ప్రధాని మోదీకి ఉజ్బెకిస్థాన్ అత్యున్నత పురస్కారం..!
Published on: Sun Aug 30, 2026 4:01PM
.webp)
భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయ దౌత్య చరిత్రలో మరొక అరుదైన మైలురాయిని చేరుకున్నారు. రెండు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం ఉజ్బెకిస్థాన్ రాజధాని తాష్కెంట్‌కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆ దేశ అధ్యక్షుడు షవ్కత్ మిర్జియోయేవ్ అత్యంత ఘన స్వాగతం పలికారు. అంతేకాకుండా, రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ప్రపంచ స్థాయిలో భారతదేశ ప్రతిష్టను పెంచడంలో ప్రధాని మోదీ చూపిన అసాధారణ దౌత్య ప్రతిభకు గుర్తింపుగా ఉజ్బెకిస్థాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారం 'ఆర్డర్ ఆఫ్ ఓలీ దరజాలీ దోస్త్లిక్' (Order of Oliy Darajali Dustlik) ని ప్రధానం చేశారు. తాష్కెంట్‌లో జరిగిన అత్యంత వైభవంగా నిర్వహించిన కార్యక్రమంలో అధ్యక్షుడు మిర్జియోయేవ్ స్వయంగా ఈ విశిష్ట పురస్కారాన్ని మోదీకి అందజేశారు. ప్రధాని మోదీకి లభించిన 26వ అంతర్జాతీయ అత్యున్నత పౌర పురస్కారం కావడం విశేషం.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును స్వీకరించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఎంతో భావోద్వేగంగా ప్రసంగించారు. ఉజ్బెకిస్థాన్ ప్రభుత్వం మరియు ప్రజలు తనపై చూపించిన అమితమైన ప్రేమ, నమ్మకానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ 'దోస్త్లిక్' అంటే ఉజ్బెకిస్థాన్ భాషలో 'స్నేహం' అని అర్థమని, భారతదేశంలో కూడా స్నేహితుడిని 'దోస్త్' అని పిలుచుకుంటామని పేర్కొన్నారు.
ఈ భావనాత్మక పోలిక రెండు దేశాల సాంస్కృతిక సంబంధాలకు నిదర్శనమని చెప్పారు. ఈ గౌరవం కేవలం తన ఒక్కడికి దక్కినది కాదని, 140 కోట్ల మంది భారతీయ ప్రజల కష్టానికి, ప్రతిభకు లభించిన గుర్తింపు అని సగర్వంగా ప్రకటించారు. ఈ అత్యున్నత అవార్డును 140 కోట్ల మంది భారతీయులకు మరియు భారత్-ఉజ్బెకిస్థాన్ మధ్య ఉన్న చిరకాల మైత్రికి అంకితం ఇస్తున్నట్లు మోదీ వెల్లడించారు.
రెండు దేశాల అగ్రనేతల మధ్య జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో కీలక రంగాలపై విస్తృత ఒప్పందాలు కుదిరాయి. 'వికసిత్ భారత్ 2047' సాధన దిశగా భారత్ వేస్తున్న వేగవంతమైన అడుగులు, 'యాంగి ఉజ్బెకిస్థాన్' (నూతన ఉజ్బెకిస్థాన్) విజన్‌లు పరస్పరం సహకరించుకునేలా ప్రణాళికలు రూపొందించారు. ప్రధానంగా వ్యాపారం, మౌలిక సదుపాయాలు, డిజిటల్ కనెక్టివిటీ, రక్షణ రంగం ఇంధన భద్రత రంగాల్లో 10కి పైగా కీలక రంగాలు వేగవంతమైన వృద్ధిని సాధించేందుకు ఒప్పందాలు చేసుకున్నారు.
మధ్య ఆసియా ప్రాంతంలో భారతదేశానికి ఉజ్బెకిస్థాన్ ఒక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ పర్యటన ముగించుకుని మోదీ ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 1 వరకు కిర్గిజ్ రిపబ్లిక్‌లో జరగనున్న 26వ షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొననున్నారు. అంతర్జాతీయ వేదికపై భారతదేశ గళం మరింత బలంగా వినిపించడానికి ఈ పురస్కారం ఒక ఉత్ప్రేరకంగా నిలుస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
PM Narendra Modi, Uzbekistan Highest Civilian Honour, Order of Oliy Darajali Dustlik, Shavkat Mirziyoyev, Tashkent Bilateral Summit, India Uzbekistan Relations


