TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జగన్ లో భయం?.. పులివెందుల జారిపోతోందా?

Published on: Wed Sep 2, 2026 11:43AM

ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో ఇప్పుడు జగన్ కు పులివెందుల భయం పట్టుకుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. 2024 ఎన్నికలలో పార్టీ  ఓటమి జగన్ రాష్ట్రంలో పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటను చేస్తారని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా ఆయన పులివెందులపైనే ఎక్కువగా కాన్సట్రేట్ చేయడంతో ఆయనకు పులివెందులలో పట్టు జారుతోందన్న భయం పట్టుకున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. అలాంటి భయమే లేకపోతే..  మాజీ సీఎంగా రాష్ట్రం మొత్తం తిరగాల్సిన ఆయన అది మానేసి  సొంత నియోజకవర్గానికే  ఎక్కువగా పరిమితం అవ్వరని అంటున్నారు.  

నిజమే.. జగన్  ఇటీవలి కాలంలో క్రమం తప్పకుండా పులివెందులలో పర్యటిస్తున్నారు.  ఈ పర్యటనలు ఆయనలో భయాన్ని సూచిస్తున్నాయంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. గతంలో అంటే జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన పులివెందుల పర్యటనలు చాలా చాలా అరుదుగానే చేపట్టే వారు. తన తండ్రి వైఎస్ జయంతి, వర్ధంతి సందర్భాలు కాకుండా ఆయన పులివెందులలో అడుగుపెట్టడం అనేది చాలా అరుదుగా జరిగేది. కానీ 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం, పులివెందులలో తన మెజారిటీ గణనీయంగా తగ్గడంతో ఆయన పులివెందుల పర్యటనలు పెరిగాయి.

అన్నిటికీ మించి పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలో వైసీపీకి డిపాజిట్ కూడా దక్కకుండా ఘోరంగా ఓడిపోయిన తరువాత ఆయనలో పులివెందులపై పట్టు జారిపోతోందన్న భయం మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. దీంతో అప్పటి నుంచి సమయం, సందర్భంతో సంబంధం లేకుండా క్రమం తప్పకుండా పులివెందుల వెడుతున్నారు.  అక్కడ  తన నివాసంలో రెండు మూడు రోజుల ఉంటున్నారు.  స్థానిక నాయకులు, కార్యకర్తలతో సమావేశమౌతున్నారు.  ప్రజా దర్బార్ తరహాలో వినతులు స్వీకరిస్తున్నారు.  

నియోజకవర్గంలో తన పట్టు సడలకుండా ఉండటానికే ఆయన ఇటీవలి కాలంలో తరచూ పులివెందులలో పర్యటిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  2024 ఎన్నికలలో పులివెందుల నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో  వ్యతిరేకత కనిపించడంతో పాటు, పార్టీ క్యాడర్ లో కూడా ఉత్సాహం తగ్గి పెద్దగా పార్టీ కార్యక్రమాలు చేపట్టకపోవడంతో జగన్ ముందుజాగ్రత్త పడుతున్నారని అంటున్నారు.  

[Pulivendula Fear in Jagan, Jagans Pulivendula visits, YCP Politics, Ap Politics, Telugu One]