TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ప్రాంక్ మెసేజ్‌తో KPHBలో క్రికెట్‌ బెట్టింగ్‌ ముఠా గుట్టురట్టు..!

Published on: Sun Aug 23, 2026 10:59AM

 

ప్రియురాలికి కిడ్నాప్ మెసేజ్ పంపడంతో బట్టబయలైన వ్యవహారం..!

ప్రియురాలి స్పందన ఎలా ఉంటుందో చూడాలనుకున్న ఓ యువకుడి సరదా ప్రయత్నం చివరకు భారీ క్రికెట్‌ బెట్టింగ్‌ బాగోతాన్ని బయటపెట్టింది. ప్రియురాలికి పంపిన ఓ ప్రాంక్‌ మెసేజ్‌.. చివరకు పోలీసులను అతడి ఫ్లాట్‌ వరకు తీసుకెళ్లింది. అక్కడ నిర్వహించిన తనిఖీల్లో ఏకంగా రూ.30 లక్షల నగదు బయటపడటంతో అసలు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని KPHBలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఏపీకి చెందిన ఓ యువకుడు హైదరాబాద్ నగరంలోకి వచ్చి కేపీహెచ్‌బీ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. అయితే ఆ యువకుడు ఒక యువతిని ప్రేమిస్తున్నాడు. దీంతో ఆ యువకుడు తాను ప్రేమించిన యువతి తనకు ఏదైనా జరిగితే ఎలా స్పందిస్తుందో తెలుసుకోవాలని భావించాడు. ఈ క్రమంలో తనను ఎవరో కిడ్నాప్‌ చేసినట్లు ప్రియురాలికి ప్రాంక్‌ మెసేజ్‌ పంపాడు. అయితే ఆ మెసేజ్‌ను నిజమని నమ్మిన యువతి తీవ్ర ఆందోళనకు గురైంది.

ఏం జరిగిందో అర్థంకాక వెంటనే 112కు ఫోన్‌ చేసి పోలీసులకు సమాచారం అందించింది. యువకుడు కిడ్నాప్‌ అయ్యాడని భావించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై, యువతి అందించిన వివరాల ఆధారంగా అతడి ఫ్లాట్‌కు చేరుకున్నారు. ఫ్లాట్‌లోకి వెళ్లిన పోలీసులు అనుమానాస్పదంగా కనిపించిన ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా నగదు కనిపించడంతో పోలీసులకు నగదు కనిపించడంతో ఖంగుతిన్నారు. నగదును లెక్కించగా రూ.30 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. ఆ నగదు ఎక్కడి నుంచి వచ్చిందనే దానిపై పోలీసులు ఆరా తీయగా.. అసలు బెట్టింగ్‌ బాగోతం బయటపడింది పోలీసుల విచారణలో ఈ నగదు క్రికెట్‌ బెట్టింగ్‌కు సంబంధించిన సొమ్ముగా గుర్తించారు. 

దీంతో ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఏపీకి చెందిన సుమంత్‌, మనోజ్‌, గౌతమ్‌ అనే ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి నుంచి రూ.30 లక్షల నగదును స్వాధీనం చేసుకుని, బెట్టింగ్‌ కార్యకలాపాలపై దర్యాప్తు ప్రారంభించారు.ప్రియురాలిని భయపెట్టేందుకు చేసిన చిన్న ప్రాంక్‌.. ఊహించని విధంగా భారీ బెట్టింగ్‌ వ్యవహారాన్ని బయటపెట్టడంతో KPHBలో ఈ ఘటన ఆసక్తికరంగా మారింది. పట్టుబడిన నగదు వెనుక మరెవరైనా ఉన్నారా? బెట్టింగ్‌ నెట్‌వర్క్‌ ఎక్కడి వరకు విస్తరించింది? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Prank message, Cricket Betting on KPHB, Desineni Sumanth, KPHB Hyderabad, Cricket Betting,
Fake Kidnapping Prank, Hyderabad Police, CP Sajjanar