TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పులివెందులలో తెలుగుదేశం, జనసేన డిష్యూండిష్యూం: పంచాయతీ నామినేషన్ల వేళ చిచ్చు.!

Published on: Tue Nov 24, 2026 11:56AM

పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లిలో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల  సందర్భంగా చోటుచేసుకున్న పరిణామాలు కూటమి విభేదాలపై సరికొత్త చర్చకు దారి తీశాయి.   నామినేషన్ల ప్రక్రియ వేళ తలెత్తిన వివాదం, ఉద్రిక్తతల మధ్య జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుతో కుప్పకూలి మరణించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైసీపీకీ, ఆ పార్టీ అధినేత జగన్ కు పెట్టని కోట వంటి పులివెందులలో  కూటమి పార్టీలు ఐక్యంగా ఉండాల్సిన చోట.. తెలుగుదేశం, జనసేన మధ్య వివాదం తలెత్తడం విస్మయపరిచింది.  రామాంజులు మృతితో  జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేయగా, పరిస్థితిని సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమగ్ర విచారణకు ఆదేశించారు.

వివరాల్లోకి వెళితే..  నాగులగుట్టపల్లిలో జనసేన మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యక్తి నామినేషన్ విషయంలో వివాదం మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్తత ఏర్పడింది. ఆ సమయంలోనే జనసేన కార్యకర్త ముంతల రామాంజులు గుండెపోటుకు గురై మృతి చెందారు. ఈ మరణంతో జనసేన నాయకులు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. 

ఈ ఘటనపై భిన్నమైన స్పందనలు, వివరణలు తెరపైకి వచ్చాయి. కార్యకర్త మృతి వెనుక రాజకీయ ఘర్షణ ఉందని జనసేన నేతలు ఆరోపణలు చేయగా, మృతుడి కుమారుడు మాత్రం తన తండ్రి మరణానికి రాజకీయ పార్టీలు, ఘర్షణలతో ఎటువంటి సంబంధం లేదని, గుండెపోటుతోనే మరణించారని స్పష్టం చేశారు.  అలాగే  పులివెందుల తెలుగుదేశం ఇంచార్జ్ బీటెక్ రవి కూడా ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన మృతుడి నివాసానికి వెళ్లి నివాళులు అర్పించడంతో పాటు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాలను నమ్మవద్దని కోరారు.

ఇదే క్రమంలో మరో వివాదం కూడా చర్చకు వచ్చింది. జనసేన జిల్లా అధ్యక్షుడు సుంకర శ్రీనివాస్, డీఎస్పీ మురళీ నాయక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం వెలువడింది. తమ కార్యకర్త మృతిపై న్యాయం కోరుతున్న సమయంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై జనసేన నేతలు అసహనం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన  కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలను సమగ్ర విచారణ జరపాలని ఆదేశించారు. మృతుడి కుటుంబ సభ్యుల వాంగ్మూలం తీసుకోవాలని, బాధ్యులుగా తేలిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. విచారణ ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యతను మంత్రి నాదెండ్ల మనోహర్‌కు అప్పగించడంతో పాటు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక ఎన్నికల వేళ కూటమి పార్టీల కార్యకర్తల మధ్య తలెత్తిన ఘర్షణ వాతావరణం, అనంతర పరిణామాలు క్షేత్రస్థాయి సమన్వయంపై చర్చకు దారితీశాయి.

ఇది కూడా చదవండి:  స్థానిక సమరం: కూటమి పార్టీల సీట్ల సర్దుపాట్లు.. దేశం, జనసేన శ్రేణుల్లో భగ్గుమన్నఆగ్రహం.!​

పులివెందుల నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించిన చర్చలు కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. కూటమిలో ఉన్న టీడీపీ, జనసేన మధ్య స్థానిక స్థాయిలో ఏర్పడిన ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారనే అంశంపై అందరి దృష్టి నిలిచింది.  

రానున్న రోజుల్లో విచారణ నివేదిక ఆధారంగా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యవేక్షణలో విచారణ ప్రక్రియ ఎలా సాగుతుందనే దానిపై ఆసక్తి నెలకొంది. మొత్తంగా చూస్తే, నాగులగుట్టపల్లి నామినేషన్ల వివాదంలో జనసేన కార్యకర్త మృతి ఘటన పులివెందుల రాజకీయాలను వేడెక్కించింది. 

మీకు నచ్చవచ్చు:  పిఠాపురం తెలుగుదేశం ఇన్చార్జ్‌గా వర్మ తొలగింపు​

టీడీపీ, జనసేన మధ్య పెరుగుతున్న దూరం.. ఏపీ కూటమిలో ఏం జరుగుతోంది..?

[Pulivendula, Nagulaguttapalli,  panchayatelections, TDP, Janasena, Differences, Pawan Kalyan  inquiry, B.Tech Ravi, TeluguOne]