20 లక్షల పెట్టుబడితో 2.25 కోట్ల ఆదాయం: కాప్సికం సాగులో ప్రణీతా మామన్ సంచలనం.!
Published on: Mon Sep 28, 2026 11:14AM

కార్పొరేట్ ఉద్యోగాలలో తీవ్ర ఒత్తిడి, నిత్యం రిట్రెంచ్ మెంట్ భయంతో డిప్రెషన్ కు లోనై భారంగా బతుకులు ఈడుస్తున్న యువతకు.. ప్రణీతా మామన్ ఒక కొత్త మార్గాన్ని ఎంచుకుని ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎంబీఏ పూర్తి చేసిన ప్రణీతా మామన్ ఉద్యోగ మార్గాన్ని పక్కన పెట్టి, ఆధునిక వ్యవసాయ రంగాన్ని కెరీర్‌గా ఎంచుకున్నారు. ప్రస్తుతం ఈమె వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.
మహారాష్ట్రలోని పుణె జిల్లాకి చెందిన ప్రణితా వామన్.. టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి అగ్రిబిజినెస్ మేనేజ్‌మెంట్ పూర్తి చేశారు. ఆ తరువాత ఓ ప్రముఖ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థలో ఇంటర్న్‌షిప్ చేస్తున్న సమయంలో ఆమెకు ఆధునిక సాగు పద్ధతులపై లోతైన అవగాహన ఏర్పడి, ఆసక్తి కలిగింది. అంతే ఆమె ఉద్యోగ మార్గాన్ని వీడి సాగు బాట పట్టారు.

2020లో ఆమె ఒక ఎకరం విస్తీర్ణంలో పాలీహౌస్ ఏర్పాటు చేసి క్యాప్సికం సాగును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఆమె 20 లక్షల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఆరంభమైన ఆమె సాగు వ్యాపకం అంచలంచలుగా విస్తరించింది. వ్యవసాయంలో ఖర్చులను నియంత్రించడం, మార్కెట్ డిమాండ్‌ను అంచనా వేయడంలో ఆమెకు తన ఎంబీయే విద్య తోడ్పడింది.
దీంతో మొదటి పంటలోనే ఆమె భారీ విజయాన్ని అందుకున్నారు. కేవలం ఎకరంలోనే ఏకంగా 40 టన్నుల క్యాప్సికం దిగుబడిని సాధించి, ఒక్కసారే రూ.32 లక్షల టర్నోవర్ సాధించారు. ఈ విజయంతో మరింత ఉత్సాహంగా ప్రణీతా మామన్ తన వ్యవసాయ క్షేత్రాన్ని విస్తరించారు.
ప్రస్తుతం ఆమె పాతిక ఎకరాల విస్తీర్ణంలో పాలీహౌస్‌లు, షేడ్‌నెట్ల సహాయంతో వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఆధునిక సాంకేతికతను జోడించి పండిస్తున్న ఈ ఉత్పత్తుల ద్వారా ఆమె ఏటా సుమారు 4 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించారు. అన్ని ఖర్చులు పోను ఏడాదికి రాదాపు 2.25 కోట్ల నికర లాభం ఆర్జిస్తున్నారు.
తాను పండిస్తున్న నాణ్యమైన క్యాప్సికం ఉత్పత్తులను ఆమె మార్కెట్లతో పాటు నాసిక్, ముంబై, జైపూర్ వంటి ప్రముఖ నగరాల హోల్‌సేల్ వ్యాపారులకూ ఎగుమతి చేస్తున్నారు. సమర్థవంతమైన మార్కెటింగ్ వ్యూహాలు పాటిస్తూ వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెడుతున్నారు.
వ్యవసాయ రంగంలో మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు విజయం నల్లేరుమీద బండినడకేనని ప్రణితా వామన్ నిరూపిస్తున్నారు. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా, వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపారంగా, వ్యాపకంగా మలచుకోవచ్చని నిరూపిస్తున్నారు. భవిష్యత్తులో తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు.
[Praneeta Vaman Success Story, MBA Graduate Aagriculture, Polyhouse Farming Pune, Capsicum Cultivation Business Profit, Success Modern Agriculture]


