ఉత్తరాంధ్రకు గోదావరి జల సిరులు.. ప్రగతి పరుగులకు బాటలు.!
Published on: Wed Sep 2, 2026 5:57PM

గోదావరి జలాలతో ఉత్తరాంధ్ర పులకరించింది. దశాబ్దాలుగా వెనుకబాటుతనం, నీటి ఎద్దడి, వలసల నడుమ కొట్టుమిట్టాడుతున్న ఉత్తరాంధ్రకు గోదావరి జలాల రాక చారిత్రాత్మక మలుపు. పోలవరం ప్రాజెక్టు తుది రూపు దాల్చేవరకు వేచి చూడకుండా, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఫస్ట్ ఫేజ్‌లోకి నీటిని విడుదల చేసి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జలహారతి ఇచ్చారు.
బుధవారం చంద్రబాబు గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు విడుదల చేయడం వెనుక ప్రణాళికాబద్ధమైన వ్యూహం ఉంది. జగన్ హయాంలో విశాఖ రాజధాని అంటూ ఐదేళ్ల పాటు నానా ఆర్భాటం చేసి కూడా ఆ దిశగా ఒక్క ఇటుక పేర్చ లేదు. పోలవరం పనులను, ఉత్తరాంధ్రకు జలాల విడుదల దిశగా తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదు. అటువంటిది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన రెండేళ్లలోనే పనులను పరుగులు పెట్టించింది. ఉత్తరాంధ్ర వాసులకు జలసిరిని చేర్చింది.
పోలవరం ఎడమ కాలువ నిర్మాణం ఇంజనీరింగ్ పరంగా కిష్టమైన వ్యవహారం. ఏలేరు, పంపా, తాండవ, శారద, వరాహ వంటి ఐదు నదులను దాటుకుంటూ, 11 ప్రాంతాల్లో జాతీయ రహదారులను క్రాస్ చేస్తూ ఈ కాలువ నిర్మాణంజరిగింది. అలాగే భూసేకరణ చిక్కుళ్లను పరిష్కరించడమే కాకుండా, 100 మీటర్ల లోతు వరకు కొండను తొలిచి మరీ పోలవరం ఎడమ కాలువ పనులను నిర్ణీత కాలంలో పూర్తి చేయడం అంటే.. ఉత్తరాంధ్రకు జలసిరులను అందించాలన్న ప్రభుత్వ చిత్తశుద్ధికి, సంకల్పానికి నిలువెత్తు నిదర్శనంగా చెప్పాల్సి ఉంటుంది.
.webp)
ఈ మహాయజ్ణం లాంటి ఈ పోలవరం పనులను నిర్దుష్ట కాల వ్యవధిలో పూర్తి చేసి ఉత్తరాధ్ర సాగు, తాగు నీటి కొరత తీర్చడమే కాదు.. ఈ ప్రాంత పారిశ్రామిక రంగ అభివృద్ధికి కూడా దోహదపడుతుంది. విశాఖ స్టీల్ ప్లాంట్, సహా ఉత్తరాంధ్రలో ముందు ముందు రానున్న పరిశ్రమలకు కూడా నీటి భద్రతకు ఢోకా లేకుండా చేస్తుందనడం లో సందేహం లేదు. గోదావరి జలాల రాక ఉత్తరాంధ్రకు పెట్టుబడుల వరద పారిస్తుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఉత్తరాంధ్ర, ముఖ్యంగా శిక్కోలు వలసలకు ఇది శాశ్వతంగా చెక్ పెడుతుందని చెబుతున్నారు.
ఇప్పటికే కృష్ణా జలాలను ఉమ్మడి ప్రకాశం జిల్లాకు, గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలిస్తూ నదుల అనుసంధాన ప్రక్రియను ముందుకు తీసుకువెడుతున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం.. రాబోయే రెండేళ్లలో పాతిక వందల కోట్ల రూపాయల వ్యవయంతో ఉత్తరాంధ్రలోని 11 ప్రాధాన్యతా ప్రాజెక్టులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే సుదీర్ఘ కాలంగా కాగితాలకే పరిమితమైన నేరడి బ్యారేజీకి అనుమతులు సాధించి, పనులు పట్టాలెక్కిస్తుండటం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉత్తరాంధ్ర ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నదనడానికి నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Polavaram Left Canal, Godavari Waters to North Andhra, Chandrababu Naidu, , North Andhra Sujala Sravanthi, Water Crisis, Industrial developement]


