సీబీఐ ఆఫీసర్‌పైనే కేసు.. వివేకా కేసులో ట్విస్టులు..
Published on: Wed Feb 23, 2022 10:15AM
సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్. మహా ఖతర్నాక్ ఆఫీసర్. అప్పట్లో జగన్ ఆస్తుల కేసును విచారించిన సీబీఐ జేడీ లక్ష్మినారాయణ ఎలానో.. ఇప్పుడు వివేకా మర్డర్ కేసులో ఏఎస్పీ రామ్‌సింగ్ అలానే దూకుడుగా దర్యాప్తు చేస్తున్నారు. తగ్గేదేలే.. బెదిరేదేలే.. అంటూ హత్య కేసులో కుట్రదారులైన పెద్దలనూ బయటకు లాగుతున్నారు. ఇప్పుడిప్పుడే అసలు డొంక కదులుతుండటంతో.. ఆ పెద్దల్లో వణుకు మొదలైంది. బహుషా అందుకే కాబోలు.. విచారణ చేస్తున్న అధికారినే భయభ్రాంతులకు గురి చేసేలా కొన్ని ఘటనలు జరుగుతున్నాయని అంటున్నారు. వాటి వెనుక ఆ పెద్దల హస్తం ఉందనే అనుమానాలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగిందంటే...
వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఏఎస్పీ రామ్‌సింగ్‌పై ఏపీ పోలీసులు కేసు నమోదు చేశారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలంటూ బెదిరిస్తున్నారని, దాడిచేశారని, నేరపూరిత బెదిరింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఐపీసీలోని 195ఏ, 323, 506 రెడ్‌విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ నెల 18న కడపలోని రిమ్స్ పోలీసుస్టేషన్‌లో ఈ మేరకు కేసు నమోదైంది. కడప ఫస్ట్ క్లాస్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్, స్పెషల్ మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.
వివేకా హత్య కేసులో సీబీఐ తనను వేధిస్తోందని, ఏఎస్పీ రామ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలంటూ ఈ కేసులో అనుమానితుడైన గజ్జల ఉదయ్ కుమార్‌రెడ్డి ఈ నెల 15న కడప పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే అంశంపై అంతకు ముందు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో వివరించారు.
గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డి తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారంలో ఉద్యోగిగా పనిచేశారు. వివేకా హత్య కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిపై కూడా సునీత అనుమానం వ్యక్తం చేశారు. "వివేకా మృతి సమాచారం అందరికంటే ముందు ఉదయ్‌కుమార్‌రెడ్డికే తెలుసు. హత్య జరిగిన రోజు వేకువజామున 3.30 గంటలకే ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లారు. ఈ విషయాన్ని ఆయన తల్లి సాధారణ సంభాషణల్లో ఆమె స్నేహితులకు చెప్పారు" అంటూ సునీత ఆ పిటిషన్‌లో ప్రస్తావించారు.
వివేకా కేసులో ఉదయ్‌కుమార్‌రెడ్డిని సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. ఉదయ్‌కుమార్‌రెడ్డి తండ్రి గజ్జల ప్రకాశ్‌రెడ్డి ఈసీ గంగిరెడ్డి ఆసుపత్రిలో కాంపౌండర్‌గా పనిచేసేవారు. వివేకా మృతదేహంపై ఉన్న గాయాలకు ఆయనే కట్లు కట్టారు. సీబీఐ ఆయననూ పలుమార్లు విచారించింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు దర్యాప్తులో కీలకంగా వ్యవహరిస్తున్న సీబీఐ ఏఎస్పీపైనే ఏపీ పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశమైంది. ఉదయ్‌కుమార్‌రెడ్డి కేసు పెట్టడం, కోర్టుకు వెళ్లడం వెనుక.. కొందరి హస్తం ఉందనే అనుమానం కలుగుతోంది.
also read: అప్పుడు లక్ష్మీనారాయణ.. ఇప్పుడు రాంసింగ్..


