TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

హ్యాపీ బర్త్ డే మోడీ.!

Published on: Thu Sep 17, 2026 8:56AM

దేశ రాజకీయాలలో చెరగని ముద్ర వేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం ( సెప్టెంర్ 17) 76వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఆయన జన్మదినం సందర్భంగా   రాజకీయ ప్రముఖులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు   శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. గుజరాత్ లోని వాద్‌నగర్‌లో రైల్వే స్టేషన్ పక్కన చిన్న టీ అమ్ముకునే కుటుంబంలో పుట్టిన ఒక సామాన్యుడు, దేశ అత్యున్నత పీఠమైన ఢిల్లీలోని లోక్ కల్యాణ్ మార్గ్ చేరేవరకు సాగిన ఆయన ప్రయాణం స్ఫూర్తిదాయకం.
మోదీ రాజకీయ ప్రస్థానం   ఒక వ్యక్తి విజయగాథ మాత్రమే కాదు. అంకితభావం, కఠిన శ్రమ ఉంటే అతి సామాన్యుడు కూడా ఉన్నత స్థానానికి ఎదగవచ్చనడానికి నిదర్శనం.   ఆరెస్సెస్ సిద్ధాంతాలకు ఆకర్షితుడై  పూర్తికాల కార్యకర్తగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ.. క్రమశిక్షణతో కూడిన సంస్థాగత పనుల ద్వారా తన నాయకత్వ లక్షణాలను మెరుగుపరుచుకున్నారు. అహ్మదాబాద్ కేంద్రంగా గుజరాత్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన..   బీజేపీ  సంస్థాగత బలోపేతంలో కీలక పాత్ర పోషించారు. పార్టీలో వివిధ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన ప్రతిభను గుర్తించిన బీజేపీ హైకమాండ్,  2001 అక్టోబర్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి బాధ్యతలను అప్పగించింది.

గుజరాత్ ముఖ్యమంత్రిగా   పన్నెండు సంవత్సరాలకు పైగా  సేవలందించిన ఆయన..   తన  పాలనా దక్షతతో రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపారు. పారిశ్రామికాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, విద్యుత్ సరఫరా,  పెట్టుబడుల ఆకర్షణలో గుజరాత్ మోడల్‌ను దేశానికి పరిచయం చేసి   ప్రశంసలు అందుకున్నారు. ఆ తర్వాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా జాతీయ రాజకీయాలలోకి రంగప్రవేశం చేశారు. ప్రజల నుంచి లభించిన ఆదరణ ఆయనను భారీ మెజారిటీతో గెలిపించింది.  2014 మే 26న తొలిసారిగా దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించి రెండోసారి పగ్గాలు చేపట్టారు. ప్రజల నిరంతర ఆదరాభిమానాలతో 2024 జూన్‌లో మూడోసారి కూడా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి  రికార్డు సృష్టించారు.

ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి విప్లవాత్మక పథకాల ద్వారా దేశాన్ని స్వావలంబన దిశగా నడిపించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా పలు పథకాలను అమల్లోకి తెస్తూ, అంతర్జాతీయ వేదికలపై భారతదేశ కీర్తి ప్రతిష్టలను కొత్త శిఖరాలకు చేర్చారు. ఒకవైపు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేస్తూనే, మరోవైపు దేశ రక్షణ, విదేశీ విధానాల్లో  భారత్ ను అగ్రపీఠిన నిలబెట్టడం ద్వారా  గ్లోబల్ లీడర్‌గా గుర్తింపు పొందారు. ప్రధాని మోదీ నాయకత్వ శైలి,  నిరంతరం దేశం కోసం పరితపించే తత్వం కోట్లాది మంది యువతకు  ఆదర్శంగా నిలుస్తున్నాయి.

మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని  బీజేపీ  దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపట్టింది. పార్టీ జాతీయ నాయకత్వం పిలుపు మేరకు రాబోయే నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా  సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సమాజంలోని వివిధ వర్గాల ప్రజలకు సేవ చేయడం, ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం వంటి   కార్యక్రమాలను చేపట్టనున్నారు. అలాగే వారణాసి సహా పలు ప్రధాన నగరాల్లో   రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలను   నిర్వహిస్తున్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖులు ఈ వేడుకల్లో  పాల్గొని ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.

దేశ రాజకీయాల్లో సుదీర్ఘమైన పరిపాలనా అనుభవం కలిగిన అతికొద్ది మంది నాయకులలో మోదీ ఒకరిగా నిలిచారు. ముఖ్యమంత్రిగా పాతికేళ్ల కిందట  ప్రారంభమైన ఆయన పాలనా ప్రస్థానం.. నిరాఘాటంగా కొనసాగుతోంది.  వికసిత భారత్' లక్ష్య సాధన దిశగా దేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆయన ప్రయాణం రాబోయే తరాలకు రాజకీయ, సామాజిక పాఠంగా నిలుస్తుందనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. 

[Prime Minister Narendra Modi birthday, PM Modi 76th birthday journey, RSS Pracharak to Prime Minister, BJP Seva Sankalp Abhiyan, Narendra Modi political career highlights]