వైద్య సేవలకు క్వాంటమ్ టెక్నాలజీ!
Published on: Mon Aug 31, 2026 2:22PM

ఆంధ్రప్రదేశ్ లో అత్యవసర వైద్య సేవల రంగంలో కొత్త సాంకేతిక అధ్యాయం ప్రారంభంకానుంది. బాధితులకు వేగంగా, ఖచ్చితత్వంతో వైద్య సహాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతను వినియోగించనుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన క్వాంటమ్ మిషన్ లో భాగంగా ఈ ప్రాజెక్టును ప్రయోగాత్మకంగా అమలు చేయనుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారిగా గుంటూరు జిల్లాను పైలట్ ప్రాజెక్టు కోసం ఎంపిక చేసింది. అత్యవసర సమయాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద గుంటూరు జిల్లా వ్యాప్తంగా సేవలు అందిస్తున్న 67 అంబులెన్సులను అనుసంధానించి వైద్య సేవలను అందించనున్నారు. దీనిని అభివృద్ధి చేసి, సమర్థంగా సేవలందించేందుకు నాలుగు స్టార్టప్ సంస్థలు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాయి. ఆధునిక కంప్యూటింగ్ పద్ధతులను ఉపయోగించి అంబులెన్సుల కేటాయింపు, అవి ప్రయాణించే మార్గాల ఎంపిక ఎప్పటికప్పుడు సమీక్షించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీని ద్వారా అంబులెన్స్ సేవలు చాలా వేగంగా బాధితులకు అందుబాటులో వస్తాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం అంబులెన్సులు సాధారణంగా జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాల్లోని ప్రధాన ఆసుపత్రుల సమీపంలో నిలిపి ఉంచుతారు. కంట్రోల్ రూమ్‌కు ఫోన్ కాల్ వచ్చిన తర్వాతే వాహనం ఘటనా స్థలానికి బయలుదేరుతుంది. అయితే క్వాంటమ్ ఆధారిత వ్యవస్థ ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తుంది. అత్యవసర పిలుపు వచ్చిన తర్వాత స్పందించడమే కాకుండా, ముందస్తుగా ప్రమాదాలు లేదా అత్యవసర పరిస్థితులు ఏర్పడే అవకాశాలు ఉన్న ప్రాంతాలను సాంకేతికత సహాయంతో గుర్తించి వాహనాలను సిద్ధంగా ఉంచుతారు.
గడిచిన మూడేళ్ల అత్యవసర కాల్స్ సమాచారాన్ని, డేటాను అల్గారిథమ్ ద్వారా విశ్లేషిస్తారు.. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కువగా అంబులెన్స్ సేవలకు డిమాండ్ వస్తోందో గుర్తించి, ఆయా ప్రాంతాలకు సమీపంలోనే వాహనాలను ఉంచుతారు. దీనివల్ల సమాచారం అందడంతోనే స్వల్ప వ్యవధిలోనే అవసరమైన ప్రాంతానికి అంబులెన్సులు చేరుకుంటాయి. సమయం ఆదా కావడం ద్వారా బాధితులకు సకాలంలో చికిత్స అందే వీలు కలుగుతుంది.
ఈ సాంకేతికత కేవలం అంబులెన్స్ పొజిషనింగ్‌కే పరిమితం కాకుండా, ప్రయాణ సమయాన్ని తగ్గించడంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. గూగుల్ మ్యాప్స్ సేవలను కూడా దీనితో అనుసంధానించడం వల్ల రోడ్డుపై ట్రాఫిక్ పరిస్థితులు, ప్రత్యామ్నాయ మార్గాలకు సంబంధించిన సమాచారం డ్రైవర్‌కు రియల్ టైమ్‌లో అందుతుంది. ఈ ప్రయోగం రాబోయే రోజుల్లో దేశానికే ఆదర్శంగా నిలిచే అవకాశాలు ఉన్నాయని సాంకేతిక, వైద్య నిపుణులు అంటున్నారు.
[Quantum Technology in Health Srevices, AP Quantum Ambulance Services, Healthcare AP, Guntur Pilot Project]


