TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నోటీసు వచ్చినా PNG తీసుకోలేదా? మీ LPG సిలిండర్ కట్: కొత్త నిబంధనలు ఇవే!

Published on: Mon Aug 24, 2026 11:39AM

భారతదేశంలో వంటగ్యాస్ వినియోగదారుల కోసం కేంద్ర పెట్రోలియం మరియు సహజ వాయు మంత్రిత్వ శాఖ ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. మీ పరిసరాల్లో లేదా మీ సొసైటీలో పైప్‌లైన్ నేచురల్ గ్యాస్ (పిఎన్‌జి) నెట్‌వర్క్ అందుబాటులో ఉండి, అధికారులు మీకు నోటీసు జారీ చేసిన తర్వాత కూడా మీరు పిఎన్‌జి కనెక్షన్ తీసుకోకపోతే, మీ ఎల్‌పిజి గ్యాస్ సిలిండర్ సరఫరాను శాశ్వతంగా నిలిపివేస్తారు. "ఒక ఇల్లు - ఒక వంటగ్యాస్ కనెక్షన్" విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ కఠినమైన నిబంధనలను అమల్లోకి తెచ్చింది. ఇప్పటికే ఇండియన్ ఆయిల్ (ఇండేన్), భారత్ పెట్రోలియం (భారత్ గ్యాస్), హిందూస్తాన్ పెట్రోలియం (హెచ్‌పి గ్యాస్) వంటి దిగ్గజ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

ఈ కొత్త నిబంధనల ప్రకారం, మీ ప్రాంతంలో పిఎన్‌జి పైప్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి వచ్చిన వెంటనే స్థానిక గ్యాస్ వితరణ సంస్థలు వినియోగదారులకు అధికారిక నోటీసులు పంపుతాయి. ఈ నోటీసు అందిన నాటి నుండి సరిగ్గా 3 నెలల వ్యవధి (90 రోజులు) లోపు వినియోగదారులు పిఎన్‌జి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత 3 నెలల గడువు ముగిసినా దరఖాస్తు చేయకపోతే, మీ ఎల్‌పిజి కనెక్షన్ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది మరియు సిలిండర్ రీఫిల్‌ను నిలిపివేస్తారు. పైప్‌లైన్ కనెక్షన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు హౌసింగ్ సొసైటీలు లేదా అపార్ట్‌మెంట్ అసోసియేషన్లు కేవలం 3 పనిదినాల్లో (3 working days) అవసరమైన అనుమతులు జారీ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాకుండా, దరఖాస్తు చేసుకున్న కేవలం 48 గంటల వ్యవధిలోనే వినియోగదారుడి ఇంటికి లాస్ట్-మైల్ పిఎన్‌జి కనెక్టివిటీ అందించాలని గ్యాస్ కం"పెనీలను నిర్దేశించారు.

ఎల్‌పిజి కంట్రోల్ ఆర్డర్‌లోని షెడ్యూల్ 1 క్రమ సంఖ్య 13ను సవరించిన కేంద్ర ప్రభుత్వం, పిఎన్‌జి సౌకర్యం ఉన్న గృహాలకు ఎల్‌పిజి సిలిండర్లు సరఫరా చేయడాన్ని చట్టవిరుద్ధంగా ప్రకటించింది. అయితే, భౌగోళిక లేదా నిర్మాణపరమైన సమస్యల వల్ల ఏవైనా ఇళ్లకు పిఎన్‌జి పైప్‌లైన్ కనెక్షన్ ఇవ్వడం "సాంకేతికంగా అసాధ్యం" (Technically Infeasible) అని సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ గుర్తిస్తే, వారికి ప్రత్యేకంగా 'నో అబ్జెక్షన్ సర్టిఫికేట్' (NOC) మంజూరు చేస్తారు. అలాంటి కుటుంబాలకు మాత్రమే ఎల్‌పిజి సిలిండర్ల సరఫరా నిరంతరాయంగా కొనసాగుతుంది. పిఎన్‌జికి మారే వినియోగదారులు తమ పాత ఎల్‌పిజి సిలిండర్ మరియు రెగ్యులేటర్‌ను గ్యాస్ డిస్ట్రిబ్యూటర్‌కు సమర్పించి, తాము చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ సొమ్మును తిరిగి పొందవచ్చు. లేదా భవిష్యత్తు అవసరాల కోసం ఆ కనెక్షన్‌ను 'సేఫ్ కస్టడీ'లో ఉంచుకునే వెసులుబాటును కూడా కల్పించారు.

ఈ బృహత్తర మార్పును జిల్లాల వారీగా సమర్థవంతంగా అమలు చేయడానికి పెట్రోలియం మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రత్యేక లేఖ రాసింది. ప్రతి జిల్లాలో ఒక సీనియర్ జిల్లా స్థాయి నోడల్ ఆఫీసర్‌ను నియమించాలని, అలాగే పిఎన్‌జి కోఆర్డినేషన్ కమిటీలను (PCC) ఏర్పాటు చేయాలని ఆదేశించింది. ఈ కమిటీలు మహానగర్ గ్యాస్, ఇంద్రప్రస్థ గ్యాస్, అదానీ టోటల్ గ్యాస్, గెయిల్ ఇండియా వంటి ప్రముఖ సిటీ గ్యాస్ సంస్థలు మరియు ప్రభుత్వ ఆయిల్ కంపెనీల మధ్య సమన్వయం కుడురుస్తాయి. వీధులు, సొసైటీల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించి, వినియోగదారులలో అవగాహన పెంచడం మరియు పిఎన్‌జికి మారే ప్రక్రియను వేగవంతం చేయడం ఈ అధికారుల ప్రధాన బాధ్యత.