TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీతం 11 వేలు.. లగ్జరీ లైఫ్.. పీఎన్బీ నకిలీ కరెన్సీ కేసు.!

Published on: Wed Sep 16, 2026 11:10AM

పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో నకిలీ కరెన్సీ కేసులో తవ్వేకొద్దీ విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు దర్యాప్తులో  జాతీయ దర్యాప్తు సంస్థ దూకుడు పెంచింది.  ఈ వ్యవహారంలో ఇప్పటికే సస్పెన్షన్‌కు గురైన కరెన్సీ చెస్ట్ మేనేజర్ అమిత్ కుమార్‌ను అరెస్ట్ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ.. ఇప్పుడు ఈ కేసులో భాగమైన పలువురు కింది స్థాయి,  కాంట్రాక్ట్ సిబ్బంది ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తోంది. ప్రధానంగా..  నామమాత్రపు వేతనంతో పనిచేస్తున్న ఓ అవుట్‌సోర్సింగ్ ఉద్యోగి భారీ ఎత్తున విలాసవంతమైన ఆస్తులను కూడబెట్టుకోవడం దర్యాప్తులో అత్యంత కీలక పరిణామంగా మారింది. ఈ నకిలీ నోట్ల రాకెట్‌కు, ఈ అసాధారణ ఆస్తుల సంపాదనకు మధ్య ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో ఎన్ఐఏ  దర్యాప్తు జరుపుతోంది. 

ఈ కుంభకోణానికి సంబంధించి..  ఉత్తరప్రదేశ్‌లోని సహారన్‌పూర్‌లో ఉన్న పీఎన్‌బీ కరెన్సీ చెస్ట్ నుంచి ఏకంగా రూ. 17.29 కోట్ల విలువైన నకిలీ కరెన్సీ నోట్లు బయటపడటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తొలుత స్థానిక పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఎన్‌ఐఏ దర్యాప్తును తన చేతిలోకి తీసుకుంది. ఈ దర్యాప్తులో భాగంగా కరెన్సీ చెస్ట్‌లో పనిచేసే ఉద్యోగుల కదలికలు, రికార్డులు, లావాదేవీల చరిత్రను ఎన్ఐఏ నిశితంగా పరిశీలిస్తోంది.  ఈ క్రమంలోనే అక్కడ డ్రైవర్ కమ్ లోడర్‌గా పనిచేస్తున్న ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి జీవనశైలి, ఆర్థిక లావాదేవీలు అధికారులను విస్మయానికి గురిచేశాయి. నెలకు కేవలం రూ. 11 వేల వేతనం మాత్రమే పొందే ఆ వ్యక్తి పేరుపై ఏకంగా ఐదు ఇళ్లు, ఒక ఎస్‌యూవీ, ఒక సెడాన్ కారుతో పాటు రెండు మోటార్ సైకిళ్లు ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైంది.

కేవలం ఆస్తుల కూడబెట్టడమే కాకుండా, సదరు కాంట్రాక్ట్ ఉద్యోగి విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు తేలింది.  తనకు అధికారికంగా డ్రైవింగ్ బాధ్యతలు ఉన్నప్పటికీ, అతను స్వయంగా వాహనం నడపకుండా రోజూవారీ వేతనం కింద మరో డ్రైవర్‌ను రూ. 500 చెల్లించి నియమించుకున్నట్లు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా, సస్పెన్షన్‌కు గురైన కరెన్సీ చెస్ట్ మేనేజర్ అమిత్ కుమార్‌తో ఈ కాంట్రాక్ట్ ఉద్యోగి అత్యంత సన్నిహితంగా మెలిగినట్లు ఆరోపణలున్నాయి. అధికారికంగా కేవలం లోడింగ్,  డ్రైవింగ్ పనులు చూడాల్సిన ఇతను, మేనేజర్‌కు వ్యక్తిగత సహాయకుడిలా వ్యవహరిస్తూ కరెన్సీ చెస్ట్ లోపలి క్యాష్ హ్యాండ్లింగ్ ఏరియాలకు కూడా సులభంగా వెళ్లేవాడని విచారణలో తేలింది. దీనితో అతనికి అసలు ఈ నకిలీ నోట్ల రాకెట్‌తో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సంబంధం ఉందా అనే కోణంలో ఆరా తీస్తున్నారు.

ఈ కుంభకోణాన్ని మరింత లోతుగా ఛేదించేందుకు ఎన్‌ఐఏ ప్రధానంగా నాలుగు కీలక అంశాలపై దృష్టి సారించింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నిబంధనల ప్రకారం అసలు కరెన్సీ ఉండాల్సిన ఈ చెస్ట్‌లోకి రూ. 17.29 కోట్ల నకిలీ నోట్లు ఎప్పుడు, ఎలా ప్రవేశపెట్టారనే దానిపై కూపీ లాగుతున్నారు. బ్యాంక్ లోపలి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు, అసలు నోట్లను నకిలీ నోట్లతో మార్పిడి చేశారా లేదా అనే కోణంలో తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకవేళ నోట్ల మార్పిడి జరిగితే, అసలైన నిజమైన నగదు ఎక్కడికి తరలిపోయింది? దీని వెనుక అంతర్జాతీయ లేదా రాష్ట్రాల స్థాయి వ్యవస్థీకృత ముఠాల హస్తం ఉందా అనే కోణంలోనూ ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో భాగంగా అధికారులు ఇటీవల మనాక్‌మౌ ప్రాంతంలోని సదరు ఉద్యోగి నివాసంలో సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.బ్యాంకింగ్ వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసేలా ఉన్న ఈ నకిలీ కరెన్సీ రాకెట్‌కు సంబంధించిన మూలాలను పూర్తిగా ఛేదించే దిశగా ఎన్ఐఏ దర్యాప్తు సాగుతోంది.  భావిస్తున్నారు.

[PNB fake currency scam, NIA investigation, Saharanpur currency chest, Amit Kumar suspension, counterfeit notes India]