వచ్చే ఆదివారం బ్యాంకులకు వర్కింగ్ డే: ఎందుకంటే.?
Published on: Wed Sep 23, 2026 3:09PM

దేశంలోని బ్యాంకింగ్ రంగ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఒకింత ఊరట కలిగే కబురు చెప్పింది. ఈ నెలలో బ్యాంకులు మూడు రోజుల సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో..బ్యాంకులు వచ్చే ఆదివారం (సెప్టెంబర్ 27)న పని చేస్తాయని ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన సమ్మెల కారణంగా సేవలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగానే సాధారణంగా సెలవు దినమైన ఆదివారం కూడా ప్రభుత్వ రంగ బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించింది. యూనైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకు యూనియన్స్ (యూఎఫ్‌బీయూ) పిలుపు మేరకు ఈ నెల చివరి వారంలో మూడు రోజుల పాటు బ్యాంక్ ఉద్యోగులు దేశవ్యాప్తంగా సమ్మెకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 28 నుండి 30వ తేదీ వరకు వరుసగా మూడు రోజుల పాటు సేవలు పూర్తిగా నిలిచిపోనున్నాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఖాతాదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదనే ఉద్దేశంతో ఆదివారం (సెప్టెంబర్ 27)న బ్యాంకులకు వర్కింగ్ డేగా ప్రకటించినట్లుకేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. ఈ నెల 26వ తేదీ నాల్గవ శనివారం కావడంతో బ్యాంకులకు సాధారణ సెలవు వస్తుంది. ఆ మరుసటి రోజు సెప్టెంబర్ 27 ఆదివారం కూడా సాధారణంగా సెలవు దినమే. అయితే.. ఆ వెంటనే సోమవారం నుండి మూడు రోజుల పాటు బ్యాంకులు సమ్మెకు పిలుపునివ్వడంతో వరుసగా ఐదు రోజుల పాటు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండని పరిస్థితి ఏర్పడింది.

దీనివల్ల ప్రజలు, వ్యాపారవేత్తలు అత్యవసర ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ పరిస్థితిని నివారించడానికి వీలుగా సెప్టెంబర్ 27న వచ్చే ఆదివారం నాడు దేశంలోని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు యథావిధిగా తెరుచుకుని పనిచేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.
[Public Sector Banks Sunday Workingday, Bank strike September, UFBU Strike, Banking services, Telugu One]


