TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పోలీస్ అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వం అండ: సీఎం రేవంత్ రెడ్డి

Published on: Wed Oct 21, 2026 11:07AM

పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీస్ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. సమాజం కోసం, ప్రజల భద్రత కోసం ప్రాణాలను త్యాగం చేసిన పోలీసుల సేవలను ఎప్పటికీ మరువలేమని పేర్కొన్నారు. అమరవీరుల కుటుంబాలు ఒంటరివి కావని, వారికి తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ, సమాజం అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయమని సీఎం అన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని, రాష్ట్ర అభివృద్ధికి శాంతి, భద్రతలు ఎంతో అవసరమని స్పష్టం చేశారు. అందుకే తమ ప్రభుత్వం పోలీస్ శాఖకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని వెల్లడించారు.

పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాల భర్తీ.!

పోలీస్ శాఖలో మరో 5 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టామని సీఎం తెలిపారు. 2027 నాటికి శాఖలోని అన్ని ఖాళీలను భర్తీ చేస్తామని ప్రకటించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 112 మంది డీఎస్పీలను నియమించామని చెప్పారు. ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్ అసిస్టెంట్లుగా నియమించడం ద్వారా వారి ఆత్మగౌరవాన్ని పెంచే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు.

అమరవీరుల కుటుంబాలకు భారీగా ఎక్స్‌గ్రేషియా పెంపు.!

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే పోలీసుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియాను తమ ప్రభుత్వం గణనీయంగా పెంచిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. గతంలో కానిస్టేబుళ్లకు రూ.40 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచినట్లు తెలిపారు. హెడ్ కానిస్టేబుళ్లు, ఏఎస్‌ఐలకు గతంలో రూ.45 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.కోటికి పెంచామని చెప్పారు.

ఎస్‌ఐలకు రూ.45 లక్షలు, ఇన్‌స్పెక్టర్లకు రూ.50 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.1.25 కోట్లకు పెంచినట్లు వివరించారు. డీఎస్పీ, అదనపు ఎస్పీ స్థాయి అధికారులకు గతంలో రూ.50 లక్షలుగా ఉన్న పరిహారాన్ని రూ.1.50 కోట్లకు పెంచామని తెలిపారు. ఎస్పీ, ఐపీఎస్ అధికారులకు గతంలో రూ.కోటిగా ఉన్న పరిహారాన్ని రూ.2 కోట్లకు పెంచినట్లు వెల్లడించారు.ఈ పరిహారం కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదని, అమరవీరుల కుటుంబాల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న గౌరవానికి నిదర్శనమని సీఎం పేర్కొన్నారు.

హోంగార్డుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పెంపు.!

హోంగార్డుల సంక్షేమంపైనా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రేవంత్ రెడ్డి తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయే హోంగార్డుల కుటుంబాలకు ప్రస్తుతం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా అందిస్తున్నామని చెప్పారు. ఈ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచాలని డీజీపీని ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు.అలాగే, పోలీసుల పిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించామని తెలిపారు. హోంగార్డు నుంచి డీజీపీ స్థాయి వరకు పోలీస్ సిబ్బంది పిల్లలకు ఈ పాఠశాలలో అవకాశం కల్పించామని వివరించారు.

ఆధునిక సాంకేతికతతో పోలీస్ శాఖ బలోపేతం.!

కాలంతో పాటు నేరాల స్వభావం మారుతోందని, కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖను ఆధునీకరించాల్సిన అవసరం ఉందని సీఎం అన్నారు. నేరాల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకోవాలని నిర్ణయించినట్లు తెలిపారు. అయితే, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా పోలీసులు మానవీయ దృక్పథాన్ని కోల్పోకూడదని సూచించారు.

డ్రగ్స్, గంజాయి వ్యాప్తి సమాజానికి, ముఖ్యంగా యువతకు తీవ్ర ప్రమాదకరమని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. డ్రగ్స్ నియంత్రణలో ఈగల్ ఫోర్స్ పనితీరును, డీజీపీ కృషిని అభినందించారు.కల్తీ ఆహారాన్ని అరికట్టేందుకు టీజీ సేఫ్ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని తెలిపారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ సేవలను కొనసాగిస్తూ మరింత బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక చర్యలు.!

మహిళలకు అండగా నిలిచే సామాజిక బాధ్యతను పెంచేందుకు ఈ ఏడాది మార్చిలో ‘స్టాండ్ విత్ హర్’ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సీఎం తెలిపారు. మహిళలు, చిన్నారులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తక్షణ రక్షణ కల్పించేందుకు ఏప్రిల్‌లో ‘స్పందన – తక్షణ రక్షణ’ బృందాలను ప్రారంభించామని వెల్లడించారు.

మహిళలు, చిన్నారులకు సంబంధించిన కేసుల్లో పోలీసులు మరింత సున్నితంగా వ్యవహరించాలని సూచించారు. బాధితులకు న్యాయం అందించడంలో ఎలాంటి జాప్యం జరగకూడదని స్పష్టం చేశారు. మహిళల భద్రత కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

అమరవీరుల కుటుంబాలకు సీఎం భావోద్వేగ భరోసా.!

పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగంగా మాట్లాడారు. వారు కోల్పోయిన వ్యక్తులను ఎవరూ తిరిగి తీసుకురాలేరని, వారి కుటుంబాల్లో ఏర్పడిన లోటును ఎవరూ పూర్తిగా భర్తీ చేయలేరని అన్నారు. అయితే, ఆ బాధలో వారు ఒంటరివారు కాదని, తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ, సమాజం ఎల్లప్పుడూ అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు.

పోలీస్ శాఖలో పనిచేస్తున్న ప్రతి అధికారి, సిబ్బంది క్రమశిక్షణను బలంగా, నిజాయితీని గౌరవంగా భావించాలని సూచించారు. ప్రజలకు భరోసా కల్పించడమే పోలీసులకు లభించే గొప్ప గుర్తింపు అని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీసులు అంకితభావంతో పనిచేయాలని, వారి సంక్షేమానికి, కుటుంబాల భవిష్యత్తుకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. పోలీస్ అమరవీరుల త్యాగాలను గౌరవిస్తూ, వారి ఆశయాలను కొనసాగించాలని సీఎం పిలుపునిచ్చారు. శాంతియుతమైన, సురక్షితమైన, అభివృద్ధి చెందిన తెలంగాణ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆకాంక్షించారు.

 

 

 

 

[ Police Commemoration Day, CM Revanth Reddy, Police Martyrs Memorial Day, Telangana Police, Police Martyrs Tribute, Telangana Government, Police Jobs Recruitment, 5000 Police Jobs, Police Ex Gratia, Police Welfare, Home Guards Ex Gratia, Young India Police School, Telangana DGP, Eagle Force, Drug Control, Telangana Safe, Women Safety, CP Sajjanar, DGP C.V. Anand ]