TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాధాకృష్ణుల బంధం నుండి నేటికాలపు భార్యాభర్తలు నేర్చుకోవాల్సింది ఏంటి.!

Published on: Tue Sep 29, 2026 9:48AM

రాధాకృష్ణుల బంధం నుండి నేటికాలపు భార్యాభర్తలు నేర్చుకోవాల్సింది ఏంటి.!

రాధాకృష్ణుల బంధం అపారమైన ప్రేమకు, పవిత్రమైన అనుబంధానికి ప్రతీక. కాలాలు మారినా, నాగరికతలు ఎంత ముందుకు వెళ్లినా వారి బంధం సృష్టించిన ఆదర్శాలు ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. భారతీయులు చాలా వరకు బంధాల విలువలు,  సంప్రదాయాలు,  వ్యక్తిత్వం మొదలైన వాటిని పురాణాలు,  పురాణ వ్యక్తుల నుండే నేర్చుకుంటారు.  సాధారణంగా భార్యాభర్తల బంధంలో ఎలా ఉండాలి అని ఆది దంపతులు అయిన పార్వతీ పరమేశ్వరులను చూసి తెలుసుకోవాలని వారిని ఆరాధించాలని చెబుతూ ఉంటారు. అయితే నిశితంగా చూస్తే అందరు దేవుళ్ల బంధంలో ఎన్నో గొప్ప విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే రాధాకృష్ణుల నుండి ఎంతో నేర్చుకోవచ్చు.

నేటి ఆధునిక కాలంలో భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావడం, మానసిక దూరాలు పెరగడం సాధారణమైపోయింది. ఇలాంటి తరుణంలో రాధాకృష్ణుల అనుబంధం నుండి నేటి తరం దంపతులు నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే..

షరతులు లేని ప్రేమ..

 రాధాకృష్ణుల బంధంలో కనిపించే మొదటి సూత్రం విషయం నిబంధనలు లేని ప్రేమ. నేటి దాంపత్య జీవితంలో చాలామంది వ్యక్తులు నా భాగస్వామి నా కోసం ఇది చేయాలి, నా మాట వినాలి అని కొన్ని షరతులు విధించుకుంటారు. కానీ రాధాకృష్ణుల ప్రేమ ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించలేదు. దాంపత్యంలో ప్రేమిస్తున్నాం అంటే భాగస్వామిని వారి పరిమితులతో సహా స్వీకరించడమే అని వారి బంధం చెప్తుంది. ఎలాంటి షరతులు లేకుండా ఒకరినొకరు గౌరవించుకున్నప్పుడే ఆ బంధం సుదీర్ఘకాలం నిలుస్తుంది.

నమ్మకం, మానసిక అనుబంధం..

 రాధాకృష్ణులు భౌతికంగా కలిసి ఉన్న సమయం చాలా తక్కువ. కృష్ణుడు మధురకు వెళ్లిన తర్వాత వారిద్దరూ మళ్లీ భౌతికంగా చేరువ కాలేదు. అయినప్పటికీ వారి మానసిక బంధం ఏమాత్రం తగ్గలేదు. నేటి ఉద్యోగ రీత్యా లేదా ఇతర కారణాల వల్ల దూరంగా ఉండే దంపతులకు ఇది గొప్ప సందేశం. భౌతిక సామీప్యం కంటే మానసిక నమ్మకమే బంధాన్ని బలోపేతం చేస్తుంది. ఒకరిపై ఒకరికి ఉండే నిశ్చలమైన విశ్వాసమే ఏ సమస్యనైనా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది.

త్యాగం, సహనం..

 ప్రేమ అంటే కేవలం సొంతం చేసుకోవడం మాత్రమే కాదు, అవసరమైనప్పుడు ఒకరి సంతోషం కోసం మరొకరు త్యాగం చేయడం. రాధాకృష్ణుల జీవితంలో త్యాగానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. లోక కల్యాణం కోసం కృష్ణుడు తన దారిని ఎంచుకుంటే, రాధ ఆయన నిర్ణయాన్ని నవ్వుతూ స్వీకరించింది. నేటి కుటుంబాల్లో స్వార్థం తగ్గించి, భాగస్వామి ఎదుగుదల కోసం లేదా కుటుంబ శ్రేయస్సు కోసం చిన్న చిన్న విషయాల్లో సర్దుకుపోవడం, త్యాగం చేయడం ఎంతైనా అవసరం.

అర్థం చేసుకోవడం..

 ఒకరి స్వభావాన్ని మరొకరు అర్థం చేసుకోవడం , భాగస్వామి వ్యక్తిత్వానికి స్వేచ్ఛనివ్వడం చాలా ముఖ్యం. రాధ కృష్ణుడిని ఎప్పుడూ తన వద్దే ఉండిపోవాలని నిబంధనలు విధించలేదు. ఆయన బాధ్యతలను నెరవేర్చడానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చింది. నేటి బంధాల్లో చాలామంది భాగస్వామిపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. కానీ నిజమైన ప్రేమ భాగస్వామికి స్వేచ్ఛను ఇస్తుంది, వారి లక్ష్య సాధనలో తోడుగా నిలుస్తుంది.

అహంకారం లేకపోవడం..

రాధాకృష్ణుల బంధం ద్వారా వ్యక్తమయ్యే మరొక గొప్ప గుణం అహంకారం లేకపోవడం. ప్రేమ ఉన్న చోట నేను అనే అహంకారానికి తావు ఉండకూడదు. నేటి దంపతుల మధ్య వచ్చే చాలా గొడవలకు కారణం అహంకారమే. ఎవరు తగ్గాలి, ఎవరు ముందు మాట్లాడాలి అనే పంతాలు బంధాలను దెబ్బతీస్తాయి. రాధాకృష్ణులు ఇద్దరూ వేర్వేరు కాదు, ఒక్కటే అనే భావనతో జీవించారు. దంపతులు కూడా తమ మధ్య నేను అనే భావనను పక్కన పెట్టి మేము అనే భావనను పెంపొందించుకోవాలి.

పరస్పర గౌరవం..

కృష్ణుడు రాధను ఎంతో గౌరవించేవాడు. ఆమె సలహాలకు, భావాలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చేవాడు. నేటి దాంపత్యంలో ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవించడం చాలా ముఖ్యం. ఏవైనా సమస్యలు వచ్చినప్పుడు దాచకుండా, పారదర్శకంగా మాట్లాడుకోవడం వల్ల అనేక అపార్థాలు తొలగిపోతాయి.

చివరగా..

ఈ విధంగా రాధాకృష్ణుల పవిత్ర బంధం కేవలం ఒక పురాణ గాథ మాత్రమే కాదు, నేటి తరం దంపతులకు ఒక మార్గదర్శి. వారి బంధం నుండి నిరపేక్షమైన ప్రేమ, నమ్మకం, త్యాగం, అహంకారం లేకపోవడం వంటి గుణాలను అలవర్చుకుంటే ప్రతి దాంపత్య జీవితం ఆనందమయంగా, అర్థవంతంగా మారుతుంది.

                                                                                                                                           *రూపశ్రీ.