రాహుల్ తర్వాత... గాంధీల శకం ముగిసినట్టేనా?
posted on Oct 4, 2025 2:47PM
.webp)
రాహుల్ తర్వాత... గాంధీల శకం ముగిసినట్టేనా? ఈ ప్రశ్న ఎందుకు తలెత్తిందంటే.. తాజాగా వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ కేరళలోని అరికోడ్ లో జరిగిన ర్యాలీలో ప్రసంగించిన తర్వాత తన ఇద్దరు పిల్లలు మిరాయా, రైహాన్ లను ప్రజలకు పరిచయం చేశారు. కాబోయే గాంధీ కుటుంబ వారసులుగా వీరిద్దరే అన్న సంకేతాలిచ్చారామె.
అయితే ఇక్కడొచ్చే చిక్కేంటంటే.. సాంకేతికంగా వీర్ని మిరాయా వాద్రా, రైహాన్ వాద్రాగా పిలవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో చూస్తే రాహుల్ తర్వాత ఈ గాంధీ అన్న శబ్ధం ఈ కుటుంబం చివర వినిపించడం ఇక మాయమయ్యేలా కనిపిస్తోంది.
అయితే ఇప్పటి వరకూ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అన్నది గాంధీ కుటుంబ వారసత్వంగా వింటూ వస్తున్నాం. ఆ మాటకొస్తే రాజీవ్ గాంధీని పెళ్లాడిన సోనియా సైతం గాంధీగానే ఇక్కడ పిలవబడ్డారు. కట్ చేస్తే ఇప్పుడు సమస్య ఏంటంటే రాహుల్ తర్వాత ఆ కుటుంబం నుంచి గాంధీ అన్న ఇంటి పేరు దాదాపు కనుమరగు కానుందనే చెప్పాలి.
కారణం.. రాహుల్ గాంధీకి అధికారికంగా పెళ్లి కాలేదు. ఆపై ఆయనకంటూ పిల్లలున్నారన్న విషయం కూడా ఎవరికీ తెలీదు. దీంతో ఈ కుటుంబం నుంచైతే గాంధీ అన్న సర్ నేమ్ ఇకపై వినిపించే ఛాన్స్ లేదు. రాహుల్ గాంధీయే ఈ పరంపరలో చివరి వారవుతారు.
అయితే ఇక్కడ మరొక అవకాశం లేక పోలేదు. అదే మేనకాగాంధీ, వరుణ్ గాంధీ. సంజయ్ గాంధీ కుమారుడైన వరుణ్ గాంధీ కి కూడా ఇద్దరు కూతుళ్లు. వీరు పేర్లు ఆద్య, అనసూయ. వీరి పేర్ల చివర గాంధీ అన్న శబ్ధం వినిపిస్తుంది. కానీ వారు కుమార్తెలు కావడంతో. వారి ఇంటి పేరు కూడా మారే అవకాశముంది. అచ్చం ప్రియాంక గాంధీ వాద్రాలాగా.
మొత్తంగా ఈ తరం తర్వాత కూడా ఒక వారసుడు.. అది కూడా గాంధీ అన్న ఇంటి పేరును ప్రపంచం ముందు సగర్వంగా నిలపడానికి తగిన యోధుడు కనుచూపు మేర కనిపించడం లేదు. వచ్చే రోజుల్లో రాహుల్ తన ఓట్ల చోరీ ప్రచారం ఫలించి.. పీఎం అయితే.. గాంధీ వంశం నుంచి అయ్యే చివరి పీఎం ఈయనే అవుతారు. ఆ తర్వాత గాంధీల చరిష్మా క్రమేణా కనుమరుగయ్యే అవకాశం కనిపిస్తోంది.
బీజేపీ గానీ గట్టిగా పట్టుబట్టి రాహుల్ గాంధీని కూడా రాకుండా చేస్తే.. రాజీవ్ గాంధీయే చివరి గాంధీస్ ఫ్యామిలీ కా పీఎం. అంతే సంగతులు చిత్తగించవలయును అన్నట్టుగా మారనుంది పరిస్థితి. ఆ మాటకొస్తే ఒరిజినల్ గాంధీకి ప్రతిగా లాల్ బహదూర్ శాస్త్రిని తెరపైకి తేవాలని విస్తృతంగా ప్రయత్నిస్తోంది ఆర్ఎస్ఎస్.
ఇటీవల జరిగిన శతాబ్ది ఉత్సవాల్లో మోహన్ భగవత్ అన్న మాట ఏంటంటే ఇవాళ గాంధీ జయంతే కాదు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా అన్న కామెంట్ చేశారు. ఈ లెక్కన చూస్తే గాంధీ అన్న శబ్ధం వినబడకుండా చేయడంలో ఇటు ఒక వర్గం ప్రయత్నిస్తుండగా.. అటు ఆ కుటుంబం నుంచి కూడా సాంకేతికంగా ఇందుకు సహకారం అందుతోన్న విధం కళ్లకు కడుతోంది. మరి మీరేమంటారు!!!