పులివెందులలో రియల్ హీరో కోయ ప్రవీణ్: వైసీపీ ఎన్నికల అక్రమాలకు చెక్.!
Published on: Tue Nov 3, 2026 10:17AM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత సున్నితమైన అలాగే అత్యంత సమస్యాత్మక నియోజకవర్గం అయిన పులివెందులలో ప్రస్తుతం అనూహ్య వాతావరణం నెలకొంది. దశాబ్దాలుగా ఒకే కుటుంబానికి కంచుకోటగా ఉంటూ ఏకపక్ష రాజకీయాలకు నిలయంగా మారిన పులివెందులలో తాజా మునిసిపల్ ఎన్నికల సందర్భంగా పూర్తి భిన్నమైన వాతావరణం కనిపించింది. రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు మారుతున్న తరుణంలో, పులివెందులలో తన పట్టును నిలుపుకోవడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా రంగంలోకి సర్వశక్తులూ ఒడ్డారు.అయినా ఆయన హవా నడవని పరిస్థితి పులివెందులలో ప్రస్ఫుటంగా కనిపించింది. ఈ ఎన్నికల వేళ అధికార యంత్రాంగం, ముఖ్యంగా పోలీసు శాఖ పటిష్ఠంగా వ్యవహరించి, ఏకస్వామ్య రాజకీయాలకు ఇక చెల్లుచీటీయేనని నిరూపించింది.
పోలీసు శాఖ ఇంత నిర్భయంగా, స్వేచ్ఛగా, ఎలాంటి ఒత్తిడులకు తలొగ్గకుండా పని చేయడం వెనుక ఉన్నది కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్. దీంతో ఇప్పుడాయన పేరు రాజకీయవర్గాలలోనే కాకుండా జనబాహుల్యంలో కూడా మార్మోగిపోతోంది. నిజాయితీకి నిలువెత్తు నిదర్శనంగా, నిబంధనలను తు.చ. తప్పకుండా అమలు చేసే అధికారిగా ఆయనపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
పులివెందులలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కఠినంగా అమలు చేయడంలో కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ నిక్కచ్చిగా వ్యవహరించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇటు అధికార తెలుగుదేశం కూటమి నేతలకూ, అదే సమయంలో అటు వైసీపీ శ్రేణులూ, నేతలకూ కళ్లె వేస్తూ.. ఎటువంటి ఒత్తిళ్లకూ తలొగ్గకండా పకడ్బందీగా, అదే సమయంలో నిష్పాక్షికంగా వ్యవహరించారు. దీంతో వైసీపీ నాయకులకు గతంలోలా ఎన్నికలను తమ అధీనంలోకి తీసుకుని ఏకపక్షంగా నిర్వహించుకునే అవకాశం ఇసుమంతైనా లేకుండా పోయింది.
వైసీపీ హయాం ముగిసి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కఠిన నిర్ణయాలకు పేరుగాంచిన కోయ ప్రవీణ్‌ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించారు. అప్పటి నుంచి ఆయన తనదైన శైలిలో శాంతిభద్రతల పరిరక్షణకు పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలుగా ముద్రపడిన ఉమ్మడి కడప జిల్లా పరిధిలో పోలీసు శాఖను పూర్తి అప్రమత్తం చేసి, ఎక్కడా నిబంధనల ఉల్లంఘనకు తావులేకుండా చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే పులివెందులలో పోలింగ్ సందర్భంగా తలెత్తిన ఉద్రిక్తతలు, రాళ్లదాడి ఘటనలు, రాజకీయ నిరసనల నేపథ్యంలో పోలీసు యంత్రాంగం వ్యవహరించిన తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్ స్వయంగా రంగంలోకి దిగి భారీ పోలీసు బలగాలతో మార్చ్ నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా శాంతిభద్రతలను అదుపులో ఉంచడంలో ఆయన వ్యవహరించిన తీరు ప్రశంసలందుకుంటోంది.

రాళ్లు రువ్వే ఘటనలు, రాజకీయ నాయకుల దూకుడు ప్రదర్శనల మధ్య, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి పులివెందులకు రావడంతో, స్థానికంగా ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే పరిస్థితి అదుపుతప్పకుండా కోయ ప్రవీణ్ పకడ్బందీ చర్యలు తీసుకున్నారు. ఓటు హక్కును గౌరవిస్తూనే, ఓటింగ్ తర్వాత గుంపులుగా చేరడం, అనుమతి లేని సమావేశాలు నిర్వహించడం, శాంతికి భంగం కలిగించే చర్యలను ఆయన అడ్డుకున్నారు. జగన్ మోహన్ రెడ్డి తన ఓటు వేసిన తర్వాత నేరుగా ఇంటికి వెళ్లాలని, ఎటువంటి ర్యాలీలు, రాజకీయ ప్రదర్శనలు చేయకూడదని కుండబద్దలు కొట్టినట్లుగా ఆదేశించారు. అంతే కాకుండా పులివెందుల వీధులలో పోలీస్ మార్చ్ నిర్వహించారు.
కోయ ప్రవీణ్ కు గతంలోనే సిన్సియర్ ఐపీఎస్ గా పేరు ఉంది. ఈయన గతంలో అంటు చంద్రబాబు హయాంలో విశాఖపట్నం జిల్లా ఎస్పీగా, విజయవాడ నగరంలో లా అండ్ ఆర్డర్ డీసీపీగా, ప్రకాశం జిల్లా ఎస్పీగా కీలక బాధ్యతలు నిర్వహించారు. విధినిర్వహణలో నిక్కచ్చిగా, ముక్కుసూటిగా, నిర్భయంగా వ్యవహరించే కోయ ప్రవీణ్ అంటే జగన్ కు, వైసీపీకి తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆయన చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం ఆ వ్యతిరేకతను అజ్యం పోసింది.
2019 ఎన్నికలకు ముందు, కోయ ప్రవీణ్ టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని వైసీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఐటీ గ్రిడ్' వివాదానికి సంబంధించిన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఆరోపణలు వచ్చాయి. దీనితో ఎన్నికల సంఘం కోయ ప్రవీణ్‌ను ఎన్నికల విధుల్లోంచి తప్పించింది. అప్పట్లో ప్రవీణ్ బదిలీని చంద్రబాబు నాయుడు వ్యతిరేకిస్తూ, ఎన్నికల సంఘం వివక్ష చూపుతోందని ఆరోపించారు. అదలా ఉంటే.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ ఆయనను పూర్తిగా పక్కన పెట్టేశారు. రైల్వేలు, పోలీస్ రవాణా విభాగం, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ వంటి విభాగాలకు అంటే అప్రాధాన్యత ఉన్న పోస్టులలో నియమించారు. మళ్లీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కోయ ప్రవీణ్ ను కర్నూలు రేంజ్ డీఐజీగా నియమించారు. ఇప్పుడు ఆయన వైసీపీకి సింహస్వప్నంగా మారారు. పులివెందులలో వైసీపీకి, జగన్ కు అలవాటైన ఏకపక్ష ఎన్నికల విధానాన్ని అడ్డుకున్నారు.
[Pulivendula Real Hero Kurnool Range DIG Koya Praveen, Jagan Pulivendula Visit, Municipal election, Ap Politics, Telugu One]


