పెరటి కోళ్లతో ఆరంభం: నెలకు రెండు లక్షల ఆదాయం.. మహిళా పారిశ్రామిక వేత్త సక్సెస్ స్టోరీ.!
Published on: Thu Oct 15, 2026 6:50PM
పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఉండదని నిరూపించారు రాజేశ్వరి. రంగం ఏదైనా ఉన్నత శిఖరాలు అధిరోహించడానికి కావలసిన పట్టుదల, ఎదగాలన్న సంకల్పం ఉంటే చాలని తన విజయగాధతో నిరూపించారు రాశేశ్వరి. దక్షిణ అండమాన్ లోని వాండూర్ గ్రామానికి చెందిన 38 ఏళ్ల రాజేశ్వరి కేవలం ఐదు పెరటి కోళ్లతో ప్రారంభించిన కోళ్ల పెంపకాన్ని అంచలంచెలుగా అభివృద్ధి చేసి ఇప్పుడు నెలకు 1.91 లక్షల నికర లాభాన్ని ఆర్జిస్తున్నారు.
ఆమె విజయ ప్రస్థానం గురించి సంక్షిప్తంగా చెప్పాలంటే.. బోటనీలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన రాజేశ్వరి, సాంప్రదాయ ఉద్యోగ మార్గాల వైపు చూడకుండా స్వయం ఉపాధి వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలో ఆమె శ్రీ విజయపురంలోని ఐకార్-సెంట్రల్ ఐలాండ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను సంప్రదించి, కోళ్ల పెంపకంలో శాస్త్రీయ మెలకువలు నేర్చుకున్నారు. ఆ సంస్థ అందించిన సాంకేతిక సహకారంతో కోళ్లకు సరైన వసతి కల్పించడం, నాణ్యమైన దాణా తయారీ, ఆరోగ్య సంరక్షణ, వ్యాక్సినేషన్ పద్ధతులపై పూర్తి అవగాహన పెంచుకున్నారు.
దీంతో ఐదంటే ఐదు పెరటి కోళ్లతో ఆరంభమైన ఆమె కోళ్ల ఫారం ఇప్పుడు బహుముఖాలుగా విస్తరించింది. పాతిక వందల గుడ్ల సామర్థ్యం కలిగిన మినీ ఇంక్యుబేటర్ను నిర్వహిస్తున్నారు. అలాగే 550 మదర్ బర్డ్స్ తో పాటు మాంసం అవసరాల కోసం మరో పన్నెండోందల కోళ్లను ప్రత్యేకంగా పెంచుతున్నారు. ఈ మదర్ బర్డ్స్ ద్వారా ప్రతి నెలా దాదాపు 3 వేల 600 గుడ్లు ఉత్పత్తి అవుతుండగా, వాటిలో పాతిక వందల గుడ్లను పొదిగించడం ద్వారా సుమారు 80 శాతానికి పైగా హేచబిలిటీతో నెలకు రెండు వేల కోడిపిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు.
ఐకార్ నివేదిక ప్రకారం, రాజేశ్వరి ప్రతినెలా మార్కెట్ అవసరాలకు తగినట్లుగా దాదాపు 600 కిలోల కోడి మాంసం, 600 కోడిపిల్లలు, పదకొండు వందల టేబుల్ ఎగ్స్ను క్రమం తప్పకుండా విక్రయిస్తున్నారు. ఈ సమీకృత వ్యాపార విధానం ద్వారా రాజేశ్వరికి ప్రతి నెలా రూ.1.91 లక్షల నికర ఆదాయం సమకూరుతోంది. ఈ యూనిట్లో పెట్టుబడికి ప్రతిఫలం (బెనిఫిట్-కాస్ట్ రేషియో) 2.02గా నమోదు అవ్వడమే ఆదాయం, లాభంలో స్థిరత్వానికి నిదర్శనగా చెప్పవచ్చు.
రాజేశ్వరి ఆసక్తి, విజయకాంక్ష ఇక్కడితో ఆగిపోలేదు.. ముందు ముందు తన కోళ్ల ఫారంను మరింత విస్తరించే యోచనలో ఉన్నారు. ఈ విస్తరణ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నారు.
[Rajeshwari Poultry Farm, Success Story, Andaman Backyard Poultry Business, Women Entrepreneur,Profit, Telugu One]


