ప్రతి పండగకూ 10 తులాల బంగారం డిమాండ్..ఐటీ ఉద్యోగి మృతి వెనుక షాకింగ్ నిజాలు.!
Published on: Tue Nov 3, 2026 7:16PM

మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకున్న ఒక ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఒకప్పుడు ఐటీ ఉద్యోగిగా పనిచేసి మానేసిన యువతి పాయల్ జాంబ్రే పాటిల్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. ఆమె తన అపార్ట్మెంట్లో ఉరివేసుకుని విగతజీవిగా కనిపించడం స్థానికంగా తీవ్ర విషదాన్ని నింపింది. అయితే, ఆమె మరణం కేవలం సాధారణ ఆత్మహత్య కాదని, కట్న వేధింపుల కారణంగా జరిగిన హత్యేనని పాయల్ కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. వివాహం జరిగిన నాటి నుంచి అత్తమామలు, భర్త తనను శారీరకంగా, మానసికంగా తీవ్ర వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు కన్నీటిపర్యూరవుతున్నారు.
ఈ విషాద ఘటనకు సంబంధించి కుటుంబ సభ్యులు వెల్లడించిన మరిన్ని షాకింగ్ వివరాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. కేవలం పెళ్లి సమయానికే కాకుండా, ప్రతి దీపావళి పండుగకు అదనపు కట్నంగా ఖచ్చితంగా పది తులాల (10 tolas) బంగారం ఇవ్వాలంటూ అత్తమామలు వేధించేవారని పాయల్ మామ తెలిపారు. ప్రతి ఏటా దీపావళికి ఈ రూపంలో వేధింపులు తారస్థాయికి చేరేవని, ఈ ఏడాది కూడా అదే డిమాండ్ తో ఆమెను మానసికంగా కుంగదీశారని ఆరోపించారు. ఆదివారం రోజున పాయల్ కు, ఆమె అత్తగారికి మధ్య తీవ్ర వాగ్వాదం, గొడవ జరిగిందని, ఆ తర్వాతే ఈ అనూహ్య పరిణామం చోటుచేసుకుందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. సోమవారం ఉదయం పాయల్ కనిపించడం లేదని చెప్పి, ఆమె భర్త కుటుంబ సభ్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పలు సందేహాలకు తావిచ్చింది.

బంధువులు వచ్చి గాలించగా, సమీపంలోని మరో ఫ్లాట్లో పాయల్ మృతదేహం బయటపడింది. ఆ గది తలుపులు లోపల నుంచి లాక్ చేసి ఉండటంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. బలవంతంగా వెనుక బాల్కనీ ద్వారా లోపలికి వెళ్లి చూడగా, పాయల్ మృతదేహం ఉరికి వేలాడుతూ కనిపించింది. ఇది ముమ్మాటికీ హత్యేనని, ఆమె భర్త, అత్తమామలే పథకం ప్రకారమే హత్య చేసి ఉరితీశారని పాయల్ మామ, సోదరుడు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పాయల్ భర్తను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు. ప్రతి ఏటా పండగ పేరుతో నూతనంగా డిమాండ్లు చేస్తూ ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్న ఈ ఘటనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
[ Pune techie death, dowry harassment, Payal Zambre Patil, 10 tolas gold demand, husband arrested, Pune crime news, Telugu One, Telugu News ]


