కేటీఆర్‌కు రేవంత్‌రెడ్డి ట్వీట్‌.. అధికారుల క్విక్ రియాక్ష‌న్‌..

రేవంత్‌రెడ్డి. ఇప్పుడో వ్య‌క్తి కాదు శ‌క్తి. టీపీసీసీ చీఫ్‌గా కేసీఆర్ స‌ర్కారుపై యుద్ధం చేస్తున్నారు. ప్ర‌జా గొంతుక‌ను ప్ర‌భుత్వానికి గ‌ట్టిగా వినిపిస్తున్నారు. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అధికారుల‌ త‌ప్పుడు విధానాల‌పై స‌ర్కారును ఎప్ప‌టిక‌ప్పుడు ఎండ‌గ‌డుతున్నారు. తాజాగా, హైద‌రాబాద్‌లోని ఓ అక్ర‌మ నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు రేవంత్‌రెడ్డి. క‌ట్ చేస్తే.. తెల్లారేస‌రిక‌ల్లా ఆ అక్ర‌మ బిల్డింగ్ మ‌టాష్‌. ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే...

ఉప్పల్‌ చౌరస్తాలో హైదరాబాద్‌కు చెందిన ఓ మంత్రి అండతో అక్రమ నిర్మాణం వెలుస్తున్నట్లు పీసీసీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ వేదికగా మంత్రి కేటీఆర్‌కు ఫిర్యాదు చేశారు. ఉప్పల్‌ చౌరస్తాను ఆనుకొని క‌డుతున్న అక్రమ నిర్మాణంపై ఎన్ని ఫిర్యాదులు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ‘మీ శాఖలో బాగోతాలు మీద చర్యలు ఉంటాయా..? లేదా మీరూ ఇందులో భాగస్వాములేనా..?’ అంటూ కేటీఆర్‌ను రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. నిర్మాణానికి సంబంధించిన వీడియోతో సహా కేటీఆర్‌కు ట్విట్ట‌ర్‌లో ఫిర్యాదు చేశారు. తెలంగాణ సీఎంఓ కార్యాలయానికి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు కూడా టాగ్‌ చేశారు.

రేవంత్‌రెడ్డి ట్వీట్‌పై జీహెచ్‌ఎంసీ అధికారులు వెంట‌నే స్పందించారు. అనుమతులు లేకుండా క‌డుతున్న బిల్డింగ్‌ సెంట్రింగ్‌ నిర్మాణాన్ని కూల్చివేశారు. ఇదేదో ఫిర్యాదు చేయ‌గానే స్పందిస్తే బాగుండేదిగా.. రేవంత్‌రెడ్డి రంగంలోకి దిగితేనే ప‌న‌వుతుందా? అంటూ స్థానికులు జీహెచ్ఎమ్‌సీ అధికారుల‌పై మండిప‌డుతున్నారు. రేవంతా..మ‌జాకా.. అని చ‌ర్చించుకుంటున్నారు.