కాలుష్య భారతం: కాలుష్య నగరాల జాబితాలో ఇండియా టాప్.!
Published on: Tue Oct 20, 2026 6:47AM

ఇండియాలో వాయు కాలుష్యం పతాక స్థాయికి చేరింది. ప్రపంచంలో కాలుష్య నగరాల టాప్ 20 జాబితాలో భారత నగరాలు ఏకంగా 13 ఉన్నాయి. అంతర్జాతీయ నివేదికలు ఈ విషయాన్ని ఎత్తి చూపుతున్నాయి. అత్యంత కాలుష్య నగరాల గ్లోబల్ జాబితాలో ఇండియా టాప్ లో ఉంది. సోమవారం (అక్టోబర్ 13) విడుదలైన రియల్ టైమ్ డేటా ప్రకారం.. ప్రపంచంలోని టాప్ 2 కాలుష్య నగరాల జాబితాలో ఇండియాకు చెందిన 13 నగరాలు ఉన్నాయి. అయితే, ఎప్పుడూ వాయు కాలుష్యంలో అగ్రస్థానంలో ఉంటూ వార్తల్లో నిలిచే ఢిల్లీ ఈ టాప్-20 జాబితాలో లేకపోవడం గమనార్హం. ఈ నివేదిక దేశంలోని వివిధ నగరాల్లో వాయు నాణ్యత ఏ స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనవుతుందో స్పష్టం చేస్తోంది.
అందుబాటులోకి వచ్చిన రియల్ టైమ్ సమాచారం ప్రకారం, సోమవారం (అక్టోబర్ 19) డేటా మేరకు ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్ ప్రపంచ కాలుష్య నగరాల జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. ఇక్కడ వాయుకాలుష్యం ఇండెక్స్ 198గా నమోదైంది. ఇక త్రిపురలోని అగర్తలా నాలుగో స్థానంలో నిలిచింది. అలాగే రాజస్థాన్‌లోని పాలి, ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లలో వాయుకాలుష్యం ఇండెక్స్ 174గా ఉంది. ఇక పోతే మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ కూడా 174 ఏక్యూఐతో వాటితో సమానంగా నిలిచింది. హర్యానాలోని రోహ్‌తక్ 172 ఏక్యూఐ నమోదు చేసింది.
టాప్-20 జాబితాలో భారత్ నుంచి చోటు దక్కించుకున్న మిగతా నగరాల్లో రాజస్థాన్‌లోని కోటా, దేశ ఆర్థిక రాజధాని ముంబై, హాపూర్, హిసార్, బికనేర్, బరేలీఉన్నాయి. ఈ నగరాలన్నీ గాలి నాణ్యత పడిపోయి తీవ్రమైన కాలుష్య వలయంలో చిక్కుకున్నట్లు ఈ రియల్ టైమ్ డేటా స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలలో కూడా పారిశ్రామిక ఉద్గారాలు, వాహనాల రద్దీ, స్థానిక వాతావరణ మార్పుల కారణంగా గాలి నాణ్యత వేగంగా క్షీణిస్తోందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ గ్లోబల్ జాబితాలో ఇండోనేషియాకు చెందిన నగరాలు కూడా అగ్ర స్థానాలలో ఉన్నాయి. సెంట్రల్ కలిమంతన్‌లోని పలంగ్‌కరాయ్ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా మొదటి స్థానంలో నిలవగా, పాలెంబాంగ్ రెండవ స్థానంలో నిలిచింది. ఈ రెండు నగరాలు కూడా సివియర్ కాలుష్య కేటగిరీ కిందకు వస్తాయి. అలాగే ఇండోనేషియాలోని సంపిత్, జంబి నగరాలు వరుసగా 5, 6 స్థానాలను ఆక్రమించాయి. మలేషియాలోని పుత్రజయ, కౌలాలంపూర్, పెటాలింಗ್ జయ నగరాలు కూడా టాప్-20 జాబితాలో చోటు దక్కించుకున్నాయి.
ప్రస్తుత గ్లోబల్ టాప్-20 జాబితాలో ఢిల్లీ కనిపించనప్పటికీ, రాజధాని నగరంలో గాలి నాణ్యత రాత్రికి రాత్రే క్షీణించడం ఆందోళన కలిగిస్తూనే ఉంది. అక్టోబర్ 19 ఉదయం 7:31 గంటల సమయంలో ఢిల్లీలో ఎక్యూఐ గరిష్టంగా 191కి చేరుకున్నట్లు డేటా గ్రాఫ్ వెల్లడించింది. అయితే ఆ తర్వాత మధ్యాహ్నానికల్లా ఆ కాలుష్య స్థాయి క్రమంగా తగ్గుముఖం పట్టింది. ఉదయం పూట ఉండే వాతావరణ పరిస్థితుల వల్ల ఒక్కసారిగా పెరిగే కాలుష్యం, మధ్యాహ్నం గాలి వేగం పుంజుకోవడం వల్ల కొంతమేర తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక నగరంలో వాతావరణ కాలుష్యం అనేది స్థిరంగా ఉండదని, వివిధ గంటల్లో మారుతుంటుందని ఈ అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు, ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఉద్గారాల విడుదల, గాలి దిశ ఆధారంగా ఎక్యూఐ క్షణక్షణానికి మారుతూ ఉంటుంది. రియల్ టైమ్ ర్యాంకింగ్‌లు కేవలం ఆయా సమయాల్లో లభించే ఒక స్నాప్‌షాట్ మాత్రమేనని, ప్రతి గంటకు ఇవి మారుతుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఒక రోజు గ్లోబల్ లిస్ట్‌లో పేరు లేనంత మాత్రాన ఆ ప్రాంతంలో గాలి స్వచ్ఛంగా ఉందని భావించడం సరికాదంటున్నారు.
యూఎస్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ప్రమాణాల ప్రకారం, 151 నుంచి 200 మధ్య ఉండే రీడింగ్‌లుఆరోగ్యానికి చేటు చేస్తుంది. అదే విలువ 200 దాటితే సివియర్ అన్ హెల్తీగా పరిగణించాల్సి ఉంటుంది. గ్లోబల్ జాబితాలో పేరు లేకపోయినా, ఈ స్థాయి కాలుష్యం చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ, గుండె సంబంధిత వ్యాధులతో బాధపడేవారిపై పడే ప్రభావం తీవ్రంగా ఉంటుంది. నగరాల్లో పెరుగుతున్న వాహనాల రద్దీ నియంత్రించడం, పారిశ్రామిక ఉద్గారాలపై కఠినమైన నిబంధనలు అమలు చేయడం, చెత్తను బహిరంగంగా కాల్చడాన్ని అరికట్టడం వంటి పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు, ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడం ద్వారానే ఈ కాలుష్య మహమ్మారిని తరిమికొట్టగలం.
[Pollution in India, India Air Pollution, Most Polluted Cities India, AQI India cities, Delhi AQI, Global Ranking, Telugu One]


