సీమాంధ్రకు కొత్త రైల్వేజోన్

 

రాష్ట్ర విభజన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే జోన్‌ను కూడా విభజించాలని కేంద్రం నిర్ణయిం చింది. దీనికి రైల్వే బోర్డు కూడా పచ్చజెండా ఊపింది. తెలంగాణ ప్రాంతం సికింద్రాబాద్ ప్రధాన కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేజోన్‌గా ఉండనుండగా, విజయవాడ ప్రధాన కేంద్రంగా సీమాంధ్ర ప్రాంతం ప్రత్యేక జోన్‌గా ఆవిర్భవించనుంది. రాష్ట్ర విభజన ఖాయంగా మారిన నేపథ్యంలో.. సీమాంధ్రకు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయించాలంటూ వివిధ పార్టీల నేతలు కేంద్రాన్ని గట్టిగా కోరారు. ఆ సమయంలో కేంద్రం దీనిపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి అభిప్రాయాలను సేకరించింది. వాళ్లు మాత్రం కొత్త జోన్ ఏర్పాటు వల్ల అదనంగా ఖర్చు తప్ప ప్రయోజనం ఏమీ ఉండదని పెదవి విరిచేశారు.

 

తెలంగాణా బిల్లుకు పార్లమెంటులో ఆమోదం తెలిపే సమయంలో సీమాంధ్ర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేయటంతో వారిని బుజ్జగించే చర్యల్లో భాగంగా కేంద్రం మళ్లీ ఈ రైల్వే జోన్ విభజను పరిశీలిస్తానని హామీ ఇచ్చింది. తాజాగా రెండు జోన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్రం రైల్వే అధికారులను ఆదేశించటంతో ప్రస్తుతం ఆ దిశగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి రావటంతో అధికారికంగా దీనిపై ప్రకటన విడుదల చేయలేదు.

 

ప్రస్తుతం తూర్పుకోస్తా (ఈస్ట్‌కోస్ట్) జోన్ పరిధిలో ఉన్న విశాఖపట్టణం, శ్రీకాకుళం, విజయనగరం ప్రాంతాలను కూడా కొత్త జోన్ పరిధిలోకి తేనున్నారు. ఈ మూడు ప్రాంతాలను ప్రత్యేక డివిజన్‌గా చేసి దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి తేవాలని చాలాకాలంగా గట్టి డిమాండ్ ఉన్నా రైల్వే శాఖ పట్టించుకోలేదు. ఇప్పుడు పనిలోపనిగా ఆ ప్రాంతాలను తూర్పుకోస్తా నుంచి తప్పించి విజయవాడ కేంద్రంగా ఏర్పడే కొత్త జోన్ పరిధిలోకి చేర్చాలని నిర్ణయించారు.