గో బ్యాక్ మోడీ: తమిళ నటుడు ప్రదీప్ రంగనాథ్ పాత ట్వీట్ వైరల్.!
Published on: Mon Oct 12, 2026 2:33PM

తమిళ చిత్రపరిశ్రమలో యంగ్ సెన్సేషన్‌గా పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు ప్రదీప్ రంగనాథన్ గతంలో ఎప్పుడో చేసిన సోషల్ మీడియా పోస్ట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ గ మారింది. పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు, ప్రధాని మోడీ తమిళనాడు పర్యటన సందర్భంగా ప్రదీప్ రంగనాథన్ చేసిన ట్వీట్ అది. 2018లో చేసిన ఆ ట్వీట్ ఇప్పుడు నెట్టింట ప్రత్యక్షం కావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రదీప్ రంగనాథన్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
అప్పట్లో ప్రధాని మోడీ తమిళనాడు పర్యటనను వ్యతిరేకిస్తూ ట్రెండ్ అయిన హాష్‌ట్యాగ్‌కు మద్దతుగా పెట్టిన ప్రదీప్ రంగనాథన్ ఈ పోస్టు పెట్టారు. అప్పట్లో తమిళనాట ప్రదీప్ రంగనాథన్ కు పెద్దగా గుర్తింపు, పాపులారిటీ లేదే. అయితే ఇప్పుడు తమిళ చలన చిత్ర పరిశ్రమలో నటుడిగా, దర్శకుడిగా విపరీతమైన ప్రదీప్ రంగనాథన్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఆయన పాత ట్వీట్ ట్రెండింగ్ లోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
2019 సాధారణ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించిన సమయంలో 'గో బ్యాక్ మోదీ' అనే హాష్‌ట్యాగ్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఆ సమయంలో సినీ పరిశ్రమలోకి ఇంకా అడుగుపెట్టని ప్రదీప్ రంగనాథన్ కూడా ఈ ట్రెండ్‌లో భాగమయ్యారు. 2019లో జయం రవి కథానాయకుడిగా వచ్చిన కోమలి చిత్రంతో దర్శకుడిగా పరిచయం కావడానికి ముందే ఆయన గో బ్యాక్ మోడీ పోస్టు పెట్టారు. నాడు సాదాసీదా వ్యక్తిగా ఉన్న ప్రదీప్ రంగనాథన్ చేసిన ఈ ట్వీట్ అప్పట్లో పెద్దగా ఎవరి దృష్టినీ ఆకర్షించలేదు.
అయితే.. తక్కువ కాలంలోనే తమిళ సినీ సీమలో ప్రదీప్ రంగనాథన్ స్టార్ హోదాను సొంతం చేసుకున్నారు. స్వయంగా దర్శకత్వం వహిస్తూ కథానాయకుడిగా నటించిన లవ్ టుడే' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించడమే కాకుండా, ఆయనకు నటుడిగా విశేష గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆ తర్వాత వచ్చిన డ్రాగన్, డ్యూడ్ వంటి చిత్రాలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో, తమిళ పరిశ్రమలో అత్యంత వేగంగా ఎదిగిన హీరోలలో ఒకడిగా నిలిచాడు. ఈ క్రమంలో ఆయన సామాజిక మాధ్యమ ఖాతాలను పరిశీలించిన కొందరు నెటిజన్లు, గో బ్యాక్ మోడీ ట్వీట్‌ను మళ్లీ వెలుగులోకి తెచ్చారు.

ఇటీవల ఈ పాత పోస్ట్ మళ్లీ బయటకు రావడంతో సోషల్ మీడియా వేదికగా ప్రధానమంత్రి అభిమానులు, భాజపా మద్దతుదారులు ప్రదీప్ రంగనాథన్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న వ్యక్తులు ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు.. ప్రదీప్ రంగనాథన్ అభిమానులు, మద్దతుదారులు, సాధారణ నెటిజనులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. న్లు ఆయనకు అండగా నిలుస్తున్నారు. చిత్ర పరిశ్రమలోకి రాకముందు, సాధారణ పౌరుడిగా తనకు తోచిన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ ఆయనకు ఉందంటూ సమర్థిస్తున్నారు.
గతంలో కూడా పలువురు తమిళ సినీ ప్రముఖులు రాజకీయపరమైన వ్యాఖ్యలు చేసి వివాదాల్లో చిక్కుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు రాజకీయ వాతావరణంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ, ప్రధాని మోదీ విధానాలపై వ్యతిరేకత లేదా విమర్శలు వ్యక్తం చేయడం సర్వసాధారణమైన అంశంగా ఉంది. దీంతో ప్రాంతీయ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ వివాదం ఆయన సినీ జీవితంపై లేదా ప్రజాదరణపై పెద్దగా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఇసుమంతైనా లేదంటున్నారు పరిశీలకులు. .
అయినప్పటికీ, ఈ తరహా పాత సామాజిక మాధ్యమ పోస్టులు బయటకు రావడం వల్ల సెలబ్రిటీల వ్యక్తిగత ప్రతిష్ఠకు కొంతమేర విఘాతం కలిగే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వర్ధమాన నటుడిగా అభివృద్ధి చెందుతున్న సమయంలో ఇటువంటి పాత వివాదాలు తెరపైకి రావడం పట్ల ప్రదీప్ అభిమానులు ఒకింత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ప్రదీప్ రంగనాథన్ నటించే చిత్రాల విడుదల సమయంలో ఈ వివాదాన్ని మళ్లీ తెరపైకి తెచ్చేందుకు కొన్ని వర్గాలు ప్రయత్నించే అవకాశం ఉందనేని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Pradeep Ranganathans Go Back Modi Tweet Dispute, TamilA actor Pradeep Ranganathan, Social Media Controversy, Old Tweet, netizens, Telugu One]


