బ్యాంకింగ్ షేర్లలో భారీ ర్యాలీ: ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుక్ చేయాలా, హోల్డ్ చేయాలా?
Published on: Sat Aug 22, 2026 10:17AM

భారతీయ స్టాక్ మార్కెట్‌లో ఇటీవల ప్రైవేట్ బ్యాంకింగ్ షేర్లు సరికొత్త ఉత్సాహంతో దూసుకుపోతున్నాయి. గత కొంతకాలంగా ఇతర రంగాలతో పోలిస్తే అంతగా రాణించని ప్రైవేట్ బ్యాంకులు, ఇప్పుడు మళ్లీ ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆగస్టు నెలలోనే కర్ణాటక బ్యాంక్ షేరు ఏకంగా 15 శాతానికి పైగా పెరిగి ఇన్వెస్టర్లను ఆశ్చర్యపరిచింది. అలాగే డిసిబి బ్యాంక్, ఏయు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ వంటి దిగ్గజ బ్యాంకుల షేర్లు కూడా 1 శాతం నుండి 9 శాతం వరకు లాభాలను నమోదు చేశాయి. అయితే, మరోవైపు మార్కెట్ హెవీవేట్లు అయిన ఐసిఐసిఐ బ్యాంక్ షేరు 1 శాతం, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేరు 3 శాతం మేర ప్రాఫిట్ బుకింగ్ వల్ల స్వల్పంగా తగ్గుముఖం పట్టడం గమనార్హం.
ఈ బలమైన కొనుగోళ్ల వెనుక ప్రధానంగా మొదటి త్రైమాసికపు (Q1FY27) మెరుగైన ఫలితాలు కీలక పాత్ర పోషించాయి. బ్యాంకుల ఆస్తుల నాణ్యత గణనీయంగా మెరుగుపడటంతో పాటు నిష్క్రియాత్మక ఆస్తులు (NPAs) బహుళ సంవత్సరాల కనిష్ట స్థాయికి చేరుకోవడం మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని సృష్టించింది. దీనికి తోడు విదేశీ ఇన్వెస్టర్ల (FPIs) రీ-ఎంట్రీ, ఆర్‌బిఐ వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం కూడా బ్యాంకులకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. ప్రస్తుతం భారతదేశంలో క్రెడిట్ గ్రోత్ ఏటా 12 శాతం నుండి 14 శాతం వరకు నమోదవుతోంది. బలమైన లెండింగ్ విధానాలు, అత్యాధునిక టెక్నాలజీ, మరియు విస్తృతమైన రిటైల్ లోన్ బుక్ ఉండటం వల్ల పబ్లిక్ సెక్టార్ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకులు ఈ వృద్ధి నుంచి ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశాలు ఉన్నాయి.
సాంకేతికంగా చూస్తే, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 'కప్ అండ్ హ్యాండిల్' (Cup and Handle) ఫార్మేషన్ నుండి బ్రేకౌట్ ఇస్తోంది. ఇది కేవలం స్వల్పకాలిక ట్రేడింగ్ ర్యాలీ కాదని, ఇన్సిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక వ్యూహంతో భాగస్వామ్యం అవుతున్నారని స్పష్టం చేస్తోంది. యాక్సిస్ బ్యాంక్ తన నికర వడ్డీ మార్జిన్ (NIM) 3.46 శాతాన్ని సైకిల్ బాటమ్‌గా ప్రకటించడం, బాండ్ ఈల్డ్స్ తగ్గడం ద్వారా లభించిన ట్రెజరీ లాభాలు బ్యాంకింగ్ ఆదాయాలకు అదనపు రక్షణను ఇస్తున్నాయి. డిపాజిట్ ధరలతో పోలిస్తే రుణాల పునర్నిర్మాణం వేగంగా జరుగుతుండటంతో రాబోయే ఒకటి రెండు త్రైమాసికాల్లో మార్జిన్లపై కొంత ఒత్తిడి ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయినప్పటికీ, బ్యాంకింగ్ ఆస్తుల నాణ్యత బలంగా ఉండటం వల్ల స్టాక్ ధరలు తీవ్రంగా పడిపోయే ప్రమాదం చాలా తక్కువ.
hdfc axis icici bank shares investment guide,private bank stocks rally stock market news


