TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పదిరోజులు కష్టపడితే చాలు..పులివెందుల మనదే: బీటెక్‌ రవి

Published on: Thu Oct 15, 2026 8:50AM

పులివెందుల మనదే నని, పదిరోజులు కష్టపడితే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటామని,ఇదే  లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి బీటెక్‌ రవి పిలుపునిచ్చారు. మరో పది రోజులు కష్టపడి పనిచేస్తే విజయం టీడీపీనే వరిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని సూచించారు.పులివెందులలో ఎన్నికల ప్రచారానికి వైసీపీ బౌన్సర్లను నియమించు కోవడంపై బీటెక్‌ రవి తీవ్ర విమర్శలు చేశారు. ప్రచారానికి బౌన్సర్లను పెట్టుకునే స్థాయికి వైసీపీ దిగజారిందని వ్యాఖ్యానించారు. 

ప్రజల్లో ఆదరణ ఉన్న పార్టీకి ప్రచార సమయంలో బౌన్సర్ల అవసరం ఏమిటని ప్రశ్నించారు. బౌన్సర్లను నియమించుకోవడం చూస్తుంటే వైసీపీ పరిస్థితి అర్థమవుతోందని, ఆ పార్టీ ఇప్పటికే సగం ఓటమి పాలైనట్లేనని విమర్శించా రు.దశాబ్దాలుగా పులివెందులలో అధికారం అనుభవించిన వైఎస్‌ కుటుంబం పట్టణానికి చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు వివరించాలని ఆయన ప్రశ్నించారు. 1978 నుంచి వివిధ పదవుల్లో కొనసాగినప్పటికీ పట్టణాన్ని ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. ఇప్పుడు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరడం సరికాదన్నారు. గత ఐదేళ్లలో మున్సిపాలిటీలో అభివృద్ధి పనుల పేరుతో ఏడు శాతం కమిషన్లు తీసుకుంటూ నాణ్యత లేని పనులు చేపట్టారని ఆరోపించారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వార్డుల వారీగా నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని బీటెక్‌ రవి సూచించారు. ప్రతి వార్డులో పోటీ చేయాలనుకునే ఆశావహుల పేర్లను పరిశీలించి, అందరి మధ్య ఏకాభిప్రాయం సాధించి ఒక్కరి పేరును ప్రతిపాదించాలని తెలిపారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలిచి, ప్రాణాలకు తెగించి పోలింగ్‌ ఏజెంట్లుగా పనిచేసిన వారికి అభ్యర్థుల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉంటే పార్టీ పెద్దలతో చర్చించి పరిష్కరిస్తామని చెప్పారు.

మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజల అవసరాలకు పెద్దపీట వేస్తామని బీటెక్‌ రవి వెల్లడించారు. ప్రతి వార్డులో ప్రత్యేక బాక్సులు ఏర్పాటు చేసి, ఆయా ప్రాంతాలకు అవసరమైన అభివృద్ధి పనులను ప్రజలే స్లిప్పుల ద్వారా తెలియజేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల నుంచి వచ్చిన సూచనల ఆధారంగా ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్‌ ఎన్నికల్లో సాధించే విజయం రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్‌ ఎన్నికల్లోనూ పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని అన్నారు. అభ్యర్థుల ప్రకటన అనంతరం నాయకులు, కార్యకర్తలను ప్రత్యేక బృందాలుగా విభజించి ప్రతి వార్డులో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. ప్రతి ఇంటికీ వెళ్లి పార్టీ విధానాలు, ప్రజలకు అందించనున్న అభివృద్ధి ప్రణాళికలను వివరించాలని పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో పనిచేస్తే పులివెందుల మున్సిపాలిటీని టీడీపీ కైవసం చేసుకోవడం ఖాయమని బీటెక్‌ రవి ఆశాభావం వ్యక్తం చేశారు.

 

 

 

[ Pulivendula Municipality Elections, BTech Ravi, TDP, Telugu Desam Party, YSRCP, Pulivendula Politics, Andhra Pradesh Politics, Municipal Elections, TDP Campaign, BTech Ravi Comments, YS Family, Election Campaign, Ward Candidates, TDP Cadre, Pulivendula Development, TDP vs YSRCP, Local Body Elections, MPTC Elections, ZPTC Elections, Sarpanch Elections ]