TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ధనిక తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు.. బీఆర్‌ఎస్‌పై పొంగులేటి ఫైర్‌

Published on: Wed Sep 2, 2026 4:28PM

 

కేటీఆర్‌ హద్దు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు..!

బీఆర్‌ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వెయ్యి రోజుల ప్రజా పాలనలో అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని  మంత్రి పొంగులేటి  అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పాలన కొనసాగిస్తోందని చెప్పారు. హైదరాబాద్‌లోని రాష్ట్ర సచివాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్‌, అడ్లూరి లక్ష్మణ్‌, వాకిటి శ్రీహరితో కలిసి పొంగులేటి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్‌ నేతలపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

‘‘రైతే రాజుగా కాంగ్రెస్‌ పాలన కొనసాగుతోంది. గతంలో ‘వరి వేస్తే ఉరే’ అని చెప్పిన వారు.. కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అదే వరి పంటకు బోనస్‌ ఇస్తున్నాం. వరి సాగులో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. రైతుల సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.

గత ప్రభుత్వం నిరుద్యోగులను విస్మరించింది. గ్రూప్‌-1 ప్రశ్నపత్రాలను అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీజీపీఎస్సీని ప్రక్షాళన చేశాం. గ్రూప్‌-1 నియామకాలను కోర్టుల ద్వారా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఇటీవలే 10 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్నాం. గత ప్రభుత్వం చేసిన బకాయిలు, అప్పులను చెల్లిస్తూనే.. పేదలకు సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని పొంగులేటి పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ నేతలు ఉద్యోగాలు ఊడగొట్టారంటూ ప్రజలను రెచ్చగొడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ఏ కార్యక్రమాన్నీ ప్రతిపక్షాలు ప్రశంసించలేదు. ఉప ఎన్నికల్లో ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఓటమి ఎదురైనా బీఆర్‌ఎస్‌ నేతలకు జ్ఞానోదయం కాలేదు. ప్రజలు ఆ పార్టీని అసహ్యించుకుంటున్నా.. నేతల తీరు మారడం లేదు.

గతంలో బతుకమ్మ చీరల పంపిణీలోనూ అవినీతికి పాల్పడ్డారు. కేటీఆర్‌ హద్దులు మీరి మాట్లాడితే ప్రజలు క్షమించరు. రాహుల్‌గాంధీని ఉద్దేశించి ఆయన సంస్కారహీనంగా మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారు. పదేళ్లపాటు పేదలకు రేషన్‌ కార్డులు కూడా ఇవ్వలేదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోపే కొత్తగా 15 లక్షల రేషన్‌ కార్డులు అందించింది. మరోవైపు దాదాపు మూడు లక్షల మంది వితంతువులు, వృద్ధులకు కొత్తగా పింఛన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటేనని ప్రజలకు తెలుసని, మళ్లీ అధికారంలో వస్తామని కలలు కనొద్దని ఎద్దేవా చేశారు. కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూలిన తర్వాతనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ రికార్డు సృష్టించిందన్నారు

 

Ponguleti Srinivas Reddy, Telangana Congress, Telangana Government, BRS, KTR, Revanth Reddy, Telangana Politics, Telangana News, Congress Government,  Ration Cards, Farmer Bonus, Paddy Bonus, TGPSC, Telugu One, Telugu news