స్థానిక ఎన్నికల వేళ: పుంగనూరు రాయచోటీలో ఉద్రిక్తతలు.. రాళ్లదాడులు, వాహనాల దగ్ధం.!
Published on: Fri Oct 16, 2026 3:45PM
.webp)
స్థానిక ఎన్నికల వేళ ఏపీలో మరోసారి పొలిటికల్ హీట్ పీక్స్ కు చేరింది. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పుంగనూరు తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా మారింది. స్థానిక రాజకీయ పరిణామాలు, అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పెరుగుతున్న ఆధిపత్య పోరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. నియోజకవర్గంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు శాంతిభద్రతల సమస్యగా మారుతున్నాయి.
తాజాగా పుంగనూరులో వైసీపీ సీనియర్ నాయకుడు, ఎంపీ మిథున్ రెడ్డి వాహనంపై రాళ్లదాడి జరిగింది. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తెలుగుదేశం, వైసీపీ శ్రేణులు బాహాబాహీకి తలపడ్డారు. ఇరువర్గాల మధ్య ఘర్షణలతో పరిస్థితి వేడెక్కింది. ఒక దశలో పోలీసులు ఇరు వర్గాలను అదుపు చేయడానికి గాలిలోకి కాల్పులు జరిపారు. కాగా రాయచోటిలో కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాయచోటీలో ఆందోళనకారులు కొన్ని వాహనాలకు నిప్పంటించారు.
.webp)
రాజంపేట ఎంపీ పీవీ మిథున్ రెడ్డి పార్టీ అభ్యర్థులతో కలిసి నామినేషన్ల కోసం వెళ్తుండగా టీడీపీ శ్రేణులు కాన్వాయ్ను అడ్డుకుని రాడ్లు, కర్రలతో దాడి చేశాయని వైసీపీ ఆరోపించింది. ఇది ముందస్తు ప్రణాళికతో చేసిన హత్యా ప్రయత్నమని, పోలీసులు సరైన రక్షణ కల్పించ లేదని ఆరోపిస్తూ ఎన్నికల సంఘం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. ఇంకోవైపు ఎన్నికల వాతావరణాన్ని కావాలనే రెచ్చగొడుతూ వైసీపీ ఘర్షణలకు దిగిందని టీడీపీ వర్గాలు ప్రత్యారోపణలు చేస్తున్నాయి. రెండు పార్టీల కార్యకర్తల మధ్య పరస్పర దాడులు, వాహనాల దహనంతో పరిస్థితి రణరంగంగా మారింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితి తగ్గుముఖం పట్టినప్పటికీ ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. రాయచోటి, పుంగనూరుతో పాటు తిరుపతిలో కూడా నామినేషన్ కేంద్రం దగ్గర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇక్కడ వైసీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి రౌడీయిజం చేస్తున్నారని కూటమి పక్షాలు ఆందోళన చేశాయి.
[Punganur Stone Pelting, Mithun Reddy, Vehicle Attack, Andhra Pradesh Politics, YCP, TDP Clash, Telugu One]


