సీఈఓ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి: రాహుల్ గాంధీ డిమాండ్.!
Published on: Thu Sep 24, 2026 9:05PM
.webp)
భారత రాజకీయాల్లో ప్రస్తుతం ఎలక్షన్ కమిషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వ్యవపై తీవ్ర దుమారం రేగుతోంది. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిర్వహించిన మీడియా సమావేశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దేశ అత్యున్నత ఎన్నికల సంఘంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు, 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్రక్రియలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సంఘం తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలపై తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు మరియు వివేక్ జోషి గత 10 నెలల కాలంలో ఏకంగా 14 సార్లు రికార్డు స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు మీడియాలో సంచలన నివేదికలు వెలువడ్డాయి. ఈ పరిణామాల తర్వాతే రాహుల్ గాంధీ ఈ ప్రెస్‌మీట్ నిర్వహించి, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది కేవలం కాగితం మీద ముద్రించేది కాదని, అది ప్రతి పౌరుడి హృదయ స్పందన అని అభివర్ణించారు. కానీ, గత 2024 లోక్‌సభ ఎన్నికలు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు చోరీ అయ్యాయని ఆయన గట్టిగా ఆరోపించారు. హర్యానా, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో దశాబ్దాలుగా మారుతూ వచ్చిన ప్రజా తీర్పు, అకస్మాత్తుగా 'వ్యతిరేకత' (యాంటీ-ఇన్‌కంబెన్సీ) లేకుండా ఎలా మారిపోయిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఓటు చోరీ జరిగితే, దాని వెనుక పెద్ద కుట్ర దాగి ఉంటుందని, దీనివల్ల క్రమంగా 'చట్టాల చోరీ' (కానూన్ చోరీ), ఆ తర్వాత 'వ్యవస్థల చోరీ' (సంస్థా చోరీ) జరుగుతాయని ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

ఎన్నికల సంఘంలో జరిగిన అంతర్గత విభేదాలపై స్పందిస్తూ.. మిగిలిన ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ధైర్యంగా ముందుకు వచ్చి వాస్తవాలను బయటపెట్టడం ఎంతో మంచి పరిణామమని రాహుల్ గాంధీ ప్రశంసించారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ఇకనైనా తన పద్ధతి మార్చుకుని, దేశ ప్రయోజనాల దృష్ట్యా అప్రూవర్ (Approver) గా మారిపోవాలని ఆయన సలహా ఇచ్చేశారు. ఇది దేశభక్తితో కూడిన చర్య అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కనుసన్నల్లోనే ఇదంతా జరిగిందని ఆరోపించిన రాహుల్ గాంధీ.. భవిష్యత్తులో దీనిపై సమగ్ర విచారణ జరిగి తీరుతుందని, తప్పు చేసిన వారెవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ఓట్లు దొంగిలించి పార్లమెంట్‌లో కూర్చున్న ఎంపీలు చేసే చట్టాలన్నీ పూర్తిగా చట్టవిరుద్ధమని ఆయన తేల్చిచెప్పారు.
[ Rahul Gandhi, Gyanesh Kumar, Election Commission, Vote Chori, CEC Resignation, ECI Controversy, Vote theft allegations, Election Commission of India, Narendra Modi, Amit Shah, Voter list revision ]
,


