ్ కోవింద్ … కొన్ని గంటల కింది దాకా ఈయనెవరో మనకు కాదు… కనీసం చాలా మంది యూపీ వారికి, బీహార్ వారికి కూడా తెలియదనుకుంటా! కాని, అమిత్ షా నోటి నుంచీ ఆయన పేరు బాంబులా పేలగానే దేశమంతా రామ్ నాథ్ , రామ్ నాథ్ అంటూ రామ నామం జపించింది! ఆయన బీహార్ గవర్నర్, యూపీ బీజేపిలోని దళిత నేత అని మీడియా తనకు తెలిసింది చెబుతూ వచ్చింది! కాని, అంతకంటే పెద్దగా చెప్పటానికి ఛానల్స్ వద్ద కూడా ఏం లేదు. నిజానికి… అలాంటి లో ప్రొఫైల్ నాయకుడు కాబట్టే మోదీషా ద్వయం ఆయన్ని రైసినా హిల్స్ రేసులో నిలిపింది! ఎప్పటిలాగే అందర్నీ ఆశ్చర్యపరిచింది!

 

మొన్నీ మధ్యే ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల తరువాత యోగి ఆదిత్యనాథ్ సెలక్షన్ జరిగింది. అప్పుడు కూడా బోలెడు పేర్లు బలంగా వినిపించాయి. ఏ మాత్రం గట్టిగా చెప్పుకోని పేరు ఆదిత్యనాథ్! కాని, అనూహ్యంగా ఆయన్నే లక్నో పీఠంపై ప్రతిష్ఠించారు మోదీ అండ్ షా! వెంటనే యోగుల్ని, సన్యాసుల్ని సీఎంలని చేస్తారా అంటూ మీడియా వారు కొందరు, మేధావులు అర్థం పర్థం లేకుండా ప్రశ్నించారు. కాని, యూపీలో యోగి రాజ్యం నిరాటంకంగా నడుస్తోంది! అదే ఫార్ములా ఇప్పుడు రాష్ట్రపతి అభ్యర్థి రామ్ నాథ్ కోవింద్ విషయంలోనూ ప్రధాని, బీజేపి అధ్యక్షుడు ప్రయోగించారు! ఎవ్వరూ ఊహించని వ్యక్తిని ముందుకు తీసుకొచ్చారు. దళితుడు అంటూ అపోజిషన్ ను ఇరుకున పెట్టారు. అరెస్సెస్ బ్యాక్ గ్రౌండ్ వున్న బలమైన హిందూత్వవాదిని ప్రథమ పౌరుడ్ని చేయబోతూ పంతం నెగ్గించుకుంటున్నారు. ఇది ప్రతిపక్షాలకి తీవ్రమైన ఓటమి కిందే లెక్కా!

 

అడ్వాణీ మొదలు సుష్మా స్వరాజ్, ద్రౌపతీ ముర్ము వరకూ మీడియా చాలా మంది పేర్లు చెప్పింది. చాలా మంది కరుడుగట్టిన బీజేపి అభిమానులు కూడా ఇంకా అడ్వాణీ రాష్ట్రపతి అవ్వటం లేదనే సత్యాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మోదీని అభిమానించే వారే రామ్ నాథ్ కోవింద్ ఎంపిక తట్టుకోలేకపోతుంటే ఇతర పార్టీలు, పార్టీల నేతల సంగతి చెప్పేదేముంది? సోనియా, ఏచూరీ మొదలు ఎన్డీఏ భాగస్వామ్య పక్షమైన శివసేన బాస్ ఉద్ధవ్ దాకా ఎవ్వరూ ఈ ఎత్తును ఎదుర్కోవటం ఎలాగో అర్థం కాక సతమతం అవుతున్నారు. ఇప్పటి వరకూ కేవలం మమత బెనర్జీ మాత్రమే ఘాటుగా వ్యతిరేకించింది రామ్ నాథ్ ఎంపికని. అతను దళితుడు అయినా సరే బీజేపి అభ్యర్థి కాబట్టి మేం సమర్థించమని కుండబద్ధలు కొట్టింది. కాని, మిగతా పార్టీల సంకటం వేరుగా వుంది!

 

కాంగ్రెస్, కమ్యూనిస్టులు ఇంత కాలం దళితుల సంక్షేమం అంటూ ఉదరగొట్టారు. బీజేపి బనియాల పార్టీ అంటూ కార్నర్ చేశారు. కాని, ఇప్పుడు అదే అగ్రకులాల బీజేపి దళితుడ్ని ప్రెసిడెంట్ చేస్తానంటోంది. కాని, ఇతర పార్టీలకు ఇది నచ్చటం లేదు. దళిత రాష్ట్రపతి నినాదంతో మోదీ అన్ని పార్టీల దళిత ఓటు బ్యాంక్ గండికొడతారని భయపడుతోంది. కమలదళం కాన్సెప్ట్ కూడా అదే…

 

బీజేపికి, ఇతర మిత్రపక్షాలకి వున్న ఓట్లే కాక టీఆర్ఎస్, వైసీపీ, బీజేడీ లాంటి పార్టీల మద్దతుతో రామ్ నాథ్ తాపీగా ఎన్నికలో గెలిచేస్తారని విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి కాంగ్రెస్, కమ్యూనిస్టులు పోటీగా దళితుడ్నో, దళిత స్త్రీనో రాష్ట్రపతి పదవికి పోటీ పెట్టినా .. ఉత్కంఠ రేగే సూచనలు కనిపించటం లేదు. ఇప్పుడు ఎటూ తేల్చకుండా వున్న శివసేన, జేడీయూ, బీఎస్పీ, ఎస్పీ, ఏఐఏడీఎంకే లాంటి పార్టీలకు కూడా అంతిమంగా రామ్ నాథ్ వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు. ఎందుకంటే, ఎలాగూ ఓడే ప్రతిపక్షాల అభ్యర్థికి ఓటు వేసి… దళితుల ముందు వ్యతిరేకులుగా ముద్ర పడాలని ఎవరూ కోరుకోరు! మమతా బెనర్జీ, కమ్యూనిస్టుల్లాంటి వారు తప్పా! విచిత్రంగా ఈ సారి మోదీ ప్రకటించిన అభ్యర్థిని వ్యతిరేకించటానికి కనీసం కేజ్రీవాల్ కూడా మీడియా ముందుకు రాలేదంటే పరస్థితి అర్థం చేసుకోవచ్చు! ప్రతిపక్షాల ఓటమి దాదాపు అప్రకటిత సత్యం!

 

రాష్ట్రపతి ఎన్నిక సమయంలో రాజకీయం ఎలా వున్నా రామ్ నాథ్ కోవింద్ ఎంపిక ఖచ్చితంగా చరిత్రాత్మకం! ఇప్పటికే మోదీ ద్వారా ప్రధాని పీఠాన్ని కైవసం చేసుకున్న ఆరెస్సెస్ ఇప్పుడు రామ్ నాథ్ రూపంలో తమ స్వయం సేవకుడ్ని రాష్ట్రపతి భవన్ లో ప్రవేశపెట్టబోతోంది! ఇది కొందరికి నచ్చినా, కొందరికి నచ్చకపోయినా భారతదేశ భవిష్యత్ ని తనదైన రీతిలో ప్రభావితం చేసే పరిణామమే!