రూ.2 కోట్లు లంచం: ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం.!
Published on: Mon Sep 28, 2026 8:43PM

రాజస్థాన్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉదయ్‌పూర్ హైప్రొఫైల్ కుంభకోణంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఒక పెద్ద చేపను వలలోకి లాగారు. ఒక కేసును నీరుగార్చేందుకు, అరెస్టుల నుంచి రక్షణ కల్పించేందుకు ఏకంగా రూ. 2 కోట్ల భారీ మొత్తంలో లంచం డిమాండ్ చేసిన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ) అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ఏఎస్పీ) ముఖేష్ కుమార్ సోనీ, ఆయన తరఫున మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న సజ్జన్ సింగ్ జైన్ అలియాస్ తట్లాను ఏసీబీ అధికారులు విజయవంతంగా అరెస్టు చేశారు. ఉదయ్‌పూర్‌లో కలకలం రేపిన ఈ ట్రేడింగ్ అండ్ లంచం ఉదంతం పోలీసుశాఖలోనే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే, ఉదయ్‌పూర్‌లో గతంలో వెలుగుచూసిన సంచలనాత్మకమైన 272 ప్లాట్ల కుంభకోణానికి సంబంధించి దర్యాప్తు జరుగుతోంది.
ఈ కేసులో కొందరిని అరెస్టు చేయగా, వారిని ఈ దర్యాప్తు నుంచి రక్షించేందుకు, ఇతర కొత్త కేసుల్లో నిందితులుగా చేర్చకుండా ఉండేందుకు ఎస్‌ఓజీ ఏఎస్పీ ముఖేష్ కుమార్ సోనీ భారీ మొత్తాన్ని డిమాండ్ చేసినట్లు ఏసీబీ విచారణలో తేలింది. అంతేకాకుండా, నిందితుల ఇళ్లలో సోదాలు చేసిన సమయంలో ఎలాంటి అధికారిక జప్తు జాబితా లేకుండా తీసుకున్న ముఖ్యమైన పత్రాలను తిరిగి వెనక్కి ఇచ్చేస్తామని నమ్మబలికారు. ఈ భారీ ఒప్పందం కుదుర్చుకునేందుకు సజ్జన్ సింగ్ జైన్ అనే మిడిల్‌మెన్ (బ్రోకర్) కీలక పాత్ర పోషించాడు. బాధితుడి నుంచి రూ. 2 కోట్లు వసూలు చేసేందుకు ఈ మధ్యవర్తి పావులు కదిపాడు. అయితే, ఏఎస్పీ పాత్రపై అనుమానం వచ్చిన బాధితుడు నేరుగా యాంటీ కరప్షన్ బ్యూరో (ACB) అధికారులను ఆశ్రయించాడు.

బాధితుని ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు అత్యంత గోప్యంగా రంగంలోకి దిగారు. నిందితుల మధ్య జరిగిన సంభాషణలను, ఫోన్ కాల్స్ రికార్డులను పరిశీలించి లంచం డిమాండ్‌ను పక్కాగా నిర్ధారించుకున్నారు. ఈ క్రమంలోనే ప్లాన్ ప్రకారంగా శనివారం నాడు ఉదయ్‌పూర్‌లోని బాధితుడి ఫ్యాక్టరీ వద్ద రూ. 2 కోట్ల లంచం తీసుకుంటున్న సమయంలో మధ్యవర్తి సజ్జన్ సింగ్ జైన్‌ను ఏసీబీ ఇన్‌స్పెక్టర్ సోను షెకావత్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. బ్రోకర్ పట్టుబడిన తర్వాత జరిపిన కూపీ లాగడంలో ఎస్‌ఓజీ ఏఎస్పీ ముఖేష్ కుమార్ సోనీ పాత్ర బట్టబయలైంది.
దీంతో బలోత్రా జిల్లాలోని ఆయన నివాసంలో సోనీని తొలుత అదుపులోకి తీసుకున్న అధికారులు, ఆ తర్వాత ఆదివారం అధికారికంగా అరెస్టు చేశారు. ఈ కేసులో అవినీతి నిరోధక చట్టం (ప్రొవెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్) తో పాటు భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ల కింద క్రిమినల్ కుట్ర కేసు నమోదు చేసినట్లు ఏసీబీ డైరెక్టర్ జనరల్ గోవింద్ గుప్తా వెల్లడించారు. ఒక ఉన్నతస్థాయి పోలీసు అధికారి బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ రూ. 2 కోట్ల మేర భారీ మొత్తాన్ని లంచంగా డిమాండ్ చేయడం రాజస్థాన్‌వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కుంభకోణంలో మరికొందరి ప్రమేయం ఉండే అవకాశం ఉందన్న కోణంలో ఏసీబీ అధికారులు ప్రస్తుతం దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
[ Rajasthan ACB, Rs 2 crore bribe, SOG ASP arrested, Udaipur scam, Mukesh Kumar Soni, anti corruption bureau, Telugu One, Telugu News ]


