TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నించే మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవి.

Published on: Wed Oct 28, 2026 12:19PM

గర్భం దాల్చాలని ప్రయత్నించే మహిళల శరీరంలో అనేక మార్పులు జరుగుతుంటాయి. కేవలం ఆహారం తీసుకోవడం, డాక్టర్ చెప్పిన విటమిన్లు వేసుకోవడం మాత్రమే కాకుండా, రోజువారీ జీవితంలో కొన్ని చిన్న చిన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం వల్ల గర్భధారణ అవకాశాలు మెరుగవుతాయి. గర్బం దాల్చాలని అనుకునే  చాలా మంది మహిళలకు తెలియని కొన్ని ముఖ్యమైన , లోతైన విషయాలను వివరంగా  తెలుసుకుంటే..

సర్కాడియన్ రిథమ్  బాలెన్స్..

శరీరంలో సర్కాడియన్ రిథమ్ ను అంతర్గత గడియారం అని అంటారు. ఇది బాలెన్స్డ్ గా ఉండటం  చాలా ముఖ్యం. రాత్రి వేళల్లో ఆలస్యంగా పడుకోవడం లేదా షిఫ్ట్ డ్యూటీల వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. ముఖ్యంగా ప్రొలాక్టిన్ , మెలటోనిన్ హార్మోన్లు అండం విడుదల కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు రాత్రి పూట కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల గాఢమైన నిద్ర ఉండేలా చూసుకోవాలి. పడుకునే గదిలో లైట్లు పూర్తిగా ఆరిపోయేలా లేదా డిమ్ గా ఉంచుకోవడం వల్ల హార్మోన్ల ఉత్పత్తి మెరుగ్గా ఉంటుంది.

ప్లాస్టిక్ కు దూరం..

 రోజూ వాడే ప్లాస్టిక్ డబ్బాలు, వాటర్ బాటిల్స్, నాన్-స్టిక్ పాన్ల వాడకం వల్ల శరీరంలోకి ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అనే రసాయనాలు ప్రవేశిస్తాయి. ఇవి హార్మోన్ల వ్యవస్థను దెబ్బతీసి అండం నాణ్యతను తగ్గిస్తాయి. దీనికి బదులుగా గాజు లేదా స్టెయిన్ లెస్ స్టీల్ పాత్రలను వాడడం చాలా మంచిది. ప్లాస్టిక్ డబ్బాలలో వేడి వేడి ఆహారాన్ని నిల్వ చేయడం పూర్తిగా మానేయాలి.

ప్యాక్డ్, జంక్ ఫుడ్..

శరీరంలో ఉండే ఇన్ఫ్లమేషన్ లేదా అంతర్గత మంట కూడా సంతానోత్పత్తిని అడ్డుకుంటుంది. ప్యాకెట్లలో లభించే జంక్ ఫుడ్, మైదా ఉత్పత్తులు, పంచదార ఎక్కువగా ఉండే పదార్థాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ ను పెంచుతాయి. దీనికి బదులుగా యాంటీ ఆక్సిడెంటల్ గుణాలు ఎక్కువగా ఉండే నల్ల ద్రాక్ష, దానిమ్మ, బ్లూ బెర్రీస్, గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి అండం నాణ్యతను పెంచడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి.

కార్టిసాల్ హార్మోన్..

మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు శరీరంలో కార్టిసాల్ హార్మోన్ విడుదలవుతుంది. ఇది ప్రెగ్నెన్సీకి సహకరించే ఇతర హార్మోన్లను అణచివేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి కేవలం యోగా ఒక్కటే కాకుండా, ప్రకృతితో గడపడం, సూర్యరశ్మిలో కాసేపు నడవడం వంటివి చేయాలి. ఉదయం పూట ఎండలో పదిహేను నిమిషాలు గడపడం వల్ల శరీరానికి కావలసిన విటమిన్ డి అందుతుంది, ఇది హార్మోన్ల సమతుల్యతకు ఎంతో అవసరం.

పెల్విక్ ఆరోగ్యం..

పెల్విక్ ఫ్లోర్ కండరాల ఆరోగ్యం  గురించి చాలా మంది పట్టించుకోరు. గర్భాశయానికి రక్త సరఫరా సక్రమంగా జరగాలంటే ఈ కండరాలు ఆరోగ్యంగా ఉండాలి. రోజూ తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం వల్ల పొత్తికడుపు భాగానికి రక్త ప్రసరణ పెరుగుతుంది.

కాఫీ, టీ..

కాఫీ, టీల వాడకాన్ని కొద్దిగా తగ్గించడం మంచిది. రోజుకు రెండు కప్పుల కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల అండం విడుదలయ్యే వేగం మందగించే అవకాశం ఉంది.

ఈ చిన్న చిన్న జాగ్రత్తలను పాటిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచుకుంటే గర్భధారణ మార్గం చాలా సులభం అవుతుంది. ప్రతి మహిళ శరీరం భిన్నంగా ఉంటుంది కాబట్టి,  ఆరోగ్య పరిస్థితికి తగినట్లుగా నిపుణుల సలహా తీసుకోవడం కూడా ఎంతో మంచిది.
 
                                                                                                                    *రూపశ్రీ.