విదేశీ గడ్డపై మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు: రాహుల్ తీరుపై బీజేపీ మండిపాటు.!
Published on: Fri Nov 20, 2026 11:46AM

కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలు, ఆ పర్యటనల్లో ఆయన చేసే వ్యాఖ్యలూ వివాదాస్పదం కావడం కద్దు. దేశంలో పార్లమెంటు వేదికగా ప్రస్తావించాల్సిన అంశాలను ఆయన నిస్సంకోచంగా విదేశీ గడ్డపై మాట్లాడటం పట్ల గతంలోనూ పలు మార్లు వివాదాస్పదమైంది. ఆయన తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. అయినా ఆయన ధోరణి మారడం లేదని, ఇది ఎంత మాత్రం సమంజసం కాదనీ.. రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలూ అంటున్నాయి. తాజాగా ఆయన విదేశీ గడ్డపై నుంచి భారత విదేశాంగ విధానంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆయన తన అమెరికా పర్యటనలో భాగంగా చికాగో విశ్వవిద్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ ప్రతిష్టకు భంగకరంగా మారాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో భారత్ ఒక సైడ్ ప్లేయర్ గా ఇంకా చెప్పాలంటే ప్రేక్షకురాలిగా మారిపోయిందని రాహుల్ చికాగో వర్సిటీ వేదికగా వ్యాఖ్యానించారు. గతంలో అంతర్జాతీయ వేదికలపై స్వతంత్ర దృక్పథంతో వ్యవహరించిన దేశం.. ప్రస్తుత పరిస్థితుల్లో తన ప్రభావాన్ని కోల్పోయి పక్కకు తప్పుకుందని విమర్శించారు. ప్రపంచ వ్యవహారాల్లో భారత్ పాత్ర ప్రాధాన్యత దిగజారిందని వ్యాఖ్యానించారు. భౌగోళిక రాజకీయాలపై స్పష్టమైన అవగాహనతో పాటు సొంత ఆలోచనా విధానంతో ఉండే భారత్ ఇప్పుడు అలా ఉండటం లేదని విమర్శించారు. ఇతర దేశాలతో సంబంధాలు, భాగస్వామ్యాలు ఉన్నప్పటికీ స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యత ఉండేదని, అయితే ఇప్పుడు పాకిస్థాన్ వంటి దేశం అమెరికా, ఇరాన్‌లతో చర్చలు జరుపుతుండగా భారత్ మాత్రం కీలక చర్చల నుంచి దూరంగా నిలిచిపోవడం విస్మయం గొలుపుతోందని రాహుల్ అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశాంగ విధానం తీరును రాహుల్ గాంధీ తప్పుపట్టారు. అంతర్జాతీయ సంబంధాలు కేవలం వ్యక్తిగత స్నేహాల ప్రాతిపదికన కొనసాగవని, భౌగోళిక రాజకీయాల్లో స్నేహం కంటే విధానాలకే అధిక ప్రాధాన్యత ఉంటుందని రాహుల్ పేర్కొన్నారు. మోదీ తరచూ విదేశీ నేతలతో తన స్నేహం గురించి చెబుతుంటారని, కానీ వ్యక్తిగత స్నేహాలతో విదేశాంగ విధానం నడుస్తుందని భావించడం సరికాదన్నారు.
.webp)
రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. విదేశీ గడ్డపై ప్రసంగిస్తూ దేశ ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించింది. ఈ మేరకు బీజేపీ అధికార ప్రతినిధి సీఆర్ కేశవన్.. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవని, అంతర్జాతీయ రాజకీయాలపై ఆయనకు కనీస అవగాహన కూడా లేదని విమర్శించారు. మోదీ నాయకత్వంలో ఇండియా ప్రపంచ వేదికపై ఏకాభిప్రాయాన్ని సాధించే శక్తిగా ఎదుగుతోందని, ఈ ఎదుగుదలను రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. అలాగే మరో బీజేపీ నేత ప్రదీప్ భండారీ అంతర్జాతీయ వేదికలపై రాహుల్ గాంధీ పాకిస్థాన్‌కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. పాకిస్థాన్ అంశంపై రాహుల్‌కు ఎందుకంత ఆసక్తి అని ప్రశ్నిస్తూ, విదేశీ వేదికలపై ఆయన తీరును తప్పుపట్టారు.
ఇది కూడా చదవండి: విదేశీ గడ్డపై దేశ వ్యతిరేక వ్యాఖ్యలా: రాహుల్ తీరుపై సర్వత్రా విమర్శలు.!
చికాగోలో రాహుల్ చేసిన వ్యాఖ్యలు దేశంలో రాజకీయ వేడిని పెంచేశాయి. రాబోయే రోజుల్లో భారత విదేశాంగ విధానం, అంతర్జాతీయ వేదికలపై దేశ పాత్రకు సంబంధించి కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉంది.
.webp)
మొత్తంమీద తటస్థులు కూడా విదేశీ గడ్డపై దేశం గురించిన విమర్శలు సరికాదని రాహుల్ కు హితవు చెబుతున్నారు. రాహుల్ గాంధీకి మోడీ విదేశాంగ విధానాలపై అభ్యంతరాలు ఉంటే దేశీయంగా చట్టసభల్లో ప్రస్తావించడం ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించాలని కానీ, విదేశీ పర్యటనల్లో దేశ విధానాలను పలుచన చేసే విధంగా ప్రసంగాలు చేయడం అనుచితమని అంటున్నారు.
మీకు నచ్చవచ్చు: విదేశీగడ్డపై ఇవేం వ్యాఖ్యలు.. రాహుల్ తీరుపై బీజేపీ ఫైర్
నా ఫోన్ ట్యాప్ చేస్తున్నారు.. మోదీకి అన్నీ తెలుసు: రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్.!
[Rahul Gandhi, Chikago varsity speac, Contrvarsy, India foreign policy, Prime Minister Modi,TeluguOne]


