TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేంద్ర మంత్రి మురుగన్ రాజీనామా: మంత్రి పదవికే కాదు.. రాజ్యసభ సభ్యత్వానికి కూడా.!

Published on: Wed Oct 14, 2026 3:15PM

కేంద్ర సమాచార ప్రసార, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి  డాక్టర్ ఎల్ మురుగన్ తన మంత్రి పదవికి, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేశారు. ఉరుము లేని పిడుగులా ఆయన రాజీనామా రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.  తమిళనాడులో పార్టీని మరింత బలోపేతం చేయడం, క్షేత్రస్థాయిలో సంస్థాగత విధులకు పూర్తి సమయం కేటాయించేందుకే తాను రాజీనామా చేసినట్లు మురుగన్ ప్రకటించారు. దీంతో ఈయన రాజీనామా ఒక్క సారిగా కేంద్ర మంత్రివర్గ విస్తరణ, లేదా పునర్వ్యవస్థీకరణ  మరో సారి తెరమీదకు వచ్చింది. 

సాధారణ రోజు కూలీల కుటుంబం నుంచి వచ్చి కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడం తనకు   మరువలేని గౌరవమని పేర్కొన్న మురుగన్..  ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలకు సేవ చేసే అవకాశం దక్కడం అదృష్టమని, ఇకపై పార్టీ సంస్థాగత నిర్మాణంపైనే పూర్తి దృష్టి సారించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 

అయితే, మురుగన్ రాజీనామా కేవలం ఆయన వ్యక్తిగత నిర్ణయం మాత్రమే కాదనీ, మంత్రివర్గ విస్తరణకు ఇదొక బలమైన సంకేతమనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత కొంతకాలంగా కేంద్ర మంత్రివర్గంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యసభ పదవీకాలం ముగియడంతో కొందరు నేతలు తప్పుకోవడం, అలాగే పార్టీ సంస్థాగత బాధ్యతల రీత్యా ఇతర నేతలకు పదవులు కేటాయించడం వంటి అంశాలు దీనికి బలం చేకూరుస్తున్నాయి.

నిబంధనల ప్రకారం ఒకే వ్యక్తికి ఒకే పదవి అనే సూత్రం కింద కొందరు సహాయ మంత్రులు తమ స్థానిక పార్టీ బాధ్యతలను స్వీకరించేందుకు సిద్ధమవుతున్నారు. దీనివల్ల కేంద్ర కేబినెట్‌లో దాదాపు అరడజనుకు పైగా మంత్రి పదవులు ఖాళీ అయ్యే అవకాశం ఉందరి అంటున్నారు.  

వచ్చే ఏడాది జరగనున్న వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, అలాగే 2029 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేపట్టేందుకు వీలుగా ముందుగా కొందరు మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలన్న మోడీ, షా ఆదేశం మేరకు ఈ రాజీనామాలు ఉంటాయనీ చెబుతున్నారు.   దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, కేరళ వంటి ప్రాంతాల్లో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేలా సీనియర్ నాయకులను క్షేత్రస్థాయికి పంపిస్తూ, సమర్థులైన లోక్‌సభ సభ్యులకు కేంద్రం కేబినెట్ లో అవకాశం ఇవ్వాలని మోడీ షా భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.

ప్రాంతీయ, సామాజిక సమీకరణాలను దెబ్బతినకుండా చూసుకుంటూ, పార్టీ యంత్రాంగాన్ని మరింత పదును పెట్టే దిశగా బీజేపీ అధిష్టానం పావులు కదుపుతోంది. మురుగన్ లాంటి సీనియర్ నేతలను తిరిగి సంస్థాగత పనులకు పరిమితం చేయడం ద్వారా, భవిష్యత్ పోరాటాలకు క్యాడర్‌ను సమాయత్తం చేయడమే ప్రధాన లక్ష్యంగా కనిపిస్తోంది.

త్వరలోనే ఢిల్లీ నుంచి ఈ మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన  ప్రకటన వెలువడే అవకాశం ఉందనిఅంటున్నారు. ఖాళీ అయిన స్థానాలను కొత్త ముఖాలతో భర్తీ చేస్తూ, ప్రభుత్వ పాలనాదక్షతను మరింత పెంచేలా ప్రధాని మోదీ కొత్త టీమ్‌ను రంగంలోకి దింపనున్నానపి అంటున్నారు.  

[Rajya Sabha Member Union Minister  Murugan resign, Union Minister L Murugan, Modi Cabinet, Reshuffle,  resignation TeluguOne News, Politics]